Run Out Controversy Joseph: ఆస్ట్రేలియా- వెస్టిండీస్ టీ20 మ్యాచ్‌లో క్రికెట్ చరిత్రలో వింత సంఘటన జరిగింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరుజట్ల మధ్య ఫిబ్రవరి 11న రెండో టీ20 జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ నిర్దేశించిన 242 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో విండీస్ 207 పరుగులకే పరిమితమైంది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో విండీస్ ప్లేయర్ అల్జారీ జోసెఫ్ రనౌట్ కాంట్రవర్సీకి దారి తీసింది.
ఏం జరిగిందంటే? రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బౌలర్ స్పెన్సర్ జాన్సన్ 18వ ఓవర్ బౌలింగ్ చేస్తున్నాడు. ఇదే ఓవర్ మూడో బంతిని విండీస్ ప్లేయర్ అల్జారీ జోసెఫ్ స్ట్రయిట్ కవర్స్ దిశగా ఆడి, సింగిల్‌కు పరిగెత్తాడు. ఫీల్డింగ్‌లో ఉన్న మిచెల్ మార్ష్ వెంటనే బంతి అందుకొని జాన్సన్‌కు విసరగా, అతడు స్టంప్స్ గిరాటేశాడు. అప్పటికీ జోసెఫ్ క్రీజులోకి చేరలేదు. దీంతో ఆసీస్ ప్లేయర్లు సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. కానీ, ఫీల్డ్ అంపైర్ గెరాడ్ అబూడ్ అది రనౌట్‌గా ప్రకటించలేదు.
రీప్లేలో చూడగా అది క్లియర్ రనౌట్‌గా కనిపించింది. దీంతో ఆసీస్ ప్లేయర్లంతా అంపైర్ వద్దకు వెళ్లి అడగ్గా,'మీరు అప్పీల్ చేయలేదు అందుకే అది ఔట్ ఇవ్వలేదు' అని సింపుల్‌గా రిప్లై ఇచ్చాడు. అంతే ఒక్కసారిగా ఆసీస్ ప్లేయర్లంతా ఆశ్చార్యానికి గురయ్యారు. చాలాసేపు అంపైర్‌తో చర్చించినా ఫలితం లేకపోయింది. ఇక అంపైర్, జోసెఫ్‌ను బ్యాటింగ్ కొనసాగించాలని చెప్పాడు. అయితే నిబంధనల ప్రకారం నిర్దేశించిన సమయంలోపు లేదా బౌలర్ తదుపరి బంతి ప్రారంభించక ముందే రనౌట్ కోసం అప్పీల్ చేయాల్సి ఉంటుంది. ఇక బిగ్ స్క్రీన్‌పై రీప్లే చూశాక కూడా అప్పీల్ చేయడం కుదరదు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్, 241 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది. స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (120* పరుగులు, 55 బంతుల్లో) మెరుపు శతకంతో అదరగొట్టాడు. కాగా, టీ20ల్లో మ్యాక్స్‌కు ఇది ఐదో శతకం. టీ20ల్లో అత్యధిక సెంచరీలు బాదిన రోహిత్ శర్మ (5) రికార్డును మ్యాక్స్ సమం చేశాడు.
క్రాలే LBW కాంట్రవర్సీ- టెక్నాలజీదే లోపమన్న స్టోక్స్- రవిశాస్త్రి స్ట్రాంగ్ రిప్లై!