Paris Olympics 2024 Sarabjot : పారిస్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ మిక్స్డ్ ఈవెంట్లో సరబ్ జోత్, మను బాకర్‌తో కలిసి కాంస్య పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. సౌత్ కొరియాకు చెందిన లీ వొన్‌హో, ఓ హైజిన్ జోడీని 16-10 పాయింట్ల తేడాతో ఓడించి ఈ మెడల్‌ను ముద్దాడారు. ఈ విజయంతో భారత్‌కు కాంస్య పతకం దక్కింది. దీంతో వీరిద్దరిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.
అయితే కాంస్య పతకం సాధించిన సరబ్ జోత్ సింగ్ అనంతరం ఇండియా హౌస్‌కు వెళ్లాడు. అక్కడ ఆయనకు నీతా అంబానీ, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఏమి కావాలని సరబ్‌ను అడిగారు. దీనికి అతడు 'దయచేసి నాకు తినడానికి ఏదైనా ఇవ్వండి' అంటూ చమత్కరించాడు. అనంతరం వారు అందించిన తినుబండారాలను సరబ్ జోత్ సింగ్ ఆరగించాడు. పానీ పూరీ, భేల్ పూరీ, దోసెలు సహా ప్రసిద్ధ భారతీయ వంటకాల రుచి చూశాడు సరబ్.
సరబ్‌కు ఎయిర్ పోర్టులో ఘనస్వాగతం - మరోవైపు, పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం ముద్దాడి స్వదేశానికి చేరుకున్న సరబ్ జోత్ సింగ్‌కు దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. అభిమానులు సరబ్, సరబ్ అంటూ కేరింతలు కొడుతూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.
అసలేంటీ ఇండియా హౌస్? - ఒలింపిక్స్ జరుగుతున్న పారిస్‌లోని ప్రఖ్యాత పార్క్ డి లా విల్లెట్‌లో ఇండియా హౌస్‌ను ఏర్పాటు చేశారు. ఒలింపిక్స్ హిస్టరీలో తొలిసారి భారత్ ఈ కంట్రీ హౌస్‌ను ఏర్పాటు చేసింది. ఇండియా హౌస్ భారత అథ్లెట్లకు ఇల్లులా ఉంటుంది. భారతదేశం విజయాలు, పతకాలను గుర్తు చేస్తుంది. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) భాగస్వామ్యంతో రిలయన్స్ ఫౌండేషన్ దీన్ని రూపొందించింది. సందర్శకులు ఇందులో యోగా తరగతులు, సాంస్కృతిక సెమినార్లలో పాల్గొనవచ్చు. సాంప్రదాయ భారతీయ హ్యాండ్ క్రాఫ్ట్స్‌ను నేర్చుకోవచ్చు. ఇంకా చాలా రకాల ఈవెంట్లు, కార్యక్రమాలను చూడవచ్చు. ముఖ్యంగా ఈ ఇండియా హౌస్‌లో భారతీయ వంటకాలు దొరుకుతాయి. బిర్యానీ, పెరుగన్నం, మటన్ వంటి రుచులు లభిస్తాయి.
భారత్ ఖాతాలో మూడో పతకం- కాంస్యం ముద్దాడిన స్వప్నిల్ - Paris Olympics 2024