Rules Violation At Ashok Nagar Coaching Centre : ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం నిర్వహించే కోచింగ్ సెంటర్లలో భద్రతా ప్రమాణాలు మేడిపండు చందంగా తయారయ్యాయి. ఎక్కడో ఒక్కచోట ఎదో ఓ ఘటన జరిగితే తప్ప అధికారుల్లో చలనం రావడంలేదు. తాజాగా దిల్లీలో శనివారం రాత్రి ఐఏఎస్ స్టడీ సెంటర్‌లోకి వరదనీరు పోటెత్తి సివిల్స్‌కు శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మృతిచెందారు. దీంతో మరో సారి కోచింగ్ సెంటర్ల నిర్వహణలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పలు కోచింగ్ సెంటర్లలో భద్రతా పరమైనలోపాలు, నిబంధనలు ఉల్లంఘనలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
హైదరాబాద్‌లో నిర్వహించో పలు కోచింగ్ సెంటర్లలో ఒకరు మాత్రమే నడవ గలిగే మెట్ల మార్గంతో మూడు, నాలుగు అంతస్తుల్లో శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. ఆ కొచింగ్ సెటర్లలోనే రోజూ వేలాది మంది విద్యార్థులకు శిక్షణ తరగతులు నడుస్తున్నాయి. ఒక మంచం పట్టే గదిలో 20 కుర్చీలతో ప్రైవేటు లైబ్రరీలు నిర్వహిస్తున్నారు. వాటికి భద్రత డొల్ల. సరైన అనుమతుల్లేవు. మంచి గాలి, వెలుతురనే ప్రశ్నే కనిపించదు. ఆర్టీసీ క్రాసురోడ్డులోని అశోక్‌నగర్‌లో కనిపించే దారుణ దృశ్యాలివి.
గతంలో అశోక్‌నగర్‌లో నివసించేందుకు చాలా మంది ఆసక్తి చూపేవారు. ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ఇళ్లన్నీ శిక్షణ కేంద్రాలుగా, హాస్టళ్లుగా, స్టడీ హాళ్లుగా మారాయి. కాసులకు కక్కుర్తి పడుతూ, చిన్న చిన్న ఇళ్లను శిక్షణ కేంద్రాలుగా, వసతి గృహాలుగా, లైబ్రరీలుగా మార్చుతున్నారు. ఓ శిక్షణ కేంద్రంలో పాఠం వినేందుకు 500ల మంది విద్యార్థులు హాజరవుతున్నారు. కుర్చీలన్నీ ఒకదాని వెనుక ఒకటి ఏర్పాటై ఉంటాయి. ఒకసారి కూర్చున్నారంటే, తరగతి పూర్తయి అందరూ వెళ్లే వరకు కదల్లేని పరిస్థితి.
ఇక అందరికీ ఒకే మరుగుదొడ్డి. ఒకే మెట్ల మార్గం.పార్కింగ్ వసతి ఉండదు. ఇడ్లను ప్రైవేటు స్టడీ హాళ్లుగా మార్చేశారు. చిన్న చిన్న గదుల్లో 20కి తగ్గకుండా కుర్చీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడి పలు శిక్షణ కేంద్రాల్లో ఏదేనా ప్రమాదం చోటుచేసుకుంటే, ఇరుకైన మెట్ల మార్గాల వల్ల తొక్కిసలాట జరుగుతుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల భారీ వర్షంతో అశోక్‌నగర్‌లోని రోడ్లపై నడుముల్లోతున నీరు నిలిచిందని, రెండు గంటలపాటు శిక్షణ కేంద్రాల్లోని విద్యార్థులంతా లోపలే ఉండి పోయారని గుర్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని అశోక్‌నగర్ మాత్రమేక కాకుండా దిల్సుఖ్నగర్, అమీర్‌పేట్‌లోని పలు ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఎదైనా ప్రమాదం జరిగితే తీవ్ర ప్రాణనష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అధికారులు ఇప్పటికైనా స్పందించి నిబంధనలు ఉల్లంఘించి నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్లు, స్టడీ హాళ్లు, వసతి గృహాలపై చర్యలు చేపట్టాలి. అప్పుడే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ప్రాణనష్టం జరగకుండా ఉంటుంది.