Virat Kohli UK Citizenship: టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడు. తన కెరీర్లో పరుగుల వరద పారిస్తూ ఇప్పటికే సరికొత్త రికార్డులు సృష్టించాడు. ఇప్పటికీ తన ఆటను కొనసాగిస్తూ కెరీర్లో ముందుకెళ్తున్నాడు. అందుకే ఫ్యాన్స్ అతడిని ముద్దుగా కింగ్ కోహ్లీ అని పిలుచుకుంటారు. అయితే ఇటీవల కాలంలో కోహ్లీ గురించి ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
విరాట్‌కు బ్రిటన్ పౌరసత్వం!
విరాట్ కోహ్లీ భారత పౌరసత్వాన్ని వదులుకుని బ్రిటన్ పౌరసత్వాన్ని తీసుకుంటాడని వార్తలు వస్తున్నాయి. అక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటాడని కథనాలు వెలువడ్డాయి. అయితే కోహ్లీ ఒకవేళ బ్రిటన్ పౌరసత్వాన్ని తీసుకుంటే భారత్ తరఫున క్రికెట్ ఆడగలడా? ఐసీసీ, బీసీసీఐ రూల్స్ ఏం చెబుతున్నాయి? తదితర విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
UK పౌరసత్వం తీసుకుంటే?
ఒకవేళ విరాట్ కోహ్లీ యూకే పౌరసత్వాన్ని తీసుకుంటే, అతడు భారత్ తరఫున ఆడగలడా? అనే విషయం ఐసీసీ, బీసీసీఐ నిబంధనలపై ఆధారపడి ఉంటుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం క్రికెటర్లు తప్పనిసరిగా వారు ప్రాతినిధ్యం వహిస్తున్న దేశానికి చెందినవారై ఉండాలి. అంటే వారు ప్రాతినిధ్యం వహించే దేశం నుంచి పాస్ పోర్టును కలిగి ఉండాలి. ఒకవేళ విరాట్ యూకే పౌరసత్వం తీసుకుంటే అతడి వద్ద ఇండియా జారీ చేసే పాస్ పోర్టు ఉండదు. అప్పుడు విరాట్ టీమ్ ఇండియా తరఫున క్రికెట్ ఆడలేడు.
భారతదేశ పౌరసత్వ చట్టాలు
భారతదేశంలో అధికారికంగా ద్వంద్వ పౌరసత్వం అమల్లో లేదు. అయితే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (OCI) కార్డు ఉంది. ఇది భారతీయ సంతతికి చెందిన వ్యక్తులు దేశంలో నిరవధికంగా నివసించడానికి, ఉద్యోగం చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఒకవేళ కోహ్లీ యూకే పౌరసత్వం తీసుకుంటే, అతడు ఓసీఐ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ, ఇది దేశం తరఫున క్రికెట్ ఆడటానికి పనికిరాదు. భారత పౌరసత్వానికి ఓసీఐ కార్డు సమానం కాదు.
గతంలో ఇలాంటి సంఘటనలు
ఇంగ్లాండ్ హిట్టర్ కెవిన్ పీటర్సన్ తొలుత సౌతాఫ్రికా జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు తరఫున ఆడాడు. అయితే, కోహ్లీలా కాకుండా అంతగా ఫేమస్ కాకముందే పీటర్సన్ వేరే దేశ పౌరసత్వం తీసుకుని అక్కడి వెళ్లిపోయాడు.
ఒకవేళ కోహ్లీ యూకే పౌరసత్వం పొందితే దాన్ని త్యజించి, భారతీయ పౌరుడిగా మారితే తప్ప దేశం తరఫున క్రికెట్ ఆడలేడు. మరోవైపు, భారత్ తరఫున కాకుండా కోహ్లీ వేరే దేశం తరపున ఆడాలనుకుంటే కొన్నాళ్లు వేచి ఉండాలి. కోహ్లీకి దేశంలో చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. అలాగే భారత జట్టుతో అనుబంధం అయితే క్రీడలకు మించింది. ఒకవేళ కోహ్లీ టీమ్ఇండియాకు కాకుండా వేరే జట్టుకు ఆడాలని భావిస్తే కోట్లాది మంది అభిమానులు బాధపడే అవకాశం ఉంది. విరాట్ కోహ్లీ యూకే పౌరసత్వం పొంది, భారత్ తరఫున ఆడటం ప్రస్తుత నిబంధనల ప్రకారం సాధ్యం కాదు.
Virat Kohli with Akaay in London. ❤️pic.twitter.com/bbqZetrExZ
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 18, 2024
ఆ 5 రికార్డులను బ్రేక్ చేయడం విరాట్‌కు సాధ్యమేనా? - Sachin Virat Record Comparison