Cotton Crop Cultivation In Telangana : ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో రైతుల సందడి మొదలైంది. ఈ ఏడాది నైరుతి రుతు పవనాలు ముందస్తుగా వచ్చేస్తున్నాయన్న భారత వాతావరణ కేంద్రం అంచనాల నేపథ్యంలో ఈ సీజన్‌లో రాష్ట్రవ్యాప్తంగా కోటి 34 లక్షల ఎకరాల విస్తీర్ణం పైగా భూముల్లో వ్యవసాయ పంటలు చేయాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. ఈసారి అనూహ్యంగా 60.53 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి పంట సాగవుతుందని అంచనా వేసింది.
ఈ క్రమంలో రైతులకు వ్యవసాయ శాఖ, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాల శాస్త్రవేత్తలు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. గత ఏడాది ఖరీఫ్ అనుభవాలు పరిశీలిస్తే సాధారణ సంప్రదాయ పద్ధతుల్లో సాగు చేస్తే సగటున ఎకరాకు 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి రాగా అదే హైడెన్సిటీ కాటన్ సాగు చేస్తే 12 క్వింటాళ్ల దిగుబడి లభించినట్లు నిరూపితమైంది. ఈ విధానంలో కాస్త పెట్టుబడి ఎక్కువైనా దిగుబడులు అధికంగా లభిస్తాయని నిపుణులు తెలిపారు.
Govt Focus On Cotton Crop : రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌పై ప్రత్యేక దృష్టి సారించిన సర్కారు అధిక సాంద్రత విధానంలో పత్తి సాగు ప్రోత్సహించేందుకు సిద్ధమైంది. పెట్టుబడి అధికమైనా మంచి దిగుబడులు వస్తే రైతులు లాభాలు ఆర్జించే అవకాశం ఉన్న దృష్ట్యా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ కింద కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, జౌళి మంత్రిత్వ శాఖ హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టం విధానం పేరిట ప్రత్యేక ప్రాజెక్టు అమలు చేస్తోంది. ఏపీ, తెలంగాణ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఐసీఏఆర్ అధిక సాంద్రత పత్తి సాగుపై ప్రదర్శన క్షేత్రాల ద్వారా రైతుల్లో అవగాహన కల్పించింది.
2022, 2023లో తెలుగు రాష్ట్రాల్లో రైతులు సాగు చేసి మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో ఈ ఏడాది వానా కాలంలో తెలంగాణలో హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టంపై ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు, ఏఈఓలు, రైతులకు శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తున్నారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో చీడపీడలు, తెగుళ్ల బెడద చాలా తక్కువగా ఉంటుందని నాణ్యమైన పత్తి దూది దిగుబడి లభిస్తుందని చెబుతున్నారు.
విత్తనాల సరఫరాలో ఇబ్బందులు సృష్టిస్తే కఠిన చర్యలు : మహారాష్ట్ర నాగపూర్ వార్ధాలోని ఐసీఏఆర్- సీఐసీఆర్ స్పెషల్ కాటన్ ప్రాజెక్టు కింద హయత్‌నగర్ కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఎంపిక చేసింది. గాసిపియం అమెరికన్ పత్తి, ఆసియా పత్తి వంటి పలు రకాల పత్తి హైబ్రీడ్ వంగడాలను ఐసీసీఆర్ శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్ల కిందట విడుదల చేసి బహుళ ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. కూలీల కొరత, రసం పీల్చే పురుగులైన తామర పురుగు, పచ్చ దోమ నుంచి అధిగమిండంతో పాటు ఆరోగ్యవంతమైన ఏకకాలంలో పత్తి పగిలే లక్షణం ఉండటం ప్రత్యేకతని శాస్త్రవేత్తలు చెప్పారు. పత్తి విత్తనాల సరఫరాలో ఇబ్బందులు సృష్టిస్తే మాత్రం ఏ కంపెనీని ఉపేక్షించబోమని రైతుల ప్రయోజనాలకు భంగం కల్గించే ఏ చర్యను సహించబోమని ప్రభుత్వం హెచ్చరించింది.
రాష్ట్రంలో పత్తి కొనుగోళ్లు కొనసాగించాలి - సీసీఐని కోరిన మంత్రి తుమ్మల
పత్తివిత్తన కంపెనీలు, ఆర్గనైజర్ల మధ్య చెలరేగిన వివాదం - బయట పడ్డ మధ్యవర్తుల మోసం