Sun Stroke Death Increasing in Telangana : రాష్ట్రంలో వారం నుంచి భానుడి భగభగలకు తాళలేక రైతులు, దినసరి కూలీలు, వృద్ధులు అసువులు బాస్తున్నారు. శనివారం పలు జిల్లాల్లో ఏకంగా 19 మంది మరణించారు. ముఖ్యంగా జగిత్యాల, కరీంనగర్ జిల్లాలు ఉడికిపోయాయి. జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లిపూర్, ధర్మపురి మండలం జైన, కరీంనగర్ జిల్లా వీణవంకలో 46.8 డిగ్రీల గరిష్ఠ ఎండ కాసింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, నల్గొండ జిల్లా తెల్దేవరపల్లిలో 46.7 డిగ్రీలు, నిజామాబాద్ జిల్లా జాకోరా, నారాయణపేట జిల్లా ఊట్కూరులో 46.4ల ఉష్ణోగ్రత, నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రం, మంచిర్యాల జిల్లా నస్పూర్ మండల కేంద్రంలో 46.3 డిగ్రీలు, నల్గొండ జిల్లా బుగ్గబావిగడ్డలో 46.2 ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 44.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవ్వగా, రాష్ట్రంలోని 22 జిల్లాల్లోని 95 మండలాల్లో వడగాలులు వీచాయి.
పడిపోతున్న తేమ శాతం: వాతావరణం చల్లగా ఉండాలంటే గాలిలో తేమ శాతం సమంగా ఉండాలి. కనీసం 50 శాతం ఉన్నావేడి తీవ్రత అంతగా ఉండదు. రాష్ట్రంలో తేమ శాతం కనిష్ఠ స్థాయికి పడిపోయింది. దీని వల్ల వాతావరణం పొడిబారి ఉష్ణతాపానికి దారితీస్తోంది. శనివారం రాష్ట్రంలో అత్యల్పంగా హైదరాబాద్‌లో 15 శాతం, మహబూబ్‌నగర్‌లో 19 శాతం నమోదైంది. ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్ దాటితే శరీరం ఆ ఉష్ణానికి ప్రభావితమవడం ప్రారంభవుతుందని నిపుణులు అంటున్నారు. దీనినే వెట్‌బల్బ్ టెంపరేచర్‌గా పేర్కొన్నారు.
ఈ సమయంలో శరీరాన్ని చల్లబర్చేందుకు చెమట వస్తుందని, తగినంత ద్రవాలు తీసుకోకపోతే వడదెబ్బకు గురవుతారని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు వెట్‌బల్బ్ టెంపరేచర్‌కు దాదాపు 9 డిగ్రీలపైన ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో భానుడి తీవ్రతతో గాలిలో తమ శాతం తగ్గిపోయింది. దీంతో వాతావరణం పొడిబారి వేడి అధికంగా ఉంటోంది. ఆదివారం నుంచి రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి.
కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణానికి చెందిన ఎంఈవో బత్తుల భూమయ్య(57) శనివారం తెల్లవారుజామున వడదెబ్బతో మరణించారు. ఆయన జగిత్యాల జిల్లా వెల్గటూర్, ధర్మపురి, బుగ్గారం, ఎండపల్లి మండలాల ఎంఈవోగా, వెల్గటూర్ మండలంలోని ముత్తునూరు, ముక్కటరావుపేట, కప్పారావుపేట గ్రామాల ప్రత్యేకాధికారిగా పని చేస్తున్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా ధర్మపురి నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్క్వాడ్‌గా విధులు చేస్తున్నారు. శుక్రవారం విధులు ముగించుకొని అస్వస్థతతో ఇంటికి చేరుకున్న ఆయన రాత్రి వాంతులు, విరేచనాలతో బాధపడుతూ పరిస్థితి విషమించి మరణించారు.
నిప్పులు కురిపిస్తున్న భానుడు - ఆల్‌టైం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు - high temperatures in telangana
బస్సులోనే కుప్పకూలి: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామానికి చెందిన రైతు దయ్యాల జంగమ్మ(58) తాను పండించిన కూరగాయలను శనివారం పాతబస్తీ లాల్ దర్వాజకు తీసుకొచ్చి ఎండలోనే అమ్మకాలు చేశారు. మధ్యాహ్నం ఆర్టీసీ బస్సెక్కి తిరిగి గ్రామానికి వెళ్తుండగా సీటులోనే వడదెబ్బ తగిలి మరణించారు.
Sun Stroke Deaths : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం రంగాపూర్‌కు చెందిన వంక లక్ష్మి(70), భూపాలపల్లి జిల్లా కాటారం మండలం రేగులగూడెం గ్రామానికి చెందిన మేకల లస్మయ్య(56), కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన బొల్లబోయిన వనమాల(45), జగిత్యాల జిల్లా బీర్‌పూర్ మండలం మంగెళ గొండుగూడెంకు చెందిన కొమురం సోము(58) శనివారం ఎండలో పొలం పనులు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎండకు తిరిగి అస్వస్థతకు గురయ్యారు. ఇంటికి చేరిన కాసేపటికే మరణించారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన భూమన రాములు(71), రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన సత్తయ్యగౌడ్(75) ఉపాధి పనులు చేస్తూ ఎండ తీవ్రతకు గురై మృతి చెందారు.
రాష్ట్రంలో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు - వడదెబ్బతో ఏడుగురు మృతి - TELANGANA HEAT WAVE NEWS
నాగర్‌కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలం మల్లేశ్వరానికి చెందిన డ్రైవర్ నాగరాజు(55) ఉదయం ఇటుకలను తరలించి మధ్యాహ్నం ఇంటికి చేరగానే కుప్పకూలారు. ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. అలాగే హైదరాబాద్ శివారు అబ్దుల్లాపూర్‌మెట్ మండలానికి చెందిన ఆటోడ్రైవర్ మహమూద్‌మియా(75), షాద్‌నగర్ పట్టణానికి చెందిన ఆకుల రాఘవేందర్(39), ములుగు పట్టణంలోని కూరగాయల మార్కెట్లో నివసిస్తున్న ఒంటరి మహిళ ఈగ ప్రమీల(69),
కరీంనగర్ జిల్లా మొలంగూర్‌కు చెందిన ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగి దాసరి కనుకయ్య(72), మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలానికి చెందిన గొడిశాల దేవయ్య(70), నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్‌లో గుర్తుతెలియని వ్యక్తి(40), సిద్దిపేట జిల్లా వర్గల్ మండలానికి చెందిన పెయింటర్ ధార నాగయ్య(45), కుమురం భీం జిల్లా రెబ్బెన మండలానికి చెందిన కూలీ సయ్యద్ అజీజాబేగం(48), మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలానికి చెందిన ఆవుల కనకయ్య(60), నాగర్‌కర్నూల్ జిల్లాల్లో కొల్లాపూర్ మండలానికి శక్రునాయక్(74) వడదెబ్బ తగిలి మరణించారు.