Air Pollution In Hyderabad : హైదరాబాద్‌లో రోజురోజుకూ వాయు నాణ్యత క్షీణిస్తోంది. నగరంలో డీజిల్ ఆటోలు నిబంధనలకు విరుద్దంగా శివార్లలో తిప్పుతుండటంతో విపరీతంగా కాలుష్యం నమోదవుతుంది. గాలిలో సూక్ష్మధూళి కణాలు పెరిగి, వాయు నాణ్యత క్షీణిస్తోంది. డీజిల్ ఆటోలకు బదులు ఎల్పీజీ, సీఎన్జీలు వాడాలని 15 ఏళ్ల కిందటే తెలిపారు.
నగరంలో 95 శాతం సీఎన్జీ లేదా ఎల్పీజీ ఆటోలు నడుస్తుండగా, శివార్లలో మాత్రం భిన్నమైన పరిస్థితి నెలకొంది. డీజిల్ ఆటోలకు బదులుగా సీఎన్జీ, పీఎన్జీ ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించొచ్చని నిపుణులు తెలుపుతున్నారు. ఆర్టీసీ సైతం డీజిల్ బస్సులను పక్కనపెడుతూ ఎలక్ట్రిక్ వాహనాల వైపు అడుగులేస్తోంది. వాహనదారులు సైతం ఇదే మార్గం అనుసరిస్తే దిల్లీ తరహా ఇబ్బందులు ఉండవని నిపుణులు సూచిస్తున్నారు.
పీసీబీ నివేదిక ప్రకారం : కోకాపేట్, జూపార్కు, శేరిలింగంపల్లి, బాలానగర్, బాచుపల్లి, జీడిమెట్ల, చార్మినార్, ఎంజీబీఎస్, ఉప్పల్ ప్రాంతాల్లో సూక్ష్మ ధూళి కణాల స్థాయి అధికంగా ఉందని సర్వేలు తెలుపుతున్నాయి. కోకాపేట్, జూపార్కు, హెచ్‌సీయూ, ఇక్రిశాట్, బొల్లారం ప్రాంతాల్లో వాయు నాణ్యత క్రమ క్రమంగా తగ్గుతూ వస్తుంది. సాధారణంగా వాయునాణ్యత సూచీ 100కి తక్కువగా ఉండాలి. దాని కన్నా ఎక్కువగా 101 నుంచి 200 మధ్య ఉంటే ఆస్తమా, గుండె, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నవారికి ఇబ్బందులు తప్పవు. 200 నుంచి 300 మధ్య ఉంటే దీర్ఘకాలంలో అనారోగ్య సమస్యలు వస్తాయి.
ఘాటు వాసనలపై ప్రత్యేక నిఘా : పరిశ్రమల నుంచి వెలువడే ఘాటు వాసనలతో నగరవాసులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో కట్టడికి పీసీబీ కసరత్తు ప్రారంభించింది. పరిశ్రమలపై నిఘా పెట్టేందుకు ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్, అనలిస్ట్‌తో కూడిన ఐదు బృందాలు ఏర్పాటు చేసింది. ఈ బృందాలు ఉదయం, రాత్రి వేళల్లో పారిశ్రామిక వాడల్లో కార్యకలాపాలను నిశితంగా గమనిస్తాయి.
పరిశ్రమల్లో కాలుష్య కట్టడి, వ్యర్థాల డంపింగ్, ఘాటు వాసనల కట్టడి తదితర అంశాలను పర్యవేక్షిస్తాయి. ఈ బృందాలు నిత్యం పరిశ్రమల కార్యకలాపాలను పర్యవేక్షిస్తాయి. ఉదయం ప్రత్యేక బృందాల పర్యవేక్షణతో పాటు రాత్రి నైట్ పెట్రోలింగ్‌ను పటిష్ఠం చేసినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే పీసీబీ కేంద్ర కార్యాలయం, హైదరాబాద్, రామచంద్రాపురం జోన్ల పరిధిలో 3 నైట్ ప్యాట్రోలింగ్ వాహనాలు తిరుగుతున్నాయి. రోజువారీ నిఘాతో ఈ బృందాలు ఇచ్చే వివరణ, నివేదికపై ‘పీసీబీ సభ్య కార్యదర్శి’ స్థాయిలో సమీక్ష జరుగుతుంది. అనంతరం కాలుష్య నియంత్రణపై విధివిధానాలు రూపొందిస్తారు.
ఫిర్యాదు చేయొచ్చు ఇలా : కాలుష్యం, వ్యర్థాల డంపింగ్, ఘాటు వాసనలకు సంబంధించిన ఫిర్యాదులకు 10741 నంబరును సంప్రదించాలి. ttps://tspcb.cgg.gov.in వెబ్‌సైట్‌లోనూ ఫిర్యాదు చేయొచ్చు. అధికారిక వెబ్‌సైట్‌లోని ‘జనవాణి-కాలుష్య నివారిణి’లో సైతం ఆధారాలతో ఫిర్యాదు చేయవచ్చు.
హైదరాబాద్ ఊపిరి పీల్చుకో - ఈసారి దీపావళి పెద్దగా హాని చేయలేదుగా!