Virat Kohli in T20 World Cup 2024 : టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ 2024లో పరుగుల వరద పారించిన సంగతి తెలిసిందే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగి అద్భుతంగా రాణించాడు. 15 మ్యాచులలో 741 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను దక్కించుకున్నాడు. అలా ఐపీఎల్‌లో ఫామ్‌లో ఉండగానే టీ20 వరల్డ్ కప్ 2024కు సెలెక్ట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ తరహాలోనే ఈ మెగా ఈవెంట్లోనూ కోహ్లీ పరుగులు వరద పారించి మెరుపులు మెరిస్తాడనుకుంటే అలా చేయట్లేదు. వరుస వైఫల్యాలతో ఫ్యాన్స్‌ను తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాడు. మాజీలు కూడా దీనిపై కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
ఈ టీ20 ప్రపంచకప్ 2024లో విరాట్ కోహ్లీ చేసిన పరుగులు 1, 4, 0. ఐర్లాండ్ జట్టుపై 1 పరుగు మాత్రమే చేసిన కోహ్లీ, కీలక పాకిస్థాన్ పోరులోనూ 4 పరుగులతో నిరాశపరిచాడు. కనీసం అమెరికా జట్టుపైనా ఫామ్‌లోకి వస్తాడనుకుంటే అది జరగలేదు. గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగాడు.
న్యూయార్క్ పిచ్ బ్యాటింగ్‌కు చాలా కష్టంగా ఉన్నప్పటికీ స్టార్ బ్యాటరైన విరాట్ కోహ్లీ మరీ ఇంత దారుణంగా ప్రదర్శన చేస్తాడని ఎవరూ ఊహించలేదు. దీంతో ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఐపీఎల్‌లో చెలరేగి ఆడిన కోహ్లీ ఏమైంది? అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కనీసం కెనడాతో జరిగే మ్యాచ్‌లోనైనా కోహ్లీ ఫామ్ అందుకోవాలని అభిమానులతో సహా టీమ్ మేనేజ్‌మెంట్, మాజీలు కోరుకుంటున్నారు.
కాగా, టీ20 వరల్డ్ కప్ 2024లో గ్రూప్ ఏలో ఉన్న టీమ్ఇండియా ఇప్పటివరకు మూడు మ్యాచులు ఆడింది. ఆడిన మూడు మ్యాచ్‌లలో విజయాలను అందుకుంది. ప్రస్తుతం 6 పాయింట్లతో సూపర్ 8కు కూడా అర్హత సాధించింది. ఇక సూపర్ 8లో ఆస్ట్రేలియా, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా లాంటి మేటీ జట్లతో పోటీ పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ ఫామ్‌లేమి కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. కాబట్టి కెనడాతో జరగబోయే మ్యాచ్‌తో అతడు ఫామ్ అందుకుంటే ఆత్మవిశ్వాసంతో సూపర్ 8లోకి ఎంట్రీ ఇవ్వొచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఆ జట్టు చేతిలోనే పాకిస్థాన్, యూఎస్‌ఏ 'సూపర్ - 8' భవితవ్యం - T20 Worldcup 2024
న్యూజిలాండ్ ఖేల్ ఖతం! - సూపర్ 8కు దూసుకెళ్లిన వెస్టిండీస్ - T20 Worldcup 2024