World Chess Champion Gukesh : భారత్‌లో పుట్టి విశ్వవ్యాప్తమైన చదరంగానికి అంతర్జాతీయంగా ఎంతో క్రేజ్ ఉంది. అందుకే దాదాపుగా ఈ క్రీడలో విదేశీ ప్లేయర్లదే ఆధిపత్యంగా సాగింది. అమెరికా, రష్యా, నార్వే లాంటి దేశాల ఆటగాళ్లు ప్రపంచ టైటిళ్లను తమ ఖాతాలో వేసుకున్నారు. కానీ మన దగ్గర విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే విశ్వ విజేతగా నిలిచాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు సార్లు ప్రపంచ చెస్ పీఠాన్ని అధిరోహించాడీ ఛాంపియన్. 2000లో తొలిసారి ప్రపంచ ఛాంపియన్ అయిన ఆనంద్, చివరగా 2012లో ఆ హోదాలో కొనసాగాడు. అయితే 2013లో కార్ల్‌సన్ చేతిలో ఓటమిని చవి చూశాడు. అప్పటి నుంచి భారత్ నుంచి మరో ప్రపంచ ఛాంపియన్ కోసం దేశం కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తూనే ఉంది. అయితే ఇప్పుడా నిరీక్షణకు ముగింపు పలుకుతూ విషీ క్రీడా వారసుడు గుకేశ్ మరోసారి ప్రపంచ చెస్‌లో భారత ఆధిపత్యాన్ని చాటి మన్ననలు పొందుతున్నాడు.
🇮🇳 Gukesh D 🥹
— International Chess Federation (@FIDE_chess) December 12, 2024
Ladies and gentlemen, the 18th WORLD CHAMPION! #DingGukesh pic.twitter.com/CgzYBgeTfq
తెలుగు మూలాలున్న కుర్రోడు
ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు తెలుగు మూలాలున్నాయి. వాళ్ల పూర్వీకులది ఆంధ్రప్రదేశ్‌లోని పుత్తూరు సమీపంలో పిచ్చాటూరు మండలం చెంచురాజు కండ్రిగ గ్రామం అక్కడ గుకేశ్ అతని ముత్తాతలు ఉండేవారట. అయితే చెన్నైలో స్థిరపడ్డ రజినీకాంత్, పద్మ దంపతులకు 2006లో గుకేశ్ జన్మించాడు. ఇప్పటికీ ఏపీలో వీళ్లకు బంధువులు ఉన్నారు. చిన్నతనంలో గుకేశ్ అక్కడికి వెళ్లేవాడట. గుకేశ్‌తో పాటు అతని తల్లిదండ్రులు కూడా తెలుగులో మాట్లాడతారు.
ఇక గుకేశ్ విజయం వెనుక అతని తల్లిదండ్రుల శ్రమ ఎంతో ఉంది. ముఖ్యంగా తన తండ్రి తన కెరీర్‌నే పక్కనపెట్టేసి. తనయుడి కెరీర్ కోసం, అతనితో కలిసి టోర్నీలకు విదేశాలకు వెళ్లేవారట. స్వతహాగా ఈఎన్టీ స్పెషలిస్ట్ అయిన ఆయన 2017-18లో తన కుమారుడి కోసం ఆయన ప్రాక్టీస్ ఆపేశారు. దీంతో మైక్రోబయాలజిస్ట్ అయిన తల్లి సంపాదనతోనే ఆ ఇల్లు గడిచేది. చివరి గేమ్ గెలిచి బయటకు వచ్చిన తర్వాత కూడా తండ్రిని హత్తుకుని గుకేశ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చెన్నైలో ఉన్న తల్లికి ఫోన్ చేసి మాట్లాడాడు. తల్లికొడుకులు భావోద్వేగానికి గురయ్యారు.
Gukesh is the World Chess Champion 🥹♥️#chess #gukesh #chessbaseindia pic.twitter.com/2LvXuk9K9P
— ChessBase India (@ChessbaseIndia) December 12, 2024
చదరంగంపై ప్రేమ - ఎత్తులు వేయడంలో దిట్ట!
గుకేశ్ చిన్నప్పటి నుంచే బుద్ధిశాలి. అతడు మహా చలాకీగా ఉండేవాడు. ఏడేళ్ల వయసు ఉన్నప్పుడే అతనికి చదరంగంపై ప్రేమ పుట్టింది. క్రమంగా దాన్నే తన కెరీర్‌గా మలుచుకున్నాడు. ఎత్తుకు పై ఎత్తులు వేయడంలో దిట్ట అయిన గుకేశ్ ఈ క్రీడపై త్వరగానే పట్టు సాధించిన అండర్-12 ప్రపంచ చెస్ యూత్ ఛాంపియన్‌గా నిలిచాడు. నాలుగో తరగతి తర్వాత పూర్తిగా ఆటపైనే దృష్టి సారించి పిన్న వయస్సు (12 ఏళ్ల 7 నెలల 17 రోజులు)లోనే గ్రాండ్‌మాస్టర్‌గా నిలిచాడు. అయితే కేవలం 17 రోజుల తేడాతో ప్రపంచ రికార్డు కోల్పోయాడు. ప్రపంచంలో మూడో అతి పిన్న వయస్సు గ్రాండ్‌మాస్టర్‌గా చరిత్రకెక్కాడు.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదురైనా ఆగిపోలేదు
అయితే కొన్నిసార్లు గుకేశ్ టోర్నీలకు పంపించడం కోసం తల్లిదండ్రులు నిధుల సేకరణ కూడా చేపట్టారు. 2020 నుంచి వెస్ట్‌బ్రిడ్జ్ ఆనంద్ చెస్ ఆకాడమీ (వాకా)లో విశ్వనాథన్ ఆనంద్ చెప్పిన మాటలు గుకేశ్ కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. క్రమంగా ఆటలో మేటిగా ఎదిగిన గుకేశ్ 2022లో దిగ్గజం కార్ల్‌సన్‌పై గెలిచి తన కెరీర్లో మరో మైల్‌స్టోన్‌ను అందుకున్నాడు. నిరుడు ఆసియా క్రీడల్లో పురుషుల జట్టుతో రజతాన్ని ముద్దాడాడు. ఈ ఏడాది క్యాండిడేట్స్ మాస్టర్స్ టోర్నీలో అత్యుత్తమ ఆటగాళ్లను దాటి ఛాంపియన్‌గా నిలిచాడు. దీంతో ప్రపంచ ఛాంపియన్‌షిప్స్‌కు అర్హత సాధించిన అతి పిన్న వయస్కుడిగా (17 ఏళ్లు) నిలిచాడు. అంతేకాకుండా చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషుల జట్టు చారిత్రక స్వర్ణం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.
గత పదేళ్లుగా ఈ క్షణం కోసం నేను ఎన్నో కలలు కన్నాను. ఆరేడేళ్ల వయసు నుంచి ఇదే నా లక్ష్యంగా సాగుతున్నాను. ఇప్పుడు ఈ స్వప్నం సాకారమైనందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి చెస్ ప్లేయర్ ఈ కలను నిజం చేసుకోవాలని అనుకుంటాడు. ఇప్పుడు నేను దీన్ని అందుకున్నాను. నాకంటే తల్లిదండ్రులు ఈ విజయం కోసం ఎక్కువగా ఎదురుచూశారు. అమ్మతో ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో ఎమోషనలై ఏడ్చేశాను.
2013 ప్రపంచ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌లో కార్ల్‌సన్, ఆనంద్ పోటీపడుతుంటే చూశాను. ఏదో ఒక రోజు ఆ అద్దాల గదిలో కూర్చుంటే బాగుంటుందని ఎన్నో సార్లు అనుకున్నాను. కానీ ఇప్పుడు ఇక్కడికి చేరుకోవడం, కూర్చోవడం, పక్కనే భారత పతాకం ఉండటం నా జీవితంలోనే అత్యుత్తమ సందర్భంగా నిలిచింది. కార్ల్‌సన్ గెలిచినప్పుడు ఆ టైటిల్‌ను తిరిగి భారత్‌కు నేనే తీసుకురావాలని అనుకున్నాను. అతిపిన్న వయస్సు ప్రపంచ ఛాంపియన్‌గా నిలవాలని 2017లోనే చెప్పాను. ఈ విజయాన్ని ఊహించకపోవడంత వల్లే గెలిచిన తర్వాత కాస్త భావోద్వేగానికి గురయ్యాను.
ఇక్కడికి వచ్చాక తొలి గేమ్‌లోనే ఓడిపోయాను. అప్పుడు లిఫ్ట్‌లో విషీ సర్ కలిసి "నాకప్పుడు (2006లో తొలి గేమ్‌లో ఓడాక) 11 గేమ్సే గిలాయి. ఇప్పుడు నీకు ఇంకా 13 గేమ్‌లున్నాయి. నీకు అవకాశాలు వస్తాయి" అని చెప్పారు. ఆయన నాకెప్పుడూ సపోర్టివ్‌గానే ఉన్నారు. వీలైనంత కాలం అత్యున్నత స్థాయి చెస్ ఆడాలన్నదే నా మొయిన్ లక్ష్యం. ఇప్పుడే నా కెరీర్ మొదలైంది. ఇంకా చాలా ఉంది. ప్రపంచ ఛాంపియన్‌షిప్ గెలిచినంత మాత్రానా నేనేం అత్యుత్తమం అని కాదు. కార్ల్‌సన్ మేటి ఆటగాడు. అతని స్థాయికి చేరుకోవాలి.
- గుకేశ్, ప్రపంచ చెస్ ఛాంపియన్
" when magnus won, i thought i really want to be the one to bring back the title to india" - 🇮🇳 gukesh d#DingGukesh pic.twitter.com/8ZddwM5D0G
— International Chess Federation (@FIDE_chess) December 12, 2024