Gukesh-Liren Game : చెస్ ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకుని యంగ్ చెస్ ప్లేయర్ గుకేశ్ చరిత్రకెక్కాడు. గురువారం జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్‌ను ఓడించి విజేతగా నిలిచాడు. అయితే ఆఖరిదైన 14వ రౌండ్‌లో లిరెన్ చేసిన ఓ ఘోర తప్పిదాన్ని గుకేశ్ ఉపయోగించుకున్నాడు. అయితే, ఈ ఫలితం విషయంలో రష్యా చెస్ ఫెడరేషన్ తాజాగా సంచలన ఆరోపణలు చేసింది. చైనా దిగ్గజం లిరెన్ కావాలనే ఓడిపోయాడంటూ కామెంట్ చేసింది.
"ఈ మ్యాచ్ రిజల్ట్ చెస్ అభిమానులు, నిపుణులను నివ్వెరపర్చింది. ఎంతో ఉత్కంఠంగా జరిగిన పోరులో చైనీస్ ఆటగాడి చర్యలు చాలా అనుమానాస్పదంగా అనిపిస్తున్నాయి. లిరెన్ ఉన్న స్థితిలో అతడు ఓడిపోవడం అసంభవం. కానీ, అతడు చేసిన తప్పిదం పలు ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఉద్దేశపూర్వకంగానే చేశాడేమో అని నాకు అనిపిస్తోంది. దీనిపై అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ (ఫిడే) ప్రత్యేకంగా విచారణ జరపాల్సి ఉంది" అని రష్యా చెస్ ఫెడరేషన్ చీఫ్ అండ్రీ ఫిలటోవ్ డిమాండ్ చేశారు.
గేమ్ ఎలా సాగిందంటే?
సుమారు నాలుగు గంటలకు పైగా సాగిన ఆఖరి గేమ్ 58 ఎత్తుల్లో ముగిసింది. అయితే 55వ ఎత్తులో లిరెన్ ఏనుగును కదపడం గుకేశ్‌కు కలిసొచ్చింది. ఆ అవకాశాన్ని అతడు ఉపయోగించుకున్నాడు. దీంతో వెంటనే ఆ ఏనుగును ఉపయోగించి ఏనుగుతో గుకేశ్ చంపేశాడు. లిరిన్ తప్పిదం తర్వాత ఆట ఎంతోసేపు సాగలేదు. చైనా గ్రాండ్‌మాస్టర్ ఓటమిని అంగీకరించక తప్పలేదు. దీంతో 7.5-6.5 పాయింట్లతో గుకేశ్ విశ్వవిజేతగా నిలిచాడు. 18 ఏళ్ల వయసులోనే ఈ విజయాన్ని అందుకొని అత్యంత పిన్నవయసు చెస్ ప్రపంచ ఛాంపియన్‌గా చరిత్ర సృష్టించాడు.
10 ఏళ్ల కల - ఇప్పుడు నిజమైంది!
మరోవైపు చెస్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలుచుకున్న తర్వాత గుకేశ్ మీడియాతో మాట్లాడాడు. ఓ వైపు ఆనందం వ్యక్తం చేస్తూనే మరోవైపు ఎమోషనల్ అయ్యాడు. గత 10 ఏళ్లుగా ఈ క్షణం కోసం కలలు కంటున్నానని పేర్కొన్నాడు. ఇప్పుడీ కలను సాకారం చేసుకున్నందుకు సంతోషంగా ఉందని అన్నాడు.
"నేను గెలుస్తానని అస్సలు అనుకోలేదు. అందుకే చాలా ఎమోషనల్ అయ్యాను. 10 ఏళ్ల నుంచి ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నాను. ఇప్పుడీ కల నిజమైనందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. నా దృష్టిలో డింగే రియల్ ఛాంపియన్. నేను నా ప్రత్యర్థికి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను." అని గుకేశ్ అన్నాడు.
భళా గుకేశ్! - 18 ఏళ్ల వయస్సులో 18వ ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా!
సోషల్ మీడియాలో ప్రపంచ చెస్ ఛాంపియన్‌కు విషెస్ వెల్లువ - చిరు, కమల్ ఏమన్నారంటే?