Rohit Sharma On Impact Player: 2024 ఐపీఎల్లో గతంలో సీజన్ల కంటే భిన్నంగా సాగుతోంది. ఈ సీజన్లో పూర్తిగా బ్యాటర్లే ఆధిపత్యం చలాయిస్తున్నారు. ఇప్పటికే ప్రస్తుత టోర్నీలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే భారీ స్కోర్లు నమోదవ్వడానికి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రధాన కారణం అని పలువురు మాజీలు అభిప్రాయపడుతున్నాయి. తాజాగా టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ నిబంధనపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు.
ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌కు తాను పూర్తిగా వ్యతిరేకం అని హిట్‌మ్యాన్ అన్నాడు. దానివల్ల ఆల్‌రౌండర్ ప్లేయర్లకు న్యాయం జరగట్లేదని చెప్పాడు. 'ఇంపాక్ట్ లేదా సబ్సిట్యూట్ రూల్‌ను నేను పెద్దగా అభిమానికి కాదు. ఇది ఆల్రౌండర్లన ప్రతిభను వెనక్కి లాగుతోంది. శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్ దీనికి ఓ ఉదాహరణ. ఈ నిబంధన కారణంగా వాళ్లు బౌలింగ్ చేయలేకపోతున్నారు. అది మనకు (టీమ్ఇండియాను ఉద్దేశించి) కూడా మంచిది కాదు. దీంతో జట్టులో 12 మంది ఆడుతున్నారు. క్రికెట్ అనేది 11 మంది ఆడే ఆట' అని రోహిత్ అన్నాడు. అయితే ఈ రూల్ వల్ల చెన్నై సూపర్ కింగ్స్ దూబేను కేవలం బ్యాటింగ్‌కే పరిమితం చేసింది. అతడికి ఈ సీజన్లో బౌలింగ్ చేసే ఛాన్స్ రాలేదు. అటు సుందర్ పరిస్థితి కూడా దాదాపు అంతే.
అయితే ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను ఐపీఎల్ నిర్వాహకులు తొలిసారి 2023లో ప్రవేశపెట్టారు. ఈ నిబంధన వల్ల 11 మందికి అదనంగా మరో ప్లేయర్‌ను మ్యాచ్‌లో ఆడించవచ్చు. దీంతో ఆయా జట్లు బ్యాటింగ్ సమయంలో బ్యాటర్‌ను బరిలోకి దింపి, తర్వాత ఫీల్డింగ్‌లో సబ్‌సిట్యూట్‌గా అతడి స్థానంలో ఓ బౌలర్‌ను తెచ్చుకుంటున్నాయి. అయితే ఈ రూల్‌పై మొదట్నుంచే భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
ఇక ప్రస్తుత సీజన్లో రోహిత్ అదరగొడుతున్నాడు. ఇప్పటివరకు ఆడిన 6 మ్యాచ్‌ల్లో 167.31 స్ట్రైక్ రేట్‌తో 261 పరుగులు చేశాడు. అందులో ఓ సెంచరీ ఉంది. రీసెంట్గా చెన్నైతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శతకం బాదాడు. కాగా, ఇది రోహిత్‌కు ఐపీఎల్లో రెండో సెంచరీ.