ACB Court Refused Bail HMDA Ex Director Shiva Balakrishna : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసులో అరెస్ట్ అయిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను నాంపల్లి ఏసీబీ కోర్టు కొట్టివేసింది. శివబాలకృష్ణ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అతని బెయిల్ పిటిషన్‌పై ఏసీబీ కౌంటర్ దాఖలు చేసింది. కస్టడీ విచారణ, ఆధారాలను ఏసీబీ సేకరించిందని బెయిల్ మంజూరు చేయాలని శివబాలకృష్ణ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
నమోదైన కేసులో మరింత లోతుగా విచారించాల్సింది ఉందని ఏసీబీ తరఫు న్యాయవాది చెప్పారు. బినామీ ఆస్తుల వివరాలు సేకరించాల్సి ఉందని ఏసీబీ కోర్టుకు తెలిపింది. కేసులో కీలకమైన వ్యక్తులు ఉన్నట్లు సమాచారం ఉందని, దర్యాప్తు కీలక దశలో ఉన్న కారణంగా బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరింది. ఈ సమయంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, బాలకృష్ణ బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది. మరోవైపు అతని సోదరుడు శివ నవీన్ కూడా బెయిల్ మంజూరు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అది నేడు విచారణకు రానుంది.
శివబాలకృష్ణపై కేంద్రదర్యాప్తు సంస్థ ఫోకస్- రంగంలోకి దిగిన ఈడీ
అసలేం జరిగిందంటే? పెద్దఎత్తున అక్రమాస్తులను కూడబెడుతూ ఏసీబీ అధికారులకు చిక్కిన హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ రంగంలోకి దిగింది. శివబాలకృష్ణ కేసు వివరాలు ఇవ్వాలని ఏసీబీని కోరింది. కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్, స్వాధీనం చేసుకున్న ఆస్తుల పత్రాల వివరాలను ఇవ్వాలని ఏసీబీని ఈడీ సూచించింది.
HMDA Former Director Shiva Bala Krishna Case : శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఏసీబీ దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. రూ.250 కోట్ల విలువైన స్థిర, చరాస్తులను పోగుచేసినట్లు ఏసీబీ అధికారులు కనుక్కున్నారు. ఇందులో బినామీల పేరిటే 214 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అత్యధికంగా జనగామ జిల్లాలో 102 ఎకరాలు, నాగర్‌కర్నూల్ జిల్లాలో 39, సిద్దిపేట జిల్లాలో 7, యాదాద్రి జిల్లాలో 66 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు తేలింది.
హెచ్ఎండీఏ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.100 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు
అతని పేరిట మొత్తం 29 ఇళ్ల స్థలాలు ఉండగా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయనగరంలో కూడా స్థలాలు ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం శివ బాలకృష్ణ నివాసముంటున్న విల్లాతో పాటు హైదరాబాద్‌లో 4 అలాగే రంగారెడ్డి జిల్లాలో 3 బహుళ అంతస్తుల భవనాల్లో ఫ్లాట్లు ఉన్నట్టు విచారణలో బయటపడింది. ఈ వ్యవహారంలో శివబాలకృష్ణకు అతని సోదరుడు నవీన్‌కుమార్‌తో పాటు మరో ముగ్గురు బినామీలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇందులో నవీన్ కుమార్‌ను ఏసీబీ అధికారులు ఇప్పటికే అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
ఐఏఎస్‌తో శివబాలకృష్ణ అవినీతి బంధం - ఇద్దరి లావాదేవీలు తేల్చే పనిలో ఏసీబీ!