Indias Richest Cricketer: క్రికెట్‌లో డొమెస్టిక్ లీగ్‌ల ప్రవేశంతో ప్లేయర్లపై కాసుల వర్షం కురుస్తోంది. క్రికెటర్ల ఫ్యాన్ ఫాలోయింగ్ ఎంత వేగంగా పెరుగుతుందో, వారి బ్రాండ్ విలువ, సంపాదన కూడా అంతే వేగంగా పెరుగుతోంది. ఇంతకు ముందు క్రికెట్ ప్లేయర్ల సంపాదన అంతగా లేకున్నా, ఇప్పుడు దాదాపుగా క్రికెటర్లందరూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నా క్రికెటర్ల సంపాదన మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా విదేశీ క్రికెటర్ల కంటే భారత క్రికెటర్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. సచిన్ తెందూల్కర్ నుంచి విరాట్ కోహ్లీ వరకు ఎందరో క్రికెటర్లు వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారు. ఇంతకీ భారతదేశంలో అత్యంత ధనిక క్రికెటర్ ఎవరో తెలుసా?
ధనిక క్రికెటర్ ఎవరంటే
బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా అవతరించింది. భారత క్రికెటర్లకు ప్రతి మ్యాచ్‌కు బీసీసీఐ భారీ మొత్తంలో చెల్లిస్తోంది. అయితే భారత క్రికెట్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్ ఎవరు అనే ప్రశ్న అడిగితే సచిన్ సచిన్ తెందూల్కర్, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పేర్లే గుర్తుకు వస్తాయి. అయితే భారత్‌లోని అత్యంత ధనిక క్రికెటర్‌లు వీరిలో ఎవరూ కాదు. నిజానికి భారత క్రికెటర్లలో అత్యంత సంపన్నుడు ఆర్యమాన్ బిర్లా. భారత్‌లోనే కాకుండా ప్రపంచంలోనే ఆర్యమాన్ అత్యంత ధనిక క్రికెటర్‌గా ఉన్నాడు. ఆర్యమాన్ ఆస్తుల విలువ దాదాపు రూ.70 వేల కోట్లు.
భారత ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడే ఆర్యమాన్ బిర్లా. దేశంలో అత్యంత సంపన్న వ్యాపారవేత్తలలో కుమార్ మంగళం బిర్లా ఒకరు. తన కొడుకు ఆర్యమన్‌కు ఇంత పెద్ద వ్యాపార కుటుంబంలో పుట్టినా చిన్నప్పటి నుంచి క్రికెట్‌పై మక్కువ ఎక్కువ. కష్టపడి దేశవాళీ క్రికెట్‌లో గొప్ప విజయాన్ని సాధించాడు. మధ్యప్రదేశ్ తరఫున దేశవాళీ క్రికెట్ ఆడిన ఆర్యమాన్ బిర్లా 2019 తర్వాత క్రికెట్‌కు అకస్మాత్తుగా విరామం తీసుకున్నాడు. ఆర్యమాన్ తిరిగి మైదానంలోకి రాలేదు.
కెరీర్ ఇది
ఆర్యమాన్ బిర్లా 25 నవంబర్ 2017న రంజీ ట్రోఫీలో ఫస్ట్- క్లాస్ క్రికెట్ అరంగేట్రం చేశాడు. మధ్యప్రదేశ్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. నవంబర్ 2018లో, అతను ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో తన మొదటి సెంచరీని సాధించాడు. ఐపీఎల్ 2018కి ముందు జరిగిన వేలంలో రాజస్థాన్ రాయల్స్ ఆర్యమన్‌ను తమ జట్టులోకి తీసుకుంది. అయితే అతనికి ఐపీఎల్‌లో ఆడే అవకాశం రాలేదు. 2019లో మానసిక ఆరోగ్య సమస్యల కారణంగా క్రికెట్‌కు విరామం తీసుకున్నాడు. దీని తరువాత, రాజస్థాన్ రాయల్స్ అతన్ని 2020 IPL వేలానికి ముందు విడుదల చేసింది.