Paris Olympics Indian Athletes Food Menu : మనం వేరే ప్రాంతానికి వెళ్లినప్పుడు, అక్కడ మనం తినే ఆహారం దొరుకుతుందా లేదా అనేది మనం ముందుగా ఆలోచించే విషయాలలో ఒకటి. అయితే మన భారత ఒలింపియన్ల పరిస్థితి ఏంటి? విశ్వ క్రీడల్లో భారత అథ్లెట్ల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు అనేది చూద్దాం.
ప్రస్తుతం జరుగుతున్న ఒలింపిక్స్ కోసం పారిస్‌లోనే ప్రపంచంలోనే అతిపెద్ద రెస్టారెంట్‌ని ఆరంభించారు. ఒలింపిక్ విలేజ్‌లో ఈ రెస్టారెంట్‌ను 46,000 చదరపు అడుగుల్లో నిర్మించారు. ఇందులోని డైనింగ్ కాంప్లెక్స్‌లో 3,500 మంది ఒకేసారి కూర్చుని భోజనం చేయవచ్చు. ఒలింపిక్ విలేజ్‌తో పాటు ఫ్రాన్స్‌లోని 14 క్రీడా వేదికల్లో రోజూ 40 వేల మందికిపైగా భోజనాన్ని అందిస్తున్నారు.
అయితే అథ్లెట్లకు భోజనం సిద్ధం చేయడానికి 200 మంది కుక్‌లు పనిచేస్తున్నారు. ప్రధాన చెఫ్‌లుగా చార్లెస్ గిల్లోయ్, స్టెఫాన్ చిచెరీ ఉన్నారు. 206 దేశాలకు చెందిన 10 వేలమందికిపైగా అథ్లెట్లకు ఆహారం పౌష్టికాహారం అందిస్తున్నారు.
ఫ్రొఫెషనల్ చెఫ్‌లు
మెనూ ఆధారంగా ఒలింపిక్స్‌లో అథ్లెట్లకు ఈజీగా జీర్ణమయ్యే ఆహారాన్ని అందిస్తున్నారు. అథ్లెట్లకు ఆహారాన్ని అందిస్తున్న చెఫ్ అలెగ్జాండర్ మజ్జియా, ప్రొఫెషనల్ చెఫ్‌గా మారడానికి ముందు ఓ బాస్కెట్‌బాల్ ప్లేయర్. అలాగే చెఫ్ చిచేరి ప్రతిరోజూ బాగెట్‌లను తాజాగా తయారు చేసి అథ్లెట్లకు అందుబాటులో ఉంచుతున్నారు. చెఫ్ బౌలంగేరీ అథ్లెట్‌లకు ఆరోగ్యకరమైన స్నాక్స్ అందిస్తున్నారు.
ఆసియా వంటకాలు
ఒలింపిక్ గ్రామంలో 500 కంటే ఎక్కువ ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. ప్రత్యేక ఆహారాలు, ఆహారపు అలవాట్లు, మత విశ్వాసాలకు అనుగుణంగా ఈ మెనూను రూపొందించారు. హలాల్, శాఖాహార వంటకాలు అందులో ఉన్నాయి. కార్బన్‌ను తగ్గించేందుకు దాదాపు 60% శాకాహార ఆహారం అందిస్తున్నారు. ఆసియా వంటకాల్లో బాస్మతి బియ్యంతో అన్నం, ఆలూ గోబీ, కాల్చిన కాలీఫ్లవర్, బంగాళదుంపలు అందుబాటులో ఉన్నాయి.
ఆఫ్రికన్, కరేబియన్ స్పెషాలిటీలుగా షాక్షౌకా, సాటెడ్ చెర్మౌలా రొయ్యలు లభిస్తాయి. పుదీనా-ఇన్ఫ్యూజ్డ్ సాస్, వెజిటబుల్ మౌసాకాను కూటా అథ్లెట్లకు ఇస్తున్నారు. తందూరీ చికెన్, పుదీనా చట్నీ, పప్పు, వెజిటబుల్ బిర్యానీ, లాంబ్ కోర్మా, గుడ్లు, చిలగడదుంప, చికెన్ కర్రీలు కూడా ఉంటాయి.
ఇతర దేశాల అథ్లెట్లకు
ఒలింపిక్ విలేజ్‌లో రెండు ఫ్రెంచ్, రెండు ఆసియన్, ఒక ఆఫ్రో-కరేబియన్ కిచెన్‌లు ఉన్నాయి. సలాడ్ బార్, గ్రిల్ స్టేషన్, హాట్ బఫే, పాస్తా, సూప్, డెయిరీ స్టేషన్లు, చీజ్ అండ్ ఫ్రూట్స్, బేకరీ స్టాండ్‌లు, డెజర్ట్ బార్‌లు లాంటివి ఏర్పాటు చేసి అథ్లెట్లకు ఆహారాన్ని అందిస్తున్నారు.
ఒలింపిక్ విలేజ్ ఎంట్రెన్స్ దగ్గర ఫ్రెంచ్ బ్రెడ్‌ను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. అయితే దిగుమతి పరిమితులు, వ్యవసాయ పరిమితుల వల్ల కొన్ని దేశాల వారికి ఆహారంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో అమెరికన్ ప్రతినిధి బృందం కొంత ఆహారాన్ని ప్యారిస్‌కు స్వయంగా రవాణా చేసుకోగా, గ్రేట్ బ్రిటన్ మాత్రం తమ సొంత క్యాటరర్‌లను తీసుకొచ్చింది.
భారత్ ఖాతాలో తొలి పతకం- చరిత్ర సృష్టించిన మనూ బాకర్ - Paris Olympics 2024