Rohit Breaks Sachin Record : బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో విజయంతో టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరో అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన నాలుగో ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. ఈ క్రమంలో భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్‌ను అధిగమించాడు.
రెండో భారత క్రికెటర్‌గా రోహిత్
అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా ఆస్ట్రేలియా దిగ్గజం రికీ పాంటింగ్ ఉన్నాడు. పాంటింగ్ 377 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విజయం సాధించాడు. శ్రీలంక దిగ్గజ బ్యాటర్ మహేల జయవర్ధనే 336 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో విజయాన్ని రుచి చూశాడు. కోహ్లీ 322, రోహిత్ 308 అంతర్జాతీయ మ్యాచ్‌లు గెలిచారు. సచిన్ తన కెరీర్‌లో ఆటగాడిగా 307 అంతర్జాతీయ మ్యాచ్‌లు గెలుపొందాడు. టీమ్ఇండియా తరఫున అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన ఆటగాడిగా రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు.
జట్టు అత్యధిక విజయాల్లో భాగమైన ప్లేయర్స్
- రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) : 377
- మహేల జయవర్ధనే (శ్రీలంక) : 336
- విరాట్ కోహ్లీ (భారత్) : 322
- రోహిత్ శర్మ (భారత్) : 308
- సచిన్ తెందూల్కర్ (భారత్) : 307
టీమ్ఇండియా ఘనవిజయం
చెన్నై వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా 280 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు అశ్విన్, జడేజా, శుభ్ మన్ గిల్, రిషభ్ పంత్ అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్‌లో అశ్విన్ సెంచరీతో అదరగొట్టాడు. రెండో ఇన్నింగ్స్ లో 6వికెట్లు తీశాడు. యంగ్ బ్యాటర్లు రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్ సెంచరీలు బాదారు. ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో అశ్విన్ ఆరు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో రాణించిన అశ్విన్‌కే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. కాగా, తొలి టెస్టు విజయంతో టీమ్ఇండియా 1- 0 ముందంజలో ఉంది. రెండో టెస్టు సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్ వేదికగా జరగనుంది.