RCB vs RR Match Tickets IPL 2024: దేశమంతా ఐపీఎల్ సందడి కొనసాగుతోంది. ఒక్కో మ్యాచ్‌లో ఒక్కొక్కరు అదరగొడుతుండం వల్ల క్రికెట్ ప్రేమికులు ఊగిపోతున్నారు. ఒక పక్క పరుగులు వరద, మరోపక్క వికెట్ల వేటతో ఆటగాళ్లు అభిమానులకు ఫుల్ కిక్కిస్తున్నారు. ఈ క్రమంలో టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ చిత్రం ఐపీఎల్ క్రేజ్‌కు అద్దం పడుతోంది.
శనివారం జరగనున్న రాజస్థాన్ రాయల్స్- రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్‌కు భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఈ మ్యాచ్‌ను స్టేడియంలో లైవ్‌లో చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలో టిక్కెట్ల కోసం అభిమానులు కౌంటర్ ముందు బారులు తీరడం కాదు ఏకంగా దిండు, దుప్పటి వేసుకు పడుకున్నారు. ప్రస్తుత సీజన్లో ఓటమి లేకుండా దూసుకుపోతున్న రాజస్థాన్ ఆటను సొంత మైదానంలో చూడాలని లోకల్ ఫ్యాన్స్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెరుపులు కళ్లారా వీక్షించాలని ఆర్సీబీ అభిమాననులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.
దీంతో ఈ మ్యాచ్‌కు సూపర్ హైప్ క్రియేట్ అయ్యింది. ఎలాగైనా రాజస్థాన్- ఆర్సీబీ మ్యాచ్ స్టేడియంలో చూడాల్సిందేనని ఇరుజట్ల ఫ్యాన్స్ ఫిక్సైన నేపథ్యంలో టిక్కెట్లు దక్కించుకోవడం కష్టంగా మారింది. ఎలాగైన టిక్కెట్ దక్కించుకోవాలని చాలామంది గురువారం రాత్రికే సవాయ్ మాన్‌సింగ్ స్టేడియానికి చేరుకున్నారు. చాప, దిండు, దుప్పటి పట్టుకొచ్చి మరీ రాత్రి స్టేడియం టిక్కెట్ కౌంటర్ల వద్దే నిద్రించారు. ఉదయం క్యూ లైన్ పెరిగిపోతుందని రాత్రే వచ్చి ప్లేస్ సెట్ చేసుకున్నారు. టిక్కెట్ల కోసం పోటీ పడడం వల్ల ఈ పరిస్థితి ఎదురవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సీజన్లో రాజస్థాన్ హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్‌లో ఉండగా, మళ్లీ గెలుపు బాట పట్టాలని ఆర్సీబీ భావిస్తోంది.
IPL Tickets Scam: ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్‌ను కొందరు కేటుగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. టిక్కెట్ల పేరుతో బ్లాక్ దందా చేస్తున్నారు. రీసెంట్గా బెంగళూరుకు చెందిన మహిళా ఐపీఎల్ టిక్కెట్ కొనుగోలు చేస్తూ ఆన్‌లైన్ స్కామ్‌లో రూ.86వేలు కోల్పోయింది. దీనిపై పోలీసులు విచరణ చేపట్టారు.