Land Mafia in Adilabad Kailash Nagar : ఆదిలాబాద్ పట్టణ పరిధిలోకి వచ్చే కైలాస్‌నగర్ కాలనీ నడిబొడ్డున ఉన్న స్థలాన్ని స్థిరాస్తి వ్యాపారులు కబ్జా చేయటం కలకలం రేపింది. దశాబ్దాల కిందట ప్రభుత్వం కైలాస్‌నగర్ సొసైటీ పేరిట నామినల్ ధరకు 20 ఎకరాలను కేటాయించింది. ఇందులో కైలాస్‌నగర్‌లోని గృహ నిర్మాణాల కోసం పోను మిగిలిన ఎనిమిది గుంటలను ఫంక్షన్‌హాల్ కోసం సొసైటీ ఖాళీగానే ఉంచింది.
దాదాపుగా రూ. కోట్ల విలువ చేసే ఈ స్థలానికి ప్రహారీ నిర్మించేందుకు ప్రయత్నించగా కొంతమంది స్థిరాస్తి వ్యాపారులు అది తమ భూమి అంటూ నకిలీ దస్తావేజులు తీసుకురావటంతో కబ్జాకు గురైనట్లు వెల్లడి కావటం చర్చనీయాంశమైంది. బాధ్యులపై చర్య తీసుకోవాలని సొసైటీ సభ్యులు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అధికారుల బృందం విచారణ చేపట్టింది.
"భూ మాఫియా రెచ్చిపోయి, దొంగ పత్రాలతో ఇక్కడ రెండు, మూడు ఫ్లాట్లు ఉన్నాయని చెప్పి ఇళ్లు కట్టడానికి ప్రయత్నించారు. అయితే మా కాలనీ వాళ్లందరం కలిసి ప్రహరీ నిర్మించాలని అనుకున్నాం. మేము నిర్మాణం చేపట్టగానే కబ్జాదారులు మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేసి ఇక్కడ అక్రమంగా ప్రహరీ నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో నిర్మాణం ఆగిపోయింది. కలెక్టర్ దగ్గరకు వెళ్తే కమిటీ వేశారు." - ప్రవీణ్ రెడ్డి, కైలాస్‌నగర్ సోసైటీ అధ్యక్షులు
ఇప్పటికే నకిలీ దస్తావేజులతో మావల, రాంనగర్, బట్టి సావర్గాం పరిసరాల్లోని ప్రభుత్వ స్థలాలపై కన్నేసిన స్థిరాస్తి వ్యాపారులు తాజాగా ఏకంగా కైలాస్‌నగర్ నడిబొడ్డున ఉన్న సొసైటీ స్థలంపైనే కన్నేయటం కలకలం రేకెత్తిస్తోంది. బాధ్యులపై చర్యలు తీసుకోనట్లయితే మరింత రెచ్చిపోయే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. వీలైనంత త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
"ఇక్కడ కాంపౌండ్ వాల్ కడుతుంటే అడ్డుకుంటూ పిటిషన్ వేశారు. కలెక్టర్ ఆదేశాల మేరకు స్థలాన్ని మేము చూశాం. మేము వచ్చిన్నప్పటి నుంచి నిర్మాణాన్ని ఆపడానికి ఎవరూ రాలేదు. నిన్న తహసీల్దార్ చూసేటప్పడు చెప్పాం ఫిర్యాదు చేసిన వారి దగ్గర ఏవైనా పత్రాలు ఉంటే తీసుకురమ్మని . వారు వచ్చి పేపర్లు చూపిస్తే వాటిని పరిశీలించి తదుపరి చర్యలు తీసుకుంటాం." - దివాకర్‌రెడ్డి, ఇన్‌ఛార్జీ ఆర్డీవో, ఆదిలాబాద్
భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్‌కుమార్‌పై భూకబ్జా కేసు - Land Case On congress MP Candidate
అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం - కబ్జా భూముల్లోని భవనాలను తొలగిస్తున్న బల్దియా