Village Hospital Providing Advanced Medical Services : అది ధైర్యం అనాలో.. నిర్లక్ష్యం అనాలో చెప్పలేంకానీ పల్లె వాసులు సాధారణంగా హాస్పిటల్‌కు వెళ్లడానికి ఇష్టపడరు. జ్వరమైనా, గాయాలైనా, సమస్య కంటిదైనా పంటిదైనా ప్రాణంమీదకు వచ్చాక కానీ చికిత్స కోసం ఆసుపత్రికి కదలరు. తీరా పరిస్థితి విషమించాక వాళ్లు ఇక నేరుగా నగరాల్లోని హాస్పిటళ్లకే రావాల్సి ఉంటుంది. వేల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటి బాధల్నుంచి పల్లెవాసుల్నీ, గిరిపుత్రులను తప్పించాలనుకున్నాయీ సంస్థలు. అత్యాధునికమైన వసతులను వారికి చేరువచేస్తున్నాయి!
‘గూడెం’లో అత్యాధునిక వైద్యసేవలు : ‘ఈ హాస్పిటల్ నిర్మాణంలో తొమ్మిది వేలమందికిపైగా గిరిజనులు రాళ్లెత్తారు. చెమటచుక్కను చిందించారు. వారి మొక్కవోని పట్టుదల, ఐకమత్యమే ఈ సంస్థ ఏర్పాటునకు పునాది’- ఆ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఈ వాక్యాలున్న బోర్డు మనల్ని పలకరిస్తుంది! ఇండీజనస్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (ఇడో) హాస్పిటల్ ప్రాంగణం అది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని లక్ష్మీదేవిపల్లి మండలంలోని గట్టుమళ్ల అనే మారుమూల గూడెంలో ఈ ఆసుపత్రి ఉంటుంది. అయితేనేం- ఏ ప్రైవేటు హాస్పిటల్(నర్సింగ్‌హోమ్)కు తీసిపోని అన్ని సౌకర్యాలతో కూడిన అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లేబర్ రూములూ, రోగి సహాయకుల కోసం ప్రత్యేక గదులూ, అల్ట్రాసౌండ్ స్కాన్, ఈసీజీలతో కూడిన అత్యాధునిక ల్యాబూ ఇక్కడ చూడొచ్చు.
రోజూ వందలాది మంది రోగులకు వైద్యసేవలు : రోజూ వందమందికి పైగా పేషెంట్లకు సేవలందిస్తోంది. ముఖ్యంగా- సురక్షితమైన కాన్పులకు ప్రసిద్ధి చెందింది ఈ హాస్పిటల్. గూడేల్లోని మారుమూల పల్లెల కోసం అంబులెన్స్‌లను సైతం నడుపుతోంది. ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌ల నుంచీ పేషెంట్లు వస్తుంటారు. హైదరాబాద్‌కు చెందిన హోమియోపతి డాక్టర్ నరేశ్, గైనకాలజిస్టు డాక్టర్ స్వాతి ఈ ఉచిత హాస్పిటల్ వ్యవస్థాపకులు. సరైన వైద్యం లేక గిరిపుత్రులు పడే పాట్లని చూసి చలించిపోయిన ఈ వైద్య దంపతులిద్దరూ 2017లోనే నగరజీవితాన్ని వదిలి గూడేలకి వచ్చారు. ఫ్రెండ్స్ విరాళాలతో 2021లో ఇడో హాస్పిటల్‌ను స్థాపించారు. ఈ దంపతులని స్ఫూర్తిగా తీసుకుని మరో ఏడుగురు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందీ సేవలందిస్తున్నారు ఈ హాస్పిటల్లో.
చిన్న పట్నంలో పెద్ద చికిత్స : 1992 సంవత్సరం నాటి మాట ఇది. చుట్టుపక్కల ఉన్న గ్రామాల ప్రజలకి కంటి శుక్లాల ఆపరేషన్ చేయాలని భావించింది నిడదవోలు లయన్స్ క్లబ్. ఇందుకోసం శిబిరం ఒకటి ఏర్పాటుచేసి 200 మందికి శస్త్రచికిత్స చేసింది. ఆ రోజుల్లో డాక్టర్లు శుక్లాలు తీసేసిన వెంటనే ఇప్పట్లా కృత్రిమ లెన్స్(ఐఓఎల్) అమర్చేవాళ్లు కాదు. దానికి బదులు లావుపాటి కళ్లద్దాలను ఇచ్చేవారు. ఈ మొత్తం ప్రక్రియకి వారం రోజులు పట్టేది. వారంపాటు ఇలా శిబిరంలోనే ఉండాల్సి రావడం, జీవితాంతం మందపాటి కళ్లద్దాలూ వేసుకోవాల్సి ఉండటమనేది కాయకష్టం చేసుకునే పల్లెవాసుల ఉపాధికి ఇబ్బందిగా మారేది! దాంతో అప్పుడప్పుడే పెద్ద నగరాల్లో పరిచయమవుతున్న ఇంట్రా ఆక్యులర్ లెన్స్(ఐఓఎల్) చికిత్సని చుట్టూ ఉన్న పల్లెప్రజలకీ అందించాలని సంకల్పించారు నాటి లయన్స్ క్లబ్ గవర్నర్ కొత్తపల్లి రామారావు. అందుకోసం ఓ అత్యాధునిక హాస్పిటల్‌ను నిర్మించాలనుకుని ఒకటిన్నర ఎకరం స్థలాన్ని ఇచ్చారు.
అత్యాధునిక పరికరాలతో : చాగల్లులోని జైపుర్ షుగర్స్ లిమిటెడ్ అధినేత రాజేశ్వరీ రామకృష్ణన్ రూ.7 లక్షలు ఇవ్వడంతో హాస్పిటల్‌కు ఆమె పేరే పెట్టారు! హైదరాబాద్‌లోని ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్యశాలకి అనుబంధ సంస్థగా దానిని మార్చారు. నాటినుంచి నేటి వరకూ నిడదవోలు చుట్టుపక్కల ఊళ్లలోని ప్రజలకు సేవలందిస్తోంది శ్రీమతి రాజేశ్వరీ రామకృష్ణన్ లయన్స్ హాస్పిటల్. ఇవ్వగలిగిన వాళ్లదగ్గర నామమాత్రంగా ఫీజు రూపంలో తీసుకుంటారు. ఇవ్వలేని వారికి అంతా ఫ్రీగానే చేస్తారు. ఏటా 12,000 మందికి కంటిచూపునిస్తున్నారు. కన్నీటి తిత్తులకి(లాక్రిమన్ శాక్స్) ఇన్ఫెక్షన్ వస్తే వాటిని తొలగించే- ఆక్యులోప్లాస్టీ సర్జరీ వంటి అరుదైన చికిత్సలనూ చేస్తున్నారు ఇక్కడ. నగరాల్లో కార్పొరేట్ హాస్పిటల్స్‌కే పరిమితమయ్యే ‘లేజర్ కాన్‌స్టలేషన్ విజన్ సిస్టం’ వంటి అత్యాధునిక పరికరాలూ ఇక్కడ ఉన్నాయి. అందుకే, ఈ హాస్పిటల్‌కు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డు ఫర్ హాస్పటల్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ (ఎన్‌వీబీహెచ్)గుర్తింపూ దక్కింది!
చిన్నారి గుండెలను కాపాడే ఆసుపత్రి - అక్కడ వారికి అన్నీ సేవలు ఫ్రీ..!