R Ashwin Talks On His Retirement : ఆసీస్‌తో మూడో టెస్టు ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పి, రవిచంద్రన్ అశ్విన్ క్రికెట్ విశ్లేషకులతో పాటు ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు. దీంతో అశ్విన్ రిటైర్మెంట్ నిర్ణయాన్ని హఠాత్తుగా ఎందుకు తీసుకున్నాడా అని ఫ్యాన్స్, మాజీ క్రికెటర్లు తర్జనభర్జనలు పడ్డారు. అయితే ఇప్పుడు స్వయంగా అశ్వినే తన రిటైర్మెంట్ పై స్పందించాడు.
'లైఫ్‌లో ఎప్పుడూ అభద్రతా భావానికి గురికాలేదు '
తాను ఏ విషయాలను ఎక్కువగా పట్టుకొని సాగతీయనని ఓ స్పోర్ట్స్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అశ్విన్ తెలిపాడు. జీవితంలో ఎన్నడూ అభద్రతా భావానికి గురికాలేదని పేర్కొన్నాడు. "ఈ రోజు నాదైంది. రేపు కూడా నాదేనని నమ్మను. ఈ ఆలోచనా తీరే ఇన్నాళ్లూ నా ఎదుగుదలకు కారణం. నేను నిర్మొహమాటంగా చాలా విషయాలను వదిలేయగలను. జనాలు నా గురించి సంబరాలు చేసుకుంటారని ఎప్పుడూ నమ్మను. ఇక దేశంలో కొన్నిసార్లు నాపై లభించే అటెన్షన్‌ను కూడా పెద్దగా విశ్వసించను. ఎప్పుడైనా సరే నా కన్నా ఆటే చాలా ముఖ్యమైంది." అని ఇంటర్వ్యూలో అశ్విన్ చెప్పుకొచ్చాడు.
'నా సర్వస్వం ఆటకే ఇచ్చాను'
"నేను చాలా సార్లు రిటైర్మెంట్ గురించి ఆలోచించా. ఏ రోజైనా నిద్ర లేవగానే నాలోని సృజనాత్మకతకు భవిష్యత్తు లేదనుకుంటే అదేరోజు నేను ఆటను వదిలేస్తాను. హఠాత్తుగా ఎందుకో నాకు అలాగే అనిపించింది. అందుకే రిటైర్మెంట్ ప్రకటించేశాను. నా సర్వస్వం ఆటకే ఇచ్చాను. కొన్నేళ్లుగా నేను విభిన్నమైన స్కిల్స్, టాలెంట్‌తో చాలా క్రికెట్‌ను ఆడాను. దాని గురించి ఇతరులకు చెప్పగలగడం చాలా ప్రత్యేకమైంది. మనల్ని మనం అన్వేషించుకుంటేనే అది సాధ్యం. నేను విజయవంతగా దానిని చేశాను. అది ఆట గురించి మాట్లాడేంత విస్త్రృతమైన పరిజ్ఞానాన్ని నాకు ఇచ్చింది. దాని గురించి జీవితకాలంలో అన్వేషించగలను, ముక్కుసూటిగా మట్లాడగలను."
-- అశ్విన్, మాజీ క్రికెటర్
'ఎటువంటి పశ్చాత్తాపం లేదు'
తాను ఆటను వీడటంలో పశ్చాత్తాపం లేదని అశ్విన్ పేర్కొన్నాడు. ఎందుకంటే రిటైర్మెంట్ అనేది తన నిర్ణయమని తెలిపాడు. క్రికెట్ తనకు చాలా ఇచ్చినందుకు సంతోషంగా ఉందని వెల్లడించాడు.
ధోనీపై కీలక వ్యాఖ్యలు (R Ashwin About Dhoni)
టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇతర కెప్టెన్ల కన్నా ధోనీ పూర్తిగా విభిన్నమైన వ్యక్తి అని కొనియాడాడు. కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ ప్రత్యేకత ఏమిటి? అని అశ్విన్ అడగ్గా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు.
'ఇతరుల కన్నా ధోనీ చాలా డిఫరెంట్'
"మీ ప్రశ్నకు సమాధానం చాలా తేలిక. అతడు (ధోనీ) ప్రాథమిక విషయాలను చాలా బాగా చేస్తాడు. కానీ, చాలామంది కెప్టెన్లు వాటిని విస్మరిస్తారు. దీంతో మ్యాచ్ వారికి సంక్లిష్టంగా మారిపోతుంది. బౌలర్ చేతికి బంతి ఇస్తూ ధోనీ ఒక్కటే మాట చెబుతాడు. అవసరమైనట్లు ఫీల్డింగ్ పెట్టుకో. ఫీల్డింగ్ తగినట్లు బాల్స్ వేయమని చెబుతాడు. కొన్నిసార్లు బ్యాటర్లు మా లూజ్ డెలివరీలను బాదినా, అతడు మమ్మల్ని బౌలింగ్ నుంచి తప్పించడు. " అని అశ్విన్ చెప్పుకొచ్చాడు.
ధోనీ నాపై కోప్పడతాడు!
తన బౌలింగ్‌లో కొత్త బ్యాటర్ కట్ లేదా డ్రైవ్ కొడితే మాత్రం ధోనీ కోప్పడతాడని అశ్విన్ తెలిపాడు. అలా జరిగితే ఏమవుతుందో తెలియజేస్తూ, తనను బౌలింగ్ నుంచి తప్పిస్తాడని పేర్కొన్నాడు. అది క్రికెట్‌లో చాలా ప్రాథమిక విషయమని, చాలా ఏళ్లుగా పలువురు ఈ ప్రాథమిక అంశాన్ని కూడా మిస్ అవుతున్నారని వెల్లడించాడు. ఆటలో కొన్ని మార్చలేని అంశాలుంటాయని, ధోనీ వాటి విషయంలో పెద్దగా మార్పులు చేయడని కొనియాడాడు. గతేడాది ఐపీఎల్‌లో తుషార్ దేశ్‌పాండేను ముందుకు తీసుకొచ్చి అతడి నుంచి అత్యుత్తమ ఆటతీరును ధోనీ రాబట్టాడని తెలిపాడు.
కెప్టెన్‌గా ధోనీ టీమ్ ఇండియాకు 60 టెస్టుల్లో నాయకత్వం వహించాడు. వాటిల్లో 27లో భారత్ విజయం సాధించగా, 18 ఓడిపోయింది. అయితే వన్డే, టీ20 ప్రపంచకప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ధోనీ సారధ్యంలో టీమ్ ఇండియా గెలుపొందింది.
బాక్సింగ్ డే టెస్టు - బుమ్రా, స్మిత్‌ను ఊరిస్తోన్న అరుదైన రికార్డులు