Sachin Tendulkar Birthday Special : ఎవరూ అందుకోలేని రికార్డులు, ఎవరికీ సాధ్యం కాని సుదీర్ఘ కెరీర్ అతని సొంతం. క్రికెట్‌కు ఎన్నో అరుదైన రికార్డులు పరిచయం చేశాడు ఈ స్టార్ క్రికెటర్. తనని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యారు. అందుకే సచిన్ తెందూల్కర్‌ను 'క్రికెట్ గాడ్'గా అభిమానుల మనస్సుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. నేడు ఏప్రిల్ 24న సచిన్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా సచిన్ కెరీర్‌లోని కీలక అంశాలను గుర్తు చేసుకుందాం.
1973 ఏప్రిల్ 24న ముంబయిలో జన్మించాడు తెందూల్కర్. తండ్రి రమేష్ తెందూల్కర్, సుప్రసిద్ధ మరాఠీ నవలా రచయిత, కవి. తల్లి రజని, ఆమె ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో పని చేశారు. గురువు రమాకాంత్ అబ్రేకర్ సలహాతో సచిన్, స్టేడియానికి దగ్గరగా ఉండే పాఠశాలకు మారి క్రికెట్లో శిక్షణ తీసుకున్నాడు.
పాఠశాలలో ఉన్నప్పుడు హ్యారీస్ షీల్డ్ పోటీలో వినోద్ కాంబ్లీతో కలసి 1988లో 644 పరుగుల పార్ట్‌నర్‌షిప్‌తో రికార్డు సృష్టించాడు. 1988 డిసెంబర్ 11న వాంఖడే స్టేడియంలో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో బొంబాయి తరఫున రంజీల్లో అరంగేట్రం చేశాడు. మొదటి మ్యాచ్‌లోనే 100 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అతి చిన్న వయసులోనే అరంగేట్రం మ్యాచ్‌లో సెంచరీ చేసిన రికార్డు నెలకొల్పాడు.
1989 నవంబర్ 15న పాకిస్థాన్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. అదే ఏడాది డిసెంబర్‌లో పాకిస్థాన్‌పై తొలి వన్డే ఆడాడు. 2006 డిసెంబర్ 1న దక్షిణాఫ్రికాపై ఇంటర్నేషనల్ టీ20ల్లో సచిన్ అడుగు పెట్టాడు. అయితే ఇదే సచిన్ ఆఖరి టీ 20 మ్యాచ్ కావడం గమనార్హం. 2008 మే 14న చెన్నై సూపర్ కింగ్స్‌పై మొదటి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.
సచిన్ మొత్తం 200 టెస్టు మ్యాచ్‌లలో 15,921 పరుగులు చేశాడు. మొత్తం 463 వన్డేల్లో 18,426 పరుగులు సాధించాడు. ఇంటర్నేషనల్ టీ20లో ఆడిన ఒక్క మ్యాచ్‌లో 10 పరుగులే చేశాడు. టెస్టుల్లో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు బాదాడు. వన్డేల్లో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు కొట్టాడు. మొత్తంగా 664 మ్యాచ్‌లలో 34,357 పరుగులు సాధించాడు.
సచిన్ బౌలింగ్‌లోనూ ప్రతిభ కనబరిచాడు. టెస్టుల్లో 46, వన్డేల్లో 154 వికెట్లు పడగొట్టాడు. ఆడిన ఒకే ఒక్క టీ20 మ్యాచ్‌లోనూ ఒక వికెట్ సాధించాడు.
2011లో తీరిన కల
ఐసీసీ వన్డే ప్రపంచకప్ గెలవాలన్న సచిన్ కోరిక 2011లో నెరవేరింది. ధోని కెప్టెన్సీలో టీమ్ ఇండియా ప్రపంచకప్ గెలిచింది. 2012లో వన్డే క్రికెట్‌కి సచిన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. మరుసటి ఏడాదే టెస్టులకు వీడ్కోలు పలికాడు. 25 టెస్టులు, 73 వన్డే మ్యాచ్‌లకు సచిన్ కెప్టెన్‌గా వ్యవహరించాడు.
సచిన్ ముగ్గురు గురువులు ఎవరంటే?
క్రికెట్‌లో ఉన్నత శిఖరాలు అందుకోవడానికి తన ముగ్గురు గురువులే కారణమని సచిన్ చెబుతుంటాడు. వారిలో ఒకరు తన తండ్రి రమేశ్ తెందూల్కర్ కాగా, మరొకరు తన అన్నయ్య అజిత్ తెందూల్కర్. ఇంకొకరు క్రికెట్ పాఠాలు నేర్పించిన రమాకాంత్ అబ్రేకర్.
గరిటె తిప్పడంలో 'మాస్టర్'
రిటైర్‌మెంట్ తర్వాత సచిన్ సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ని తరచూ పలకరిస్తున్నాడు. అప్పుడప్పుడు గరిటె తిప్పుతుంటాడు. ఇంట్లో ఉన్నప్పుడు భార్య పిల్లలకు వంట చేసి పెడుతుంటాడు. ఈ వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటాడు. సచిన్‌కి ముంబయి, బెంగళూరులో రెస్టారెంట్లు ఉన్నాయి. అలాగే ముంబయి, లండన్లో క్రికెట్ అకాడమీలూ ఉన్నాయి.తన అభిమాన నటులుగా సచిన్ అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, నానా పటేకర్ పేర్లు చెబుతాడు.
సమాజ సేవలో ముందు
సమాజ సేవ చేయడంలోనూ సచిన్ ముందుంటాడు. ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు యూనిసెఫ్‌తో కలిసి పనిచేశాడు. ప్రధాని మోదీ ప్రారంభించిన స్వచ్ఛభారత్ కార్యక్రమం బ్రాండ్ అంబాసిడర్లలో సచిన్ ఒకరు. ఎన్జీవోలతో కలిసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంటాడు. ఏపీలోని నెల్లూరు జిల్లాలో పుట్టంరాజు కండ్రిగ అనే గ్రామాన్ని దత్తత తీసుకొన్నాడు.
అవార్డులు, గుర్తింపు
సచిన్‌కు 1994లో అర్జున అవార్డు, 1997/98లో ఖేల్ రత్న, 1999లో పద్మశ్రీ, 2008లో పద్మ విభూషణ్, 2014లో భారతరత్న వరించాయి. అతను ఇంకా ఎన్నో ప్రతిష్ఠాత్మక అవార్డులు అందుకున్నారు. 2012లో సచిన్ తెందూల్కర్ రాజ్యసభ ఎంపీగా నామినేట్ అయ్యాడు. అంతే కాకుండా రాజ్యసభకు నామినేట్ అయిన తొలి క్రీడాకారుడిగా సచిన్ గుర్తింపు పొందాడు. క్రికెట్లో తన అనుభవాలతో సచిన్ 'ప్లేయింగ్ ఇట్ మై వే' అనే ఆత్మకథ రాశాడు. సచిన్ జీవితాన్ని 'సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్' పేరుతో ఓ డాక్యుమెంటరీ మూవీగా మలిచారు. 2017లో ఈ మూవీ విడుదలైంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కశ్మీర్ ట్రిప్ హైలైట్స్ షేర్ చేసిన సచిన్- క్రికెట్ గాడ్ ట్వీట్‌కు మోదీ రిప్లై