Rohit Sharma T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా టీమ్ఇండియా జూన్ 5న తొలి మ్యాచ్ ఆడనుంది . ఈ మేరకు కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ వేదికైన నాస్సౌ కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం పరిస్థితులను సమీక్షించాడు. అమెరికాలోని మైదానాలను బట్టి భారీ స్కోర్లు నమోదు చేయలేమని చేతులెత్తేశాడు. బ్యాట్స్‌మెన్‌కు ఇది పెద్ద సవాల్ అని 140-150 వరకూ స్కోరు చేయడమే చాలా కష్టమని పేర్కొన్నాడు.
ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్ లో ఆచితూచి ఆడాలి కానీ, దూకుడుగా ఆడితే స్కోరు నమోదు చేయడం కష్టంగా మారుతుందని రోహిత్ అన్నాడు. పరిస్థితులకు తగ్గట్టుగా సీమర్లను, స్పిన్నర్లను బ్యాలెన్స్ చేసుకుని బెస్ట్ కాంబినేషన్ సెట్ చేయడం కీలకమని పేర్కొన్నాడు. వాస్తవానికి అదే మైదానంలో బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడింది టీమ్ఇండియా.
"బంగ్లాదేశ్‌తో మ్యాచ్ జరిగినప్పుడు ముగ్గురు స్పిన్నర్లను రెండేసి ఓవర్లు బౌలింగ్ వేయించాం. వాళ్లను ఎదుర్కోవడం అంత సులువుగా కనిపించలేదు. తర్వాత జరిగిన సౌతాఫ్రికా వర్సెస్ శ్రీలంక మ్యాచ్ లోనూ స్పిన్నర్లే ఎక్కువ వికెట్లు తీశారు. పరిస్థితులు పూర్తిగా ఎవరికీ అర్థం కావు కదా. స్కోర్లు ఈజీగా నమోదు చేసే గ్రౌండ్లుగా కనిపించడం లేదు. అది మైండ్‌లో పెట్టుకుని బెస్ట్ ఏది ఇవ్వగలమో అదే చేయాలి. ఐపీఎల్‌లో భారీగా పరుగులు చేసిన తర్వాత ఈ టోర్నీకి వచ్చాం. ఇక్కడ పరుగులు చేయడం అంత ఈజీ కాదు. నా వరకూ రేపటి మ్యాచ్‌కు ఎంత చేయగలనో అంతే చేస్తా. అందరితో కలిసి ఆడేందుకు ప్రయత్నిస్తా. వరల్డ్ కప్ లాంటి టోర్నీలలో ప్రతి ఒక్కరూ అదే చేయాలి. రేపటి గేమ్ కోసం ప్రిపేర్ అవ్వాలి కానీ, టోర్నమెంట్ మొత్తం ఏదో చేసేయాలని, ప్లాన్ చేసుకుని ఎక్కువ ఒత్తిడి తెచ్చుకోవద్దు" అని రోహిత్ పేర్కొన్నాడు.
ఇక శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. శ్రీలంక 16.2 ఓవర్లకు కేవలం 77 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇండియా తన తొలి మ్యాచ్‌ను ఐర్లాండ్‌తో జూన్ 5న ఆడనుండగా, జూన్ 9న రెండో మ్యాచ్‌లో పాకిస్తాన్‌తో న్యూయార్క్ వేదికగా తలపడనుంది. 2013 నుంచి ఐసీసీ టైటిల్ సొంతం చేసుకోవాలని టీమ్ఇండియా తాపత్రయపడుతూనే ఉంది.
రోహిత్, కోహ్లీకి ఇదే లాస్ట్- 11ఏళ్ల నిరీక్షణకు తెర దించుతారా? - T20 World Cup 2024
'టీమ్ఇండియాకు ఓ న్యాయం - మాకో న్యాయమా!' - T20 WORLDCUP 2024