Shakib Al Hasan Slapped Fan : పేరుకే వరల్డ్ నెం.1 ఆల్ రౌండర్. కానీ, ఎప్పుడూ వివాదాలే. తాజాగా మంగళవారం జరిగిన ఓ దేశీవాలీ లీగ్ మ్యాచ్‌లో జరిగిన ఘటనతో మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. బంగ్లాదేశ్ క్రికెటర్ అయిన షకీబ్ అల్ హసన్ ఓ వ్యక్తి మెడ పట్టుకుని గెంటేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అసలేం జరిగిందంటే? - షకీబ్ ధాకా ప్రీమియర్ లీగ్‌లో షేక్ జమాల్ ధన్మోండి క్లబ్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే ఈ లీగ్‌లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్‌లో టాస్ వేసే ముందు ఓ వ్యక్తి పరిగెత్తుకుంటూ షకీబ్ దగ్గరకు వచ్చాడు. సెల్ఫీ కోసం అడుగుతూ కాస్త ఇబ్బంది పడతాడు. దీంతో కుదరదని నిరాకరించాడు షకీబ్. అయితే పలుమార్లు అతడు అడుగుతుండేసరికి కోపం తెచ్చుకుని అతని మెడ పట్టుకుని ఈడ్చాడు షకీబ్. ఫోన్ లాక్కొని మెడ పట్టుకొని బయటకు గెంటేశాడు.
కాగా, ఈ 37 ఏళ్ల క్రికెటర్‌కు కాంట్రవర్సీలు కొత్తేం కాదు. ఫీల్డ్‌లో అత్యంత కోపిష్టి బంగ్లాదేశ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది షకీబ్ అని టక్కున చెప్తారు. ఈ కోపంతో పలుమార్లు వార్తల్లోకి కూడా ఎక్కాడు షకీబ్. దేశీవాలీ లీగ్‌లో అంపైర్లు తీసుకున్న నిర్ణయంపై చిర్రెత్తుకుపోవడం, స్టంప్‌లను తన్నేయడం, సెల్ఫీలంటూ వచ్చిన ఫ్యాన్స్‌ను తరిమేయడం వంటి విషయాలతో తరచూ న్యూస్ ఐటెంగానే ఉంటాడు.
బంగ్లాదేశ్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న షకీబ్ ప్రస్తుతం జింబాబ్వేతో జరుగుతున్న టీ20 సిరీస్ లో ఆడాల్సి ఉంది. కాకపోతే పేసర్ ముస్తఫిజుర్ రెహ్మాన్‌తో పాటు షకీబ్ కూడా ఒక మూడు మ్యాచ్‌ల పాటు విరామంలో ఉన్నాడు. వన్డే ప్రపంచ కప్ 2023 తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లిన ఈ క్రికెటర్ బంగ్లాదేశ్‌లో కొద్ది నెలల క్రితం జరిగిన 12వ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందాడు. అలా క్రికెటర్‌గానే కాకుండా ఎంపీగా కూడా కొనసాగుతూనే ఉన్నాడు షకీబ్. దీంతో బాధ్యత గల పదవిలో ఉండి కూడా అభిమానులను కసురుకోవడం, విసుక్కోవడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
వరల్డ్ కప్ ముందు టీమ్ఇండియా మళ్లీ అదే తంతు - అసలా ప్లేయర్స్ భద్రమేనా? - IPL 2024
చాహల్ అదిరే రికార్డ్ - టీ20 క్రికెట్లో తొలి భారత బౌలర్‌గా - IPL 2024 Chahal