Border - Gavaskar Trophy 2024 Shubman Gill : బోర్డర్ - గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్‌కు సిద్ధమవుతోంది టీమ్ ఇండియా. బ్రిస్బేన్ గబ్బా వేదికగా ఇది జరగనుంది. ఇప్పటికే ఇరు జట్లు చెరొక విజయంతో సమంగా నిలిచాయి. మొదటి మ్యాచ్‌లో 295 పరుగుల తేడాతో టీమ్ ఇండియా విజయం సాధించగా, రెండో టెస్టులో (గులాబీ బంతి) 10 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా గెలుపొందింది.
అయితే ఇప్పుడు గబ్బా టెస్టు నేపథ్యంలో శుభ్‌మన్ గిల్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడాడు. తాము తాజాగా సిరీస్‌ను మొదలుపెడతామని, ఇక నుంచి మూడు టెస్టుల సిరీస్‌గా భావించి ఆడుతామని చెప్పాడు. అలాగే ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు అభినందనలు కూడా తెలిపాడు.
"భారత శిబిరంలో అంతా మంచిగా ఉంది. జట్టులోని ఆటగాళ్లంతా కలిసి కూర్చుని డిన్నర్ చేశాం. ఎంతో సరదాగా గడిపాము. అడిలైడ్‌లో మేం అనుకున్నట్లుగా రిజల్ట్ రాలేదు. అందుకోసం మరీ అంతగా ఆందోళన పడటం లేదు. ఇక నుంచి మేం మూడు టెస్టుల సిరీస్‌గా భావించి ముందుకెళ్తాం. ఈ మ్యాచ్‌లో మేం విజయం సాధిస్తే, మెల్‌బోర్న్, సిడ్నీ మ్యాచుల్లోనూ పైచేయి సాధిస్తాం. గత సిరీస్‌లోనూ అడిలైడ్‌లో మేం ఓడిపోయాం. కానీ, ఆ తర్వాత మ్యాచుల్లో గెలిచి సిరీస్‌ను దక్కించుకున్నాం. ఇప్పుడూ అదే సానుకూల దృక్పథంతో బరిలోకి దిగుతున్నాం. గబ్బాలో మేం మెరుగైన ఆటతీరు ప్రదర్శించిన చరిత్ర ఉంది. మైదానమంతా కలిసి తిరిగాం. గొప్ప జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. ఇక్కడ పిచ్ కూడా బాగుటుంది" అని గిల్ పేర్కొన్నాడు.
గుకేశ్ కంగ్రాట్స్
"ప్రపంచ చెస్ ఛాంపియన్‌గా నిలిచిన గుకేశ్‌కు అభినందనలు తెలుపుతున్నాను. టీమ్ ఇండియా నుంచి అతడికి అభినందనలు తెలుపుతున్నాం. చిన్న వయసులోనే అరుదైన ఫీట్‌ను అతడు సాధించడం దేశానికే గర్వకారణం" అని శుభమన్ గిల్ ప్రశంసలు కురిపించాడు. ఐసీసీ అధ్యక్షుడు జై షా కూడా దీనిపై స్పందించాడు. "కంగ్రాట్స్ గుకేశ్. దేశం గర్వపడేలా చేశావు. భవిష్యత్తులోనూ మరిన్ని ఘనతలు సాధించాలని కోరుకుంటున్నాను" అని పోస్టు పెట్టారు.
గబ్బా మ్యాచ్ వెరీ స్పెషల్! - ఆ ఒక్క సెంచరీతో సచిన్ సాధించలేని రికార్డు విరాట్ సొంతం!
రూట్ మార్చిన టీమ్ఇండియా - రోహిత్ ఈ సారి ఏ ఆర్డర్లో వస్తాడంటే?