Next BCCI Secretary : బీసీసీఐ కార్యదర్శిగా ఉన్న జై షా ఈ మధ్యే ఐసీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన స్థానంలో బీసీసీఐ కార్యదర్శిగా ఎవరు ఎన్నిక అవుతారన్నది ప్రస్తుతం ఆసక్తిగా మారింది. గుజరాత్ క్రికెట్ సంఘం కార్యదర్శి అనిల్ పటేల్, ప్రస్తుతం బీసీసీఐ జాయింట్ సెక్రెటరీగా ఉన్న దేవ్‌జిత్ సైకియా ఈ కార్యదర్శి రేసులో ఉన్నట్లు సమాచారం. దిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రోహన్ జైట్లీ కూడా బీసీసీఐ కార్యదర్శి పోస్ట్‌పై ఆసక్తితో ఉన్నట్లు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే, అవన్నీ తప్పుడు కథనాలని ఆయన అప్పుడే కొట్టిపారేశారు.
"ఏం జరుగుతుందో మాకైతే తెలీదు. బీసీసీఐ అధికారులు, రాష్ట్ర క్రికెట్ సంఘాలు ఈ విషయంపై మౌనం వహిస్తున్నారు. ప్రస్తుతానికి జాయింట్ సెక్రటరీ దేవ్‌జిత్ సైకియా తాత్కాలిక కార్యదర్శిగా ఉంటారు. అయితే రోజువారీ ప్రాతిపదికన పరిష్కరించాల్సిన సమస్యలు కూడా చాలా ఉన్నాయి. కార్యదర్శిగా ఎన్నికయ్యే వారికి బీసీసీఐ ఎలా నడుస్తుందనే విషయంపై కాస్త అవగాహన కూడా ఉండాలి" అని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి.
45 రోజుల్లోపే అలా చేయాలి - కాగా, బీసీసీఐ రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన ఆఫీస్ బేరర్ రాజీనామా చేస్తే 45 రోజుల్లోపే బోర్డు ప్రత్యేక సాధారణ సమావేశం నిర్వహించాలి. అందులో రాజినామా చేసిన వారి స్థానంలో కొత్త వారిని ఎన్నుకోవాలి. అయితే, ఎన్నికలు నిర్వహించడం కోసం కనీసం నాలుగు వారాల ముందు ఎన్నికల అధికారిని కూడా నియమించాల్సి ఉంది.
తక్షణ కర్తవ్యం అదే - గత ఐదేళ్లు బీసీసీఐ కార్యదర్శిగా పని చేసిన జై షా ఇటీవలే ప్రపంచ క్రికెట్‌ను శాసించే పదవి బాధ్యతలను స్వీకరించారు. దివంగత జగ్మోహన్ దాల్మియా, శరద్ పవార్, శశాంక్ మనోహర్, ఎన్.శ్రీనివాసన్ తర్వాత ఆ పదవి చేపట్టిన ఐదో భారతీయుడిగా 36 ఏళ్ల జై షా నిలిచారు. అతి పిన్న వయసులో ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఇప్పుడు ఐసీసీ ఛైర్మన్‌గా ఆయన తక్షణ కర్తవ్యం ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్‌ను ఖరారు చేయడమే.
ఐసీసీకి పాక్ మెలిక - స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బీసీసీఐ!
'పెళ్లైన తర్వాత బ్యాడ్మింటన్ కంటిన్యూ చేస్తాను - ఇప్పటికీ రోజూ ప్రాక్టీస్ చేస్తున్నా'