9 years Boy Telling Past Future Calendar : సాధారణంగా మనం పుట్టిన రోజులు, వార్షికోత్సవాలు గుర్తు పెట్టుకుంటాం. అదే రెండు, మూడేళ్ల క్రితం జరిగిన ఏదైనా సంఘటన గురించి చెప్పమంటే తెల్ల ముఖాలేస్తాం. ఎందుకంటే మరీ ముఖ్యమైతే తప్ప దేన్నీ మనం గుర్తుపెట్టుకోము. అయితే సాధించాలనే తపన, నిరంతర శ్రమ ఉంటే అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేయవచ్చని నిరూపించాడు ఈ బుడతడు. క్యాలెండర్‌లోని ఏ తేదీ చెప్పినా, అది ఫలానా రోజని ఇట్టే చెప్పేస్తాడు. ఇతని ప్రతిభకు గుర్తింపుగా వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ స్థానం సంపాదించాడు.
తొమ్మిదేళ్ల బాలుడి అద్భుత ఘనత : ఈ పిల్లవాడి పేరు చంద్ర వినయ్. వయసు కేవలం తొమ్మిదేళ్లు. కానీ ప్రతిభకు వయసు కొలమానం కాదని నిరూపించాడు. ఈకాలంలో పిల్లలు ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ రీల్స్, ఆన్లైన్ గేమ్స్ అంటూ సమయం వృథా చేస్తుంటారు. తల్లిదండ్రులు వద్దని చెప్పినా మారాం చేస్తూ గంటల కొద్దీ ఫోన్లలో గడుపుతుంటారు. అయితే హైదరాబాద్‌కు చెందిన చంద్ర వినయ్ మాత్రం దీనికి పూర్తి భిన్నం.
చిన్ననాటి నుంచే తేదీలను, వారాలను గుర్తు పెట్టుకుని ఇట్టే చెప్పేస్తున్నాడు. అతని చిన్నప్పుడే ఈ అద్భుతమైన ప్రతిభను గుర్తించిన తల్లిదండ్రులు మరింత ప్రోత్సహించారు. క్యాలెండర్‌లోని వరుసగా అటు ఐదేళ్లు ఇటు ఐదేళ్ల తేదీ, వారాలను అవలీలగా చెబుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు.
క్యాలెండర్‌లోని తేదీలు, వారాలు : తమ కుమారుడు ఫోన్ తీసుకుని కాలక్షేపం చేయకుండా క్యాలెండర్ గమనించటం, వాతావరణ అంచనాలు చూడటంపై ఆసక్తి పెంచుకున్నాడని తల్లిదండ్రులు చెబుతున్నారు. ర్యాండం తేదీల ఆధారంగా ఎక్కువ వారాలను గుర్తించుకోవటంతో ఈ ఏడాది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకున్నాడు. ఇంతే కాకుండా ఇతర పోటీల్లోనూ పాల్గొని బంగారు, వెండి పతకాలు సాధించాడని బాలుడి తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చిన్నప్పుడే తమ కుమారుడి ప్రతిభను గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహించామని తల్లిదండ్రులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో తమ కుమారుడు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో కూడా స్థానం సంపాదిస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే ఇంతటి ఘనతను సాధించడంతో బంధువులు సహా చుట్టుపక్కల వాళ్లు బాలుడి ప్రతిభను అభినందిస్తున్నారు.