ACB Filed Custody Petition on HMDA Ex Director Balakrishna : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్, రెరా కార్యదర్శి బాలకృష్ణ కస్టడీ అంశంపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. బాలకృష్ణను 10రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ అధికారుల తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్(Special Public Prosecutor) వాదనలు వినిపించారు.
నిందితుడి పేరు మీద, బినామీల పేరుమీద పలు లాకర్లు ఉన్నాయని, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయనే విషయాలు తెలుసుకోవాల్సి ఉందని స్పెషల్ పీపీ కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ అధికారాలను దుర్వినియోగం చేసి కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారని, ఇందులో ఎవరెవరి హస్తం ఉందో తెలుసుకోవాల్సి ఉందని స్పెషల్ పీపీ వాదించారు.
ఏసీబీ కోర్టులో బాలకృష్ణ బెయిల్ పిటిషన్ : మరోవైపు శివ బాలకృష్ణకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. బాలకృష్ణను కస్టడీకి ఇవ్వాల్సిన అవసరం లేదని, ఏసీబీ అధికారులు ఇప్పటికే దాదాపు రెండు రోజుల పాటు సోదాలు నిర్వహించి బాలకృష్ణ నుంచి వివరాలు సేకరించారని ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
బాలకృష్ణకు ఆదాయానికి మించిన ఆస్తులు లేవని, అవినీతి నిరోధక శాఖ అధికారులు చూపిస్తున్న లెక్కలన్నీ కూడా బ్యాంకు లావాదేవీల ద్వారా జరిగినవేనని బెయిల్ పిటిషన్‌లో(Bail Petition) పేర్కొన్నారు. బాలకృష్ణ ఏటా ఆదాయపన్ను కడుతున్నారని, అతనికి సంబంధించిన ఆస్తులన్నీ లెక్క చూపిస్తున్నారని బెయిల్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇరువైపు వాదనలు విన్న ఏసీబీ న్యాయస్థానం తీర్పును రిజర్వు చేసింది.
HMDA Ex Director Balakrishna Case Update : గత బుధవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు నిర్వహించిన దాడుల్లో బాలకృష్ణకు సంబంధించి ఏకంగా రూ.100 కోట్లకుపైగా ఆదాయానికి మించిన ఆస్తులు బయటపడ్డాయి. గతంలో హెచ్‌ఎండీఏ ప్రణాళిక విభాగం(Planning Department) డైరెక్టర్‌గా ఉంటూనే, మరోవైపు ఎంఏయూడీలో ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా పనిచేశారు. హెచ్‌ఎండీఏ పరిధి జోన్లలోని నిబంధనలని ఆసరాగా తీసుకొని వందల దరఖాస్తులకు ఆమోదముద్ర వేసేందుకు భారీగా వసూసు చేసినట్లు సమాచారం.
నెలకు 70-80 దస్త్రాలకు అనుమతులు మంజూరు చేస్తూ ఆస్తుల్ని పోగేశారని బాలకృష్ణపై అనేక అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ జరిపిన దాడుల్లో భారీగా అక్రమ సంపాదన బయటపడింది. బాలకృష్ణ అరెస్ట్ అనంతరం అవినీతి శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలను రిమాండ్ రిపోర్ట్‌లో(Remand Report) పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏలో పనిచేసిన సమయంలో పలు ప్రముఖ ఇన్‌ఫ్రా కంపెనీలకు అనుమతులు మంజూరి చేసి కోట్ల రూపాయలు గడించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
కొంత మొత్తాన్ని ఇన్‌ఫ్రా కంపెనీల్లో(Infra Company) పెట్టుబడి పెట్టినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. బినామీ పేర్లపై ఆస్తులను కూడబెట్టారని తెలుసుకున్న అధికారులు ఇప్పటి వరకూ అతని స్నేహితులు, బంధువులకు సంబంధించి 34మందిపై ఉన్న ఆస్తుల వివరాలు రిమాండ్ రిపోర్ట్‌లో పొందుపరిచారు. ఈ కేసులో మరింత దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డ అవినీతి నిరోధక శాఖ, తాజాగా బాలకృష్ణపై ఏసీబీ కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు.
బాలకృష్ణ అవినీతిపై సర్కార్ నజర్ - బినామీ ఆస్తులపై ఏసీబీ విచారణ