HMDA Ex Director ShivabalaKrishna Case Update : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ మరో ముగ్గురిని అరెస్టు చేసింది. శివబాలకృష్ణ అడ్డదారుల్లో సంపాదించిన ఆస్తులకు బినామీలుగా వ్యవహరించిన ఆయన సమీప బంధువులైన ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో వారిని హాజరుపర్చగా న్యాయమూర్తి వారికి 14 రోజుల రిమాండ్ విధించారు. అనంతరం కోర్టు నుంచి నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇంకా ఈ కేసుపై ఏసీబీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది.
హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తులు కూడగట్టడంపై ఏసీబీ జనవరిలో కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసింది. శివబాలకృష్ణ కూడగట్టిన ఆస్తుల వివరాలను సేకరించిన అధికారులు వాటికి బినామీలుగా వ్యాపారులు గోదావర్తి సత్యనారాయణమూర్తి, పెంట భరత్‌కుమార్, ప్రైవేటు ఉద్యోగి పెంట భరణికుమార్లు వ్యవహరిస్తున్నట్లు గుర్తించింది. శివబాలకృష్ణ అక్రమార్జనతో కూడగట్టి, కొనుగోలు చేసిన ఆస్తులను వీరి పేరిట రిజిస్టర్ చేయించేవాడని ఏసీబీ తేల్చింది.
వీరి ఇళ్లలోనూ ఏసీబీ సోదాలు : ఈ మేరకు పూర్తి ఆధారాలు సేకరించిన ఏసీబీ మంగళవారం ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. శివబాలకృష్ణ ఇంట్లో సోదాలు చేసిన సమయంలో వీరి ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు తాజాగా వారిని అరెస్టు చేశారు. శివబాలకృష్ణ అక్రమార్జన కేసులో ఇప్పటివరకు ఐదుగురిని అరెస్టు చేశారు.
హెచ్ఎండీఏ డైరెక్టర్ ఇంట్లో ఏసీబీ సోదాలు - రూ.100 కోట్లకుపైగా ఆస్తులు గుర్తింపు
శివబాలకృష్ణ కేసు వివరాలు : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ అక్రమ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్లో సుమారు రూ.250 కోట్లపైనే ఉంటుందని ఏసీబీ అంచనా వేసింది. మొత్తం 214 ఎకరాలు, 29 ప్లాట్లు, 8 ఇళ్లు ఉన్నట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు. గతంలోనే శివబాలకృష్ణ, ఆయన సోదరుడు శివనవీన్ అరెస్టు అయ్యారు. అయితే ఇటీవల వారు బెయిల్‌పై విడుదలయ్యారు.
అయితే శివబాలకృష్ణను విచారిస్తున్న క్రమంలో అతని నేర అంగీకర పత్రంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఒక ఐఏఎస్ పేరును ప్రస్తావించినట్లు సమాచారం. అక్రమంగా కూడబెట్టిన భవనాలకు అనుమతి మంజూరు చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారని తెలుస్తోంది. అయితే ఆ ఐఏఎస్‌ను కూడా విచారించాలని ఏసీబీ భావించింది. కానీ ఎందుకో మళ్లీ అటువైపుగా నిర్ణయం తీసుకోలేదు.
స్థిరాస్తి వ్యాపారాల్లో శివబాలకృష్ణ భారీ పెట్టుబడులు, కీలక ఆధారాలు లభ్యం
అడ్డగోలు సంపాదనతో 214 ఎకరాల కొనుగోలు - శివబాలకృష్ణ 'అక్రమ' లీలలు అన్నీఇన్నీ కావయా!