Ancient Copper Foil in Srisailam Temple: శ్రీశైలం దేవస్థానం పరిధిలోని ఘంటా మఠం పునరుద్ధరణ పనులు చేస్తున్న సందర్భంలో లభ్యమైన పురాతన రాగి రేకులపై పలు శాసనాలున్నట్లు పురావస్తు శాఖ అధికారులు గుర్తించారు. సుమారు ఎనిమిది సంవత్సరాల కిందట ఇక్కడ పునరుద్ధరణ పనులు చేపట్టగా, అప్పట్లో 20 సెట్ల రాగి రేకులు, మరికొన్ని బంగారు నాణేలు లభ్యమయ్యాయి. వీటిని పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని వాటిలోని సమాచారాన్ని వెలుగులోకి తెచ్చేందుకు పరిశోధించారు. ఇవి దాదాపు 12-16 శతాబ్దాల మధ్య కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ రాగి రేకులపై తెలుగు, సంస్కృతం, ఒడియా, కన్నడ భాషల్లో రెడ్డి రాజులు, గజపతులు, విజయనగర చక్రవర్తులు కొన్ని శాసనాలు రాయించినట్లు నిర్ధరించారు. శ్రీశైల ఆలయ చరిత్రకు ఇవి ఆధారాలుగా చెబుతున్నారు. ఆలయానికి దాతల వితరణ, అభివృద్ధి పనులకు సంబంధించిన వివరాలు కూడా ఈ రాగి రేకులపై పొందుపరిచినట్లు సమాచారం. ఇటువంటి కీలక ఆధారాలతో భారతీయ పురావస్తు శాఖ సంచాలకుడు కె.మునిరత్నంరెడ్డి సమగ్ర సమాచారంతో ఒక పుస్తకం రాశారు. రెండు మూడు నెలల్లో దీన్ని ఆవిష్కరించనున్నట్లు ఆయన వెల్లడించారు.
అజంతా అందాలతో ఏలూరు జిల్లాలో ప్రాచీన బౌద్ధారామం - GUNTUPALLI BUDDHIST CAVES