Ravichandran Ashwin On Bumrah: టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాపై తన సహచర ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసల వర్షం కురింపించాడు. టీమ్ఇండియాకు బుమ్రా అత్యంత విలువైన ఆటగాడిగా తాను భావిస్తాననని అన్నాడు. ఇటీవల ఓ ఈవెంట్ కోసం చెన్నై వచ్చిన బుమ్రాకు ఘన స్వాగతం లభించిందని అశ్విన్ తెలిపాడు. తాజాగా విమల్ కుమార్ యూట్యూబ్ ఛానెల్లో మాడట్లాడిన అశ్విన్ ఈ కామెంట్స్ చేశాడు.
'మా చెన్నై ప్రజలు బౌలర్లను చాలా ప్రోత్సహిస్తారు. బుమ్రా 4 - 5 రోజుల కిందట చెన్నైలోని ఓ ఈవెంట్లో చీఫ్ గెస్ట్‌గా వచ్చాడు. మేం అతడకి ఘనంగా స్వాగతం పలికాం. చెన్నై ప్రజలు బౌలర్లను ఎంతో గౌరవిస్తారు. అతడిని ఛాంపియన్‌గా పరిగణించాలి. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్లో జస్ప్రీత్ బుమ్రా అత్యంత విలువైన ఆటగాడు' అని అశ్విన్ అన్నాడు.
ఈ తరానికి బుమ్రానే
అయితే భారత క్రికెట్లో ఎప్పట్నుంచో బ్యాటర్లదే ఆధిపత్యం కొనసాగుతుందని అశ్విన్ ఈ సందర్భంగా అన్నాడు. 'భారత్‌లో ఎప్పట్నుంచో బ్యాటర్ల ఆధిపత్యమే కొనసాగుతోంది. అది ఎప్పటికీ మారదు. కానీ, బుమ్రా పట్ల నేను ఎంతో సంతోషంగా ఉన్నా. అలాంటి బౌలర్ తరానికి ఒక్కడే ఉంటాడు. అతడి విజయాలను మనం మరింత సెలబ్రేట్ చేసుకోవాలి' అని అశ్విన్ అన్నాడు.
అయితే 2016లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేసిన బుమ్రా అప్పట్నుంచి టీమ్ఇండియాకు కీలకంగా మారాడు. మూడు ఫార్మాట్లలోనూ టీమ్ఇండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 195 మ్యాచ్‌ల్లో 397 వికెట్లు పడగొట్టాడు. ఇక రీసెంట్గా ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లోనూ బుమ్రా అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. సెప్టెంబర్ 19న బంగ్లాతో ప్రారంభం కానున్న టెస్టు సిరీస్‌లో బుమ్రా బరిలోకి దిగనున్నాడు.
రిటైర్మెంట్ ఎప్పుడు
ఇదే ఇంటర్వ్యూలో తన రిటైర్మెంట్ గురించి అశ్విన్ ప్రశ్న ఎదురైంది. అయితే ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించే ఆలోచన లేదని అశ్విన్ చెప్పాడు. 'వ్యక్తిగతంగా ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎప్పటి వరకు ఆడాలి? దాని గురించే ఆలోచించలేదు. ఆ రోజు వచ్చినప్పుడు తప్పకుండా అందరికీ చెబుతా. వయసు పెరిగే కొద్దీ మన శ్రమ కూడా ఎక్కువుతుంది. ఇక నేను ఆటను ఆస్వాదించలేకపోతున్నానని అనిపించిన వెంటనే క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేస్తా' అని తెలిపాడు.
'రోహిత్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు- అతడికి ఆప్షన్స్ అవసరం లేదు' - Ashwin Rohit Sharma