Sunil Gavaskar About Border Gavaskar Trophy : 1996 అక్టోబరులో దిల్లీలోని కోట్లా మైదానంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ జరిగిన సమయంలో బోర్డర్- గావస్కర్ అనే పేరు క్రీడాభిమానుల ముందుకు వచ్చింది. దీంతో రెండు దేశాల మధ్య జరిగే టెస్ట్ సిరీస్‌కి మొదటిసారి ఈ పేరును అధికారికంగా ప్రకటించారు. దిగ్గజ క్రికెటర్లు భారతదేశానికి చెందిన సునీల్ గావస్కర్, ఆస్ట్రేలియాకు చెందిన అలన్ బోర్డర్‌కి గౌరవసూచకంగా ఈ పేరును కనుగొన్నారు. అయితే భారత్, ఆస్ట్రేలియా మధ్య టెస్ట్ సిరీస్‌లకు ఓ గొప్ప చరిత్ర ఉంది.
నువ్వా, నేనా అన్నట్లు సాగే సిరీస్‌లలో ఎన్నో అద్భుత ప్రదర్శనలు, పోరాటాలు జరిగాయి. లెజెండరీ బౌలర్లు షేన్ వార్న్, గ్లెన్ మెక్‌గ్రాత్‌ని సచిన తెందూల్కర్ దీటుగా ఎదుర్కోవడం నుంచి 2001 కోల్‌కతా టెస్టులో వీవీఎస్ లక్ష్మణ్, రాహుల్ ద్రవిడ్ అద్భుత పార్ట్‌నర్‌షిప్‌తో మ్యాచ్ గతిని మార్చేయడం వరకు ఎన్నో అద్భుతాలు జరిగాయి. ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లి వీరోచిత ప్రదర్శనలను భారత్ ఎప్పటికీ మర్చిపోదు.
ఇక ఆస్ట్రేలియా గడ్డపై భారత్- ఆస్ట్రేలియా టెస్టు సిరీస్‌లు చాలా ఆసక్తిగా సాగాయి. ఆస్ట్రేలియాలో గత రెండు టెస్ట్ సిరీస్‌లను గెలుచుకున్న భారత్, ఇప్పుడు వరుసగా మూడో టెస్టు సిరీస్ విజయంపై కన్నేసింది. ఈ సందర్భంగా సునీల్ గావస్కర్, ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీని చెప్పుకొచ్చారు. తనకు అలన్ బోర్డర్‌కి మధ్య జరిగిన పలు ఆసక్తికర విషయాలను ఆ స్టోరీ ద్వారా షేర్ చేసుకున్నారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో గావస్కర్‌ను హోస్ట్ " మీకూ, బోర్డర్‌కు మధ్య చాలా ఏళ్ల స్నేహం ఉంది. మీ ఇద్దరి మధ్య పోటీ, తీవ్రత ఎలా ఉండేది." అని అడిగారు. దీనికి గావస్కర్ చిరునవ్వుతో ఇలా సమాధానమిచ్చాడు. "పోటీ బాగా ఉండేది, అతడు (బోర్డర్) నన్ను ఓ సారి ఔట్ చేశాడు. అదే సమస్య. నాకు అతడికి బౌలింగ్ చేసే అవకాశం ఎప్పుడూ రాలేదు. నాకూ బౌలింగ్ చేసే అవకాశం వచ్చి ఉండి, నేను అతడిని ఔట్ చేసుంటే భిన్నంగా ఉండేది. అతడు బౌలింగ్ చేస్తున్నప్పుడు ఒక్క బాల్ టర్న్ చేయగలిగాడు, ఆ బంతినే నేను రాంగ్ లైన్‌లో ఆడాను. అది టాప్ ఎడ్జ్ తీసుకుని, క్యాచ్ వెళ్లింది. ఈ విషయాన్ని బోర్డర్‌ని కలిసినప్పుడల్లా గుర్తు చేసేలా ప్రవర్తిస్తాడు. అతడు నా దగ్గరకు వచ్చి, "హలో బన్నీ, ఎలా ఉన్నావు?" అంటాడు. దానికి నేనేం చెప్పగలను." అని గావస్కర్ నవ్వుకున్నారు.
ఇక భారత్‌తో జరిగిన 20 టెస్టు మ్యాచ్‌ల్లో బోర్డర్ 4 వికెట్లు తీయగా, అందులో ఒకటి గావస్కర్‌ది కావడం గమనార్హం. అయితే 1987లో గావస్కర్ తర్వాత 1993లో టెస్టు క్రికెట్‌లో 10,000 పరుగుల మైలురాయిని చేరుకున్న ప్రపంచంలోని రెండో బ్యాట్స్‌మెన్‌గా బోర్డర్ నిలిచాడు.
వాళ్ల ప్లాన్స్ ఏంటో అతడికి బాగా తెలుసు - అలా చేస్తే విరాట్ ఇరుక్కున్నట్లే! : సంజయ్ మంజ్రేకర్
చెట్లెక్కిన అభిమానం - విరాట్‌ను చూసేందుకు ఆస్ట్రేలియాలో ఫ్యాన్స్ స్టంట్స్!