Young Woman Committed Suicide For Harassment : అడవిలో జంతువులు ఆకలేసినప్పుడే ఎదుటి ప్రాణి మీద దాడికి దిగుతాయి. తమ వినోదం కోసమో, ఆనందం కోసమో మరే జంతువుకూ కీడు చేయవు. ఇది విచక్షణా జ్ఞానం లేని మూగజీవాలు సైతం పాటించే గొప్ప నీతి. అటువంటిది ప్రస్తుత రోజుల్లో కొందరు తమ పైశాచికానందం కోసం సామాజిక మాధ్యమాల చాటున చేయరాని తప్పులు చేస్తూ వింత మృగాలుగా ప్రవర్తిస్తున్నారు.
అటువంటి నీచుల చేత జిక్కి వేధింపులకు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన నల్గొండ జిల్లా మాడుగులపల్లి మండలంలో చోటుచేసుకుంది. అదే మండలానికి చెందిన ఇద్దరు నిందితులు సరదాగా యువతితో దిగిన ఫోటోలను వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్‌లో స్టేటస్‌గా పోస్ట్ చేస్తామని ఆమెను వేధించసాగారు. దీంతో ఆకతాయిల వేధింపులు తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ నెల 6న కలుపు సంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.
నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ : ఇది గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నల్లగొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గత మూడు రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం యువతి మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అంత్యక్రియలు నిమిత్తం ఈరోజు బంధువులకు అప్పగించారు.
ఎదిగొచ్చిన కుమార్తె మృతి చెందడంతో వారింట్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపి, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు మాడుగులపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Social Media Using in Wrong Way : సామాజిక మాధ్యమాలు సామాన్యుల భావ ప్రకటనకు వేదిక. కానీ నేడు అవి అడ్డూఅదుపూ లేని తప్పుడు సమాచారాన్నీ, వందతులనూ వ్యాప్తి చెందిస్తున్నాయి. సోషల్ మీడియాలో కొందరు వ్యక్తులు తమ ఆనందం కోసం ఎంత నీచానికైనా తెగిస్తున్నారు. మానవత్వం మరిచి మృగాల్లా ప్రవర్తిస్తున్నారు. ఈ కోవలోనే ఇటీవల సమాజంలో వెలుగు చూసిన ఒక ఉదాంతం తండ్రీకూతుళ్ల బంధంపై విచక్షణ మరచి మాట్లాడటం అయితే ఇప్పుడు ఈ కేసులో సామాజిక మాధ్యమం చాటున ఇద్దరు నిందితులు వ్యవహరించిన తీరుకు యువతి నిండు ప్రాణం బలైంది.