Missing Case in AP : కన్న తల్లిదండ్రులను భారంగా భావించి వారిని వదిలేస్తున్న ఘటనలు తరచూ చూస్తూనే ఉన్నాం. నవ మాసాలు మోసి, కని పెంచిన అమ్మను ఓ కుమారుడు భారంగా భావించాడు. కొంచెం కూడా దయ లేకుండా ఊరుకాని ఊరులో వదిలేసి వెళ్లిపోయాడు. తన బిడ్డ వస్తాడని ఆ తల్లి రోడ్డువైపే ఎదురు చూస్తూనే ఉండిపోయింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లిలో జరిగింది.
సోమందేపల్లిలోని పెద్దమ్మ గుడి బస్టాండు వద్ద శనివారం (నవంబర్ 09) సాయంత్రం ఓ కుమారుడు తన తల్లిని బస్సులో నుంచి కిందకు దించాడు. ఇప్పుడే వస్తానని చెప్పి, ఆమె దుస్తులున్న సంచిని ఇచ్చి అదే బస్సులో వెళ్లిపోయాడు. తన కుమారుడు భోజనం తెచ్చేందుకు వెళ్లాడని, వస్తాడని ఆమె నమ్మకంతో రోడ్డువైపే చూస్తూ కూర్చుంది. రాత్రి కావడంతో ఆశలు వదులుకుంది. వృద్ధురాలి దుస్థితిని గుర్తించిన స్థానిక యువకులు, సహృదయంతో భోజనం, తాగునీరు అందించారు. ఆమె దీనస్థితిని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు.
స్థానిక ఎస్సై రమేశ్‌బాబు, పోలీసు సిబ్బంది ఆదివారం (నవంబర్ 10) వృద్ధురాలి వివరాలను తెలుసుకున్నారు. తీవ్ర వినికిడి లోపంతో బాధపడుతున్న ఆమె వివరాలు చెబుతూ తమది అనంతపురం జిల్లాలోని కల్యాణదుర్గం అని పోలీసులకు వెల్లడించింది. కుమారుల వివరాలు సరిగ్గా చెప్పలేకపోయింది. దీంతో ఎస్సై రమేశ్‌బాబు ఆ తల్లిని చూసి చలించిపోయారు.
వృద్ధాశ్రమానికి : దీంతో కొంత డబ్బు, భోజనం అందించారు. ఈ విషయం తెలుసుకుని అక్కడికి చేరుకొన్న ఆమడగూరు వృద్ధాశ్రమం నిర్వాహకురాలు అరుణ జ్యోతితో ఎస్సై మాట్లాడి వృద్ధాశ్రమానికి జాగ్రత్తగా తరలించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాసులు, పెనుకొండ న్యాయమూర్తి బుజ్జప్ప తమ సహాయకుల ద్వారా వివరాలు ఆరాతీశారు.
తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులను తీసుకుని వారిని ఇంట్లోంచి బయటకు గెంటేసిన ఘటన ఇటీవల తెలంగాణలోనూ వెలుగు చూసింది. అలా ఆస్తిని తీసుకుని తండ్రిని గెంటేసిన కుమారుడి విషయంలో ఆర్డీవో స్పందించారు. కుమారుడు ఆ తండ్రి నుంచి వారసత్వంగా బదలాయించుకున్న భూమి రిజిస్ట్రేషన్‌ను ఆ అధికారి రద్దు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.