Paris Olympics 2024 Indian Hockey Team Bronze Medal : పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత హాకీ జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. గురువారం జరిగిన కాంస్య పతక పోరులో 2-1తో స్పెయిన్‌పై విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్ (30వ నిమిషం, 33వ నిమిషం) రెండు గోల్స్ చేసి భారత్ విజయంలో కీలకంగా వ్యవహరించాడు. దీంతో ఈ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య నాలుగుకు చేరింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత భారత హాకీ జట్టు గెలుపు సంబరాలను చేసుకుంది. అలానే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ముర్ము సహా పలువురు రాజకీయ నేతలు హాకీ జట్టుపై ప్రశంసల వర్షం కురిపించారు. వారికి సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలిపారు. ఎవరెవరు ఏమన్నారో చూద్దాం.
Indian Hockey Team Modi : "తరాలపాటు నిలిచిపోయే ప్రతిష్ఠాత్మక విజయం ఇది. వరుసగా రెండో ఒలింపిక్స్ పతకం సాధించడం మరింత ప్రత్యేకం. నైపుణ్యం, పట్టుదల, బృంద స్ఫూర్తి భారత విజయానికి కారణం. ప్రతి భారతీయుడు హాకీతో భావోద్వేగ అనుబంధం కలిగి ఉంటాడు. ఈ గెలుపు మన యువతలో హాకీని మరింత ప్రాచుర్యం పొందేలా చేస్తుంది" అని మోదీ అన్నారు.
"ఐదు దశాబ్దాల తర్వాత భారత హాకీ జట్టు ఒలింపిక్స్‌లో వరుసగా పతకాలు సాధించింది. భారత హాకీ పునరుజ్జీవానికి ఈ టీమ్ చేసిన కృషి ప్రశంసనీయం. నిలకడ, నైపుణ్యం, సమన్వయం, పోరాటం ద్వారా క్రీడాకారులు చూపిన ప్రదర్శన యువతకు స్ఫూర్తిదాయకం." అని భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.
"విశేషమైన టీమ్ వర్క్, అద్భుతమైన నైపుణ్యాలు, గొప్ప విజయాన్ని కట్టబెట్టాయి" అని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
"జట్టు ప్రదర్శన, క్రీడాస్ఫూర్తి క్రీడల పట్ల కొత్త అభిరుచిని రేకెత్తిస్తున్నాయి. మీ విజయం గర్వకారణం" అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.
"అంకితభావం, అచంచలమైన కృషితో భారత జట్టు సాధించిన అసాధారణ విజయం పట్ల దేశం గర్విస్తోంది." అని పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ అన్నారు.
భారత్ ఖాతాలో మరో పతకం - కాంస్య పతకం గెలుచుకున్న హాకీ జట్టు - Paris Olympics 2024 India Hockey