Yashasvi Jaiswal Test Match : టీమ్‌ఇండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆటతీరుపై మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ ప్రశంసల జల్లు కురింపిచాడు. యశస్వి ఆడుతున్న కొన్ని రకాల షాట్లు చూస్తే సౌరవ్ గంగూలీ గుర్తుకు తెస్తున్నాడని అన్నాడు. ఆఫ్ సైడ్ షాట్ల విషయంలో గంగూలీ, యశస్వి మధ్య చాలా పోలికలున్నాయని పొగడ్తలతో ముంచెత్తాడు
ఈ యువ ఆటగాడు టీమ్ఇండియాలో సుదీర్ఘకాలం ఆడతాడని ఆశాభావం వ్యక్తం చేశాడు ఇర్ఫాన్ పఠాన్. ' నేను యశ్వసి జైస్వాల్ ఆటను చూడటానికి ఉత్సాహంగా ఉంటాను. ఐపీఎల్లో అతడు ఎలా ఆడతాడో చూశాం. గతంలో మనం గంగూలీని చూసి 'ఆఫ్‌సైడ్ కింగ్' అనే వాళ్లం. దాదా మాదిరిగానే జైస్వాల్ కూడా కళ్లు చెదిరేలా ఆడుతున్నాడు. ఒకవేళ మరో 10 ఏళ్ల పాటు ఈ కుర్రాడు జట్టులో కొనసాగితే మనం ఇప్పుడు దాదా గేమ్ గురించి ఎలా మాట్లాడుకుంటున్నామో అప్పుడు అతడి ఆట గురించే అలానే చెప్పుకుంటాం. ఇప్పటికే యశస్వి అంతర్జాతీయ క్రికెట్‌లో ద్విశతకం బాది తన సత్తా ఏమిటో నిరూపించుకున్నాడు. మున్ముందు కూడా మరింత మెరుగ్గా ఆడతాడు' అని పఠాన్ తన అభిప్రాయాలను తెలిపాడు.
ఇప్పటికే యశస్వి జైస్వాల్ టీమ్ ఇండియా టెస్ట్ ఓపెనర్‌గా దాదాపు స్థిరపడిపోయాడు. అతడి రాకతో జట్టులో ఓపెనింగ్‌కు అవసరమైన రైట్-లెఫ్ట్ సమ్మేళనం లభించింది. తాజాగా రాజ్‌కోట్ టెస్ట్‌కు అయ్యర్, రాహుల్, కోహ్లీ దూరం కావడం వల్ల టాప్ ఆర్డర్‌లో భారీ స్కోర్ చేయాల్సిన బాధ్యతను ఈ కుర్రాడు తీసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదు టెస్టుల సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో అతడు రాణించాడు. వైజాగ్‌లో ద్విశతకం నమోదు చేశాడు. దీంతో ఈ మ్యాచ్‌లో భారత్ విజయం సులభమైంది.
ఇకపోతే మూడో టెస్ట్ రాజ్‌కోట్ వేదికగా ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానుంది. ఇంగ్లాండ్‌తో తలపడేందుకు భారత జట్టు తీవ్రంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఇప్పటికే రెండో టెస్టులో తమ ఆటతీరుతో చెలరేగిపోయిన రోహిత్ సేన రానున్న మ్యాచ్‌లోనూ గెలువును తమ ఖాతాలో వేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
బోపన్నకు సీఎం రూ.50 లక్షల ప్రైజ్‌మనీ - అతడి ఆస్తుల విలువ ఎంతంటే ?
మూడో టెస్ట్‌కు కీలక మార్పులు - భరత్ బదులు ధ్రువ్- సర్ఫరాజ్ సంగతేంటంటే ?