Argentina Vs Morocco Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్ ఆరంభంలోనే గందరగోళంగా మారింది. అర్జెంటీనా-మొరాకో మధ్య తాజాగా జరిగిన మ్యాచ్ రణరంగాన్ని తలపించింది. అర్జెంటీనాకు వ్యతిరేకంగా మొరాకో అభిమానులు మైదానంలోకి దూసుకురావడంతో అసలు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి తలెత్తింది. ఈ ఘటనలతో పారిస్ ఒలింపిక్ ఫుట్‌బాల్ మ్యాచులు హింసాత్మక ఘటనలతో ప్రారంభమయ్యాయి. ఈ గందరగోళాల మధ్య రెండుసార్లు గోల్డ్ మెడల్ విజేత అర్జెంటీనాకు షాక్ ఇస్తూ మొరాకో 2-1తో విజయ కేతనం ఎగరేసింది. అయితే ఈ మ్యాచ్‌లో నాటకీయ పరిణామాలు సంభవించాయి. అర్జెంటీనాకు వ్యతిరేకంగా మొరాకో ఫ్యాన్స్ స్టేడియంలోకి రావడంతో మ్యాచ్‌ను రెండు గంటలపాటు సస్పెండ్ చేశారు. అనంతరం అభిమానులను స్టేడియం నుంచి బయటకు పంపి మ్యాచ్‌ను నిర్వహించారు.
మొరాకో అభిమానుల దూకుడు
కీలకమైన మ్యాచ్‌లో తమకు విజయం దక్కకుండా పోతుందనే భయంతో మొరాకో అభిమానులు తీవ్రంగా ప్రతిస్పందించారు. మైదానంలోకి నీళ్ల సీసాలు విసిరారు. ఈ పరిస్థితులపై అర్జెంటీనా కోచ్ జేవియర్ మస్చెరానో ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏం జరిగిందో తాను వివరించలేనని, ఏం జరగబోతోందన్న సమాచారం లేకుండానే తాము గంటన్నర పాటు డ్రెస్సింగ్ రూమ్‌లో గడిపామని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆటను నిలిపివేయడం తమ లయను దెబ్బ తీసిందని అన్నాడు. ఇది తన జీవితంలో నేను చూసిన అతిపెద్ద సర్కస్ అని ఎద్దేవా చేశాడు. ఈ మ్యాచ్‌పై ఫిర్యాదు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని మస్చెరానో తెలిపాడు. అర్జెంటీనా శనివారం ఇరాక్‌తో తలపడనుంది.
నాటకీయ పరిణామాలు
ఈ మ్యాచ్‌లో ఆర్జెంటీనాపై మొరాకో ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శించింది. రహిమి రెండో గోల్స్‌తో మెరవడంతో మొరాకో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 68వ నిమిషంలో అర్జెంటీనాకు సిమోన్ తొలి గోల్‌ను అందించాడు. కానీ ఆ తర్వాత మరో గోల్ కొట్టడం అర్జెంటీనాకు చాలా కష్టమైంది. కానీ ఇంజురీ టైమ్ 16వ నిమిషంలో క్రిస్టియన్ మెదినా గోల్‌తో అర్జెంటీనా 2-2తో స్కోరు సమం చేసింది. కానీ ఆ గోల్ సరైంది కాదని నిరసన తెలుపుతూ మొరాకో అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. అర్జెంటీనా ఆటగాళ్లపై నీళ్ల సీసాలు, ఇతర వస్తువులను విసరడంతో అంతా గందరగోళంగా మారింది. దీంతో అధికారులు మ్యాచ్‌ను సస్పెండ్ చేశారు. అయితే ఫుల్‌టైమ్ విజిల్ ఊదారని అంతా భావించారు. అయితే పరిస్థితిని చక్కదిద్దాకే.. మ్యాచ్ ముగియలేదని, సస్పెండ్ చేశారని అందరికీ తెలిసింది. 75 నిమిషాల తర్వాత జట్లు మళ్లీ మైదానంలోకి వచ్చాయి. అప్పటికి ప్రేక్షకులందరినీ స్టేడియం నుంచి బయటికి పంపించారు. మ్యాచ్ తిరిగి ఆరంభమయ్యాక, అంతకుముందు అర్జెంటీనా చేసిన రెండో గోల్‌ను ఆఫ్‌సైడ్‌గా ప్రకటించారు. మరో మూడు నిమిషాల్లో మ్యాచ్ ముగిసింది. మొరాకో సంబరాల్లో మునిగిపోయింది.
పారిస్ అతిథులకు స్పెషల్ ట్రీట్మెంట్ - 'ఇండియా హౌస్'లో ఏమున్నాయంటే? - Paris Olympic 2024