Nitish Kumar Reddy SRH : వరుసగా ఓటముల తర్వాత ఆఖరికి హైదరాబాద్ ఖాతాలో ఓ విజయం వచ్చింది. గురువారం ( మే 2న) జరిగిన మ్యాచ్‌లో టాప్ పొజిషన్లో ఉన్న రాజస్థాన్ జట్టును ఒక్క పరుగు తేడాతో ఓడించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా జరిగిన ఈ పోరులో కేవలం రెండు పరుగులు ఛేదించేందుకు ప్రయత్నించిన రాజస్థాన్ జట్టును ఓడించి సన్‌రైజర్స్ అనూహ్య విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. స్టార్ బౌలర్ భువనేశ్వర్ తన బౌలింగ్ స్కిల్స్‌తో జట్టును ఆదుకోగా, మన తెలుగబ్బాయి నితీశ్ కుమార్ (76*) కూడా అజేయ పరుగులు చేశాడు. ఇక మ్యాచ్ విన్ అయ్యాక జరిగిన ప్రెస్ మీట్లో పలు ఆసక్తికరమైన విషయాలను నితీశ్ పంచుకున్నాడు.
"చివరి ఓవర్‌ను ఎవరు వేస్తున్నారన్న విషయాన్ని నేను గమనించాను. ఎప్పుడైతే బంతి భువనేశ్వర్ దగ్గరికి వెళ్లిందో అప్పుడు నాకు కాస్త నమ్మకం వచ్చింది. ఎందుకంటే ఇటువంటి పరిస్థితుల్లోనే చాలాసార్లు అద్భుతంగా బౌలింగ్ వేసిన ఎక్స్పీరియన్స్ అతడికి ఉంది. చివరి బంతి వరకూ మ్యాచ్ వచ్చినప్పుడే మేం గెలుస్తామని అస్సలు అనుకోలేదు. ఓడిపోవడమో లేదా కనీసం టై చేసి సూపర్ ఓవర్‌కు వెళ్తామని నేను అనుకున్నాను. కానీ, భువీ తన మ్యాజిక్‌తో చివరి బంతికి వికెట్ పడగొట్టాడు. బ్యాటింగ్‌లో నా పాత్ర ఏంటనే దానిపై స్పష్టతతో ఉన్నా కూడా త్వరగా వికెట్లు పడినప్పుడు ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకోవాలని నేను భావించాను. గత రెండు మ్యాచుల్లో మేము తొందరగా వికెట్లను చేజార్చుకున్నాము. కానీ ఈ సారి మాత్రం కనీసం 14వ ఓవర్ వరకు మరో వికెట్ పడకుండా ఆడాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ తర్వాత క్లాసెన్, సమద్‌లు తమ భారీ హిట్టింగ్‌తో విరుచుకుపడతారని నాకు బాగా తెలుసు. ఇప్పుడు రాజస్థాన్‌ను ఓడించడం వల్ల మళ్లీ మాలో ఆత్మవిశ్వాసం పెరిగింది" అంటూ నితీశ్ తన మ్యాచ్ అనుభవాలను పంచుకున్నాడు.
ఇక ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ధాటిగా ఆడింది. అయితే మొదట 35కే 2 వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లోకి వెళ్లిన తన జట్టును ఆదుకుకున్నాడు నితీశ్. తొలి 10 బంతుల్లో 5 పరుగులే చేసిన అతడు ఆ తర్వాత చెలరేగి ఆడాడు. 42 బంతులు 3ఫోర్లు, 8 సిక్సులతో 76 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ, అన్‌మోల్ ప్రీతి సింగ్ అవుట్ అయిన తర్వాత నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన నితీశ్ రాజస్థాన్ రాయల్స్ స్పిన్నర్ చాహల్‌కు చుక్కలు చూపించాడు.
13వ ఓవర్లో స్టైట్ సిక్స్ బాది, వెనువెంటనే ఫోర్ బౌండరీకి తరలించాడు. అదే ఓవర్‌లో చివరి రెండు బాల్స్‌ను కూడా మరో సారి సిక్సు, ఆ తర్వాత ఫోర్‌గా మలిచి చాహల్‌ను బెంబేలెత్తించాడు. రివర్స్స్పీప్తో అతడు బాదిన ఫోర్ హైలైట్‌గా నిలిచింది. అనంతరం స్పిన్నర్ అశ్విన్ ఓవర్లోనూ వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అజేయంగా 76 పరుగులు చేసి తన టీ20 కెరీర్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేశాడు.
ఒక్క పరుగు తేడాతో సన్‌రైజర్స్ థ్రిల్లింగ్ విక్టరీ - IPL 2024