A Young Man Died in a Fight Over Two Hundred : 2022 జులై 31తేదీ రాత్రి 11గంటలకు వివేక్‌రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్‌లో బీఎన్‌రెడ్డినగర్ నుంచి రాజేంద్రనగర్ సమీపంలోని ఉప్పర్‌పల్లికి క్యాబ్ బుక్ చేసుకున్నాడు. లోకేషన్‌కు రీచ్ అయ్యాక, ఛార్జీ రూ.900 అయిందని క్యాబ్ డ్రైవర్ వెంకటేష్‌గౌడ్ చెప్పగా వివేక్ రెడ్డి రూ.700 మాత్రమే ఇచ్చాడు. మిగిలిన రూ.200 కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చిన్న గొడవ కాస్త పెద్దదిగా అయింది.
వివేక్ రెడ్డి తన స్నేహితులకు ఫోన్ చేసి రమ్మన్నాడు. అప్పటికే మద్యం తాగుతున్న 20మంది వచ్చి క్యాబ్ డ్రైవర్‌ను క్రికెట్ బ్యాట్లు, వికెట్లతో చితకబాదారు. వారి కాళ్లు పట్టుకుని 'వద్దు కొట్టకండి' అంటూ ప్రాధేయపడినా కనికరించలేదు. వెంకటేశ్‌గౌడ్ ప్రాణ భయంతో పారిపోతుంటే వెంబడించి మరీ అతనిపై దాడి చేశారు. సుమారు రెండు గంటలపాటు అతడిని హింసించారు. యువకులు చివరకు వారిపై కేసు కాకుండా బంగారు గొలుసు దొంగిలించబోయాడంటూ వెంకటేశ్‌ను రాజేంద్రనగర్ పోలీసులకు అప్పగించారు.
వెంటనే ఆసుపత్రికి తీసుకొచ్చుంటే ప్రాణం దక్కేది : తీవ్రంగా గాయపడిన వెంకటేశ్‌గౌడ్‌కు వెంటనే చికిత్స చేయించాల్సిన పోలీసులు రాత్రంతా అతన్ని పోలీస్ స్టేషన్‌లో ఉంచారు. అతడిపై దాడి చేసిన వారిని మాత్రం వదిలేశారు. మరుసటి రోజు ఉదయం వెంకటేశ్ పరిస్థితి విషమించడంతో అప్పుడు పోలీసులు అతణ్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే అతను కోమాలోకి వెళ్లాడు. గాయపడిన వెంటనే ఆసుపత్రికి తీసుకువచ్చి ఉండే అతని పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేదని వైద్యులు వెంకటేశ్ తల్లిదండ్రులకు చెప్పారు.
ఈటీవీ భారత్‌లో కథనం : ఈ ఘటన జరిగిన 8 రోజులకు 2022 ఆగస్టు 8న దీనిపై ఈటీవీ భారత్‌లో కథనం ప్రచురితం అయింది. దీంతో పోలీసులు అప్పడు నిందితులపై కేసు నమోదు చేశారు. దాడి చేసిన వారిలో 15 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కొద్ది రోజులకే బెయిల్‌పై వారంతా బయటకు వచ్చారు.
నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన సన్నకారు రైతు అంజయ్యగౌడ్, వెంకటమ్మ దంపతులకు నలుగురు ఆడపిల్లల తర్వాత అయిదో సంతానం వెంకటేశ్. అతడిని డిగ్రీ వరకు చదివించారు. వెంకటేశ్ ఎల్బీనగర్‌లో అద్దెకు ఉంటూ ఎస్సై పరీక్ష కోసం సన్నద్దం అవుతున్నాడు. పాకెట్ మనీ కోసం అతను రాత్రిళ్లు క్యాబ్ నడిపించేవాడు. ఈ క్రమంలోనే ఈ ఘర్షణ జరిగింది.
కుమారుడిని బతికించుకోవడానికి తల్లిదండ్రులు పలు ఆసుపత్రుల్లో సుమారు రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇందుకోసం ఎకరంన్నర పొలాన్ని అమ్మేశారు. ఇంటిని తాకట్టు పెట్టి అందినచోట్ల అప్పులు చేశారు. ఆదివారం ఉదయం పరిస్థితి విషమించడంతో వెంకటేశ్ గౌడ్ మరణించాడు. కొందరి యువకుల క్షణికావేశం, దురుసుతనం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది. అతడి కుటుంబం సర్వం కోల్పోయింది.