T20 WORLD CUP 2024 : భారత టీ20 వరల్డ్ కప్ జట్టును ప్రకటించగానే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, అతని అభిమానులకు పెద్ద రిలీఫ్ లభించింది. ముఖ్యంగా అతడి అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత ఐపీఎల్ 2024లో శాంసన్ అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అయినా టీమ్ ఇండియాలో కీపర్-బ్యాటర్ పొజిషన్‌కు గట్టి పోటీ ఉండటంతో ఏదో ఒక మూల సంజూ ఎంపికపై అందరిలో సందిగ్ధం నెలకొంది. అయితే ఎట్టకేలకు మంగళవారం బీసీసీఐ ప్రకటనతో ఈ సందిగ్ధానికి తెరపడింది.
శాంసన్ ఈ ఐపీఎల్‌లో ఇప్పటివరకు 9 మ్యాచుల్లో 77 యావరేజ్, 161.08 స్ట్రైక్ రేట్‌తో 385 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో కొనసాగుతున్నాడు. అలా తన కీపింగ్, బ్యాటింగ్ ప్రదర్శనలతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించి టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో చోటు దక్కించుకున్నాడు.
- రాహుల్‌తో పోటీ
రిషబ్ పంత్ తర్వాత రెండో వికెట్ కీపర్-బ్యాటర్ స్లాట్‌కు సంజూతో కేఎల్ రాహుల్ పోటీ పడ్డాడు. రాహుల్ ఈ సీజన్‌లో 9 మ్యాచుల్లో 144.27 స్ట్రైక్ రేటుతో 378 పరుగులు చేశాడు. అత్యధిక పరుగుల జాబితాలో ఏడో స్థానంలో నిలిచాడు. ఇద్దరినీ పోలిస్తే స్ట్రైక్-రేట్ కాకుండా మరో తేడా కనిపించదు. కానీ శాంసన్ గణాంకాలు రాజస్థాన్ రాయల్స్‌పై చూపిన ప్రభావం కీలకం.
ఐపీఎల్‌లో సంజూ శాంసన్ ప్రయాణం అతని ప్రదర్శనలో చెప్పుకోదగ్గ మార్పును తీసుకొచ్చింది. తరచూ కన్సిస్టెన్సీ విషయంలో శాంసన్ విమర్శలు ఎదుర్కొనేవాడు. IPL 2023లో కూడా ప్రారంభంలో అర్ధ సెంచరీలు సాధించినా, చివరికి అతని ప్రదర్శన క్షీణించింది. అయినప్పటికీ, శాంసన్ తన లోపాల గురించి విచారం వ్యక్తం చేయకుండా, అధిగమించేందుకు కష్టపడ్డాడు. రాజస్థాన్ రాయల్స్ సాధిస్తున్న విజయాల్లో అతని ప్రభావం స్పష్టంగా కనిపించిది.
- లఖ్‌నవూపై అద్భుత ప్రదర్శన
ఉదాహరణకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్స్ 197 పరుగులు ఛేదించాల్సి వచ్చింది. ఇందులో శాంసన్ ప్రదర్శన ఆటగాడిగా శాంసన్ ఎదుగుదలను చూపించింది. ఛేజింగ్‌లో ఆర్‌ఆర్ చాలా త్వరగానే జోస్ బట్లర్‌ను కోల్పోయింది. 9వ ఓవర్‌లో మూడు వికెట్ల నష్టానికి జట్టు స్కోరు 78 మాత్రమే. ఆ సమయంలో శాంసన్ (71 నాటౌట్, 33 బంతులు), ధ్రువ్ జురెల్ (52 నాటౌట్, బంతులు) ఆర్‌ఆర్‌ను మరో ఓవర్ మిగిలి ఉండగానే ఏడు వికెట్ల తేడాతో గెలిపించారు.
పరిణితితో పాటు నేచురల్‌గా సిక్సులు కొట్టే సామర్థ్యం సంజూకి అదనపు బలమని క్రికెట్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఐపీఎల్ 2020 ఎడిషన్ నుంచి ఏ బ్యాటర్ కూడా శాంసన్ (110) కన్నా ఎక్కువ సిక్సర్లు కొట్టలేకపోయారు. శాంసన్ నంబర్ 1 నుంచి నంబర్ 5 వరకు ఏ స్థానంలో బ్యాటింగ్ చేయగలగే సామర్థ్యం ఉంది. వెస్టిండీస్, USA పిచ్‌లపై అతని షాట్‌లు ఆడే సామర్థ్యం భారత్‌కు కలిసొస్తుందని చెప్పొచ్చు. - తుది జట్టులో ఉంటాడా?
అయితే తీవ్ర పోటీ ఎదుర్కొని జట్టులో స్థానం సంపాదించుకున్న సంజు శాంసన్ తుది జట్టులో చోటు దక్కించుకుంటాడా అనేది ప్రస్తుతం అందరి ముందు మెదులుతున్న ప్రశ్న. అతడు చోటు దక్కించుకోవాలంటే పంత్, కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, జైశ్వాల్‌లో ఎవరికో ఒకరికి రెస్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదా మరేదైనా కారణం ఉండాలి. ఏదేమైనా సంజు తుది జట్టులో ఉండాలనేది కోరిక. ఏం జరిగినా శాంసన్ మాత్రం ఓపికగా ప్రశాంతంగా ఉండటం అతడి బలం. చూడాలి మరి ఏం జరుగుతుందో.
ఇంపాక్ట్ రూల్ వల్లే రింకూ సింగ్‌కు జట్టులో చోటు దక్కలేదా? - T20 World Cup 2024