NALA Issues in Telangana : ఏది వ్యవసాయ భూమి ఏది వ్యవసాయేతర భూమి(నాలా-Non-Agriculture Land) అనేది తేల్చాలంటే ఇక నుంచి ఉన్నత స్థాయి నుంచి దిగువ స్థాయికి ఆ ఫైల్‌ను పంపి స్పష్టత తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క బటన్ క్లిక్‌తో భూమి ఏ రకం అనేది తేలిపోనుంది. రాష్ట్రంలో నూతన రెవెన్యూ చట్టం(ఆర్వోఆర్ యాక్ట్ 2024) అమలుతో ఇది త్వరలోనే సాధ్యం కానుంది. కొత్త చట్టంలో భాగంగా పహాణీలో గతంలో ఉన్న ఒక్క కాలమ్ స్థానంలో 11 కాలమ్స్ రానున్నాయి. వీటిని ఏర్పాటు చేయడంతో ఈ 'నాలా' సమస్యలకు త్వరలోనే పరిష్కారాలు లభించనున్నాయి.
రైతుబంధు, రైతుబీమా రాక ఇబ్బంది : దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రెవెన్యూ శాఖ పటిష్టంగా రూపొందిస్తోంది. ధరణి పోర్టల్లో చాలా జిల్లాల్లోని వ్యవసాయ భూములు పొరపాటుగానో లేక తప్పుడు సమాచారంతోనో నాలా భూములుగా నమోదయ్యాయి. దీంతో రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయ రుణాలకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతుబంధు డబ్బులు పడనప్పుడు ఈ సమస్యను అన్నదాతలు గుర్తించి సంబంధిత ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తూనే ఉన్నారు.
సరిచేయడం కష్టతరమైంది : కొన్ని చోట్ల ఒక సర్వే నంబరుకు సంబంధించి ఎవరో ఒకరు తమ భూమి నాలాగా మార్చుకోవడానికి దరఖాస్తు చేస్తే ఆ సర్వే నంబరు సబ్ డివిజన్లలోని భూములు కూడా ‘నాలా’ జాబితాలోకి వెళ్లిపోయాయి. ఏవైనా అవసరం వచ్చి ధరణి పోర్టల్లో రికార్డులు పరిశీలన చేసినప్పుడే తమ భూములు నాలా కింద మారిపోయాయని రైతులు గుర్తించి బాధపడేవారు. ఆ భూములకు సంబంధించిన సమాచారం ఎటువంటి దస్త్రాల్లో అందుబాటులో లేకపోవడంతో అధికారులు కూడా గుర్తించేవారు కాదు.
పహాణీతో ఇక సులువు : భూ భారతి చట్టం-2025తో పహాణీ అమలును తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేసింది. దీనిలో భూ యజమాని, భూమికి సంబంధించిన మొత్తం వివరాలు నమోదు చేయనున్నారు. సాగు భూమా? లేదా నాలాగా మారిందా? అనే అంశాలు ల్యాండ్ క్లాసిఫికేషన్‌లో కనిపించనుంది. భూ భారతి పోర్టల్లో భూమి విస్తీర్ణాన్ని ఎవరైనా పొరపాటుగా సాగుగా ఉన్న దానిని నాలాగా మార్చినా పహాణీలో పరిశీలించి సరిచేయడానికి వీలుంటుంది. క్షేత్రస్థాయి నుంచి రిపోర్టుల అవసరం లేదు. దీనివల్ల సమస్య త్వరగా పరిష్కారం కానుంది.
త్వరగా పరిష్కారం : సిద్దిపేట, నల్గొండ జిల్లాల్లోని పలు మండలాలకు చెందిన వ్యవసాయ భూములు గతంలో ఉన్నట్టుండి వ్యవసాయేతర భూములుగా మారిపోయిన ఘటనలు వెలుగు చూశాయి. వాటిని మళ్లీ వ్యవసాయ భూములుగా మార్చడానికి తీవ్రమైన శ్రమ చేయాల్సి వచ్చేది. కొత్త రెవెన్యూ చట్టంలో 11 కాలమ్స్ పెట్టడం వల్ల ప్రత్యేక విచారణ లేకుండా సమస్య వేగంగా పరిష్కారమయ్యే అవకాశం ఉందని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.