Preity Zinta Sanjay Bangar: లఖ్‌నవూ సుపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో రీసెంట్గా ఆ జట్టు ఓనర్ సంజీవ్ గొయెంకా మాట్లాడిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణ ఏంటో తెలీదు కానీ, గొయెంకా తీరు పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సంజీవ్ గొయెంకా తమ జట్టు కెప్టెన్‌కు ఎప్పుడు మర్యాద ఇవ్వరు, గతంలో ధోనీతో కూడా దురుసుగా ప్రవర్తించారని నెటిజన్లు గుర్తుచేశారు. అయితే ఇలాంటి ఘటనే 2016లో కూడా జరిగిందని మీకు తెలుసా? 2016 ఐపీఎల్‌లో కింగ్స్ XI పంజాబ్ (ప్రస్తుతం పంజాబ్ కింగ్స్) కో-ఓనర్ ప్రీతి జింటా అప్పటి కోచ్ సంజయ్ బంగర్‌పై నోరు పారేసుకుంది.
పంజాబ్ హెడ్ కోచ్‌పై ప్రీతి ఆగ్రహం
2016 ఐపీఎల్‌లో మొహాలీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ ఒక పరుగు తేడాతో ఓడిపోయింది. దీనిపై కోపంగా ఉన్న ప్రీతి, సపోర్టింగ్ స్టాఫ్, ప్లేయర్స్ మధ్యనే బంగర్‌ను హెడ్ కోచ్ పోస్ట్ నుంచి తొలగిస్తామని బెదిరించిందట. ఆ సమయంలో పదే పదే ఎఫ్- వర్డ్‌ను ఉపయోగించినట్లు సమాచారం. అయితే బ్యాటింగ్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్ కంటే ముందు ఫర్హాన్ బెహార్డియన్ రావాలనే నిర్ణయం ఆమెకు నచ్చలేదు. అందువల్లే పంజాబ్ ఓడిందని భావించిన ఆమె బంగర్‌పై దురుసుగా ప్రవర్తించింది.
ఇక బంగర్ 2016 వరకు ఫ్రాంచైజీతో కలిసి పని చేశాడు. ఆ తర్వాత టీమ్ఇండియాకు కోచ్‌గా ఎంపిక అవ్వడం వల్ల పంజాబ్‌ను వీడాడు. ఈ ఘటనపై అప్పట్లో టీమ్ సభ్యుడు ఒకరు మాట్లాడారు. 'సంజయ్‌ను హెడ్ కోచ్‌గా తొలగిస్తానని, ప్రీతి పదే పదే బెదిరించడం వల్ల అందరూ ఆశ్చర్యపోయారు. ఎవరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సంజయ్ చాలా ఇబ్బంది కరంగా కనిపించాడు. అతడు ముందుకు నడిపించాల్సిన యంగ్ ప్లేయర్లంతా చుట్టూ ఉన్నారు. ఇలా ప్రవర్తించడం టీమ్ ఓనర్లకు తగదు' అని తన అభిప్రాయాన్ని చెప్పారు.
ఒక్క పరుగుతో ఓటమి: మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ బౌలింగ్ సెలక్ట్ చేసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 175 పరుగులు చేసింది. ఛేజింగ్‌కి దిగిన పంజాబ్‌కి హషీమ్ ఆమ్లా (21), వృద్ధిమాన్ సాహా (16) శుభారంభం ఇచ్చారు. మురళీ విజయ్ 57 బంతుల్లో 89 పరుగులు చేయడం వల్ల పంజాబ్ గెలిచేలా కనిపించింది. చివరి మూడు ఓవర్లలో 37 పరుగులు చేయాల్సి ఉండగా, క్రీజులో మార్కస్ స్టోయినిస్, ఫర్హాన్ బెహార్డియన్ ఉన్నారు. బెహార్డియన్ 7 బంతుల్లో 9* పరుగులే చేశాడు. ఇది ప్రీతి జింటాకు కోపం తెప్పించింది. అతడి కంటే ముందు అక్షర్ పటేల్‌ని బ్యాటింగ్‌కి పంపాల్సిందని భావించింది. స్టోయినిస్ 22 బంతుల్లో 34 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. పంజాబ్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది.
'కథ నచ్చితే సినిమాలు చేస్తా' - టాలీవుడ్ రీఎంట్రీపై ప్రీతి జింటా - Preity Zinta Tollywood Re Entry