Investment Fraud in Karimnagar : ప్రజల అమాయకత్వం ఆసరా చేసుకొని కేటుగాళ్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడితో రెట్టింపు లాభాలంటూ ఆశపుట్టించారు. మీరు జాయిన్ అయ్యాక మరికొందరని జాయిన్ చేస్తే కమిషన్ కూడా వస్తుందన్నారు. ఈ ప్రచారం నమ్మి కోల్బెల్ట్ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టిన ఎందరో అమాయకుల నుంచి సుమారు రూ.10కోట్ల వరకు దండుకున్నారు దుండగులు.
కరీంనగర్, పెద్దపల్లి, అసిఫాబాద్, సిద్దిపేట జిల్లాలకు చెందిన మధ్యతరగతి కుటుంబాలు ఈ యాప్ వలలో చిక్కుకొని మోసపోయారు. మంచిర్యాల కేంద్రంగా చంద్రశేఖర్ అనే వ్యక్తి హోటల్, దుకాణాల్లో పనిచేసే వారిని లక్ష్యంగా పెట్టుకొని షేర్ మార్కెటింగ్ ద్వారా బంగారం, పెట్రోలియం, ఆయిల్ రంగంలో పెట్టుబడులు పెడితే రెట్టింపు లాభం వస్తుందని ఆశ చూపాడు. ముంబై కేంద్రంగా సందీప్ టాండెన్ అనే వ్యక్తి తనకు ఏడు కోట్ల రూపాయలు వచ్చాయంటూ సభ్యులకు ఆశ పుట్టించాడు. లక్షకు రెండు లక్షలు ఇస్తానని నమ్మబలికాడు.
"ఏప్రిల్ నుంచే ఈ స్కీం గురించి చెప్పారు. కొందరికి డబ్బులు రావడంతో నమ్మకం కుదిరింది. మే నెలలో మేం పెట్టుబడి పెట్టాం. ముందు 30వేలు పెట్టా. రోజు 500రూపాయలు చొప్పున వచ్చాయి. డబ్బులు వస్తుండటంతో నమ్మకం కుదిరి 3 లక్షలు పెట్టాను. ఇప్పుడు మొత్తం పోయింది." - బాధితుడు
'పోలీసులు మీకు ఫోన్ చేయరు - కాల్ చేస్తోంది మేం కాదు కేటుగాళ్లు' - సైబర్ నేరాలపై డీజీపీ
ముందుగా గొలుసుకట్టు విధానంతో 10 వేల రూపాయల పెట్టుబడి పెట్టుతే రోజుకు 12 వందల రూపాయలు కమిషన్ ఇస్తామంటూ నమ్మబలికారు. వందల మంది చేత యాప్ డౌన్లోడ్ చేయించారు. ప్రారంభంలో కమిషన్ బాగానే ఇచ్చి నమ్మకాన్ని సంపాదించారు. ఆ తరువాత అసలు నటకానికి తెరలేపారు. ఇంకేముంది మోసపోయామని గ్రహించిన బాధితులు రామగుండం సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. యాప్ ద్వారా తాము కోల్పోయిన డబ్బులను తిరిగి తెప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకున్నారు.
"చైన్ సిస్టమ్లాగా పెట్టుబడి పెట్టిస్తే కమిషన్ వస్తుందని ఆశపెట్టారు. నేను 2లక్షలు పెట్టుబడి పెట్టాను. నా కింద 40, 50 మంది వరకు జాయిన్ అయ్యారు. యాప్ ద్వారా తాము కోల్పోయిన డబ్బులను తిరిగి తెప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను వేడుకున్నారు." - బాధితుడు
ఆ మాయమాటల వలలో పడి చాలామంది పదివేల రూపాయల నుంచి ఎనిమిది లక్షల వరకు పెట్టుబడులు పెట్టారు. మే నెలలో ప్రారంభమైన ఈ స్కీంలో చేరేందుకు చాలా మంది ఉత్సాహం చూపారు. సుమారు రూ.10 కోట్ల పెట్టుబడి పెట్టారు. టైమ్ చూసుకొని బిచాణా ఎత్తేశారు. యాప్ పనిచేయకపోవడంతో మోసపోయామని గుర్తించారు. దీంతో లబోదిబోమంటూ రామగుండం సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. కమిషన్ వస్తుందని ఆశపడిన తాము లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టి మోసపోయామని పోలీసుల ముందు మొరపెట్టుకున్నారు.