USA National Cricket League : ప్రముఖ యూఎస్ నేషనల్ క్రికెట్ లీగ్(ఎన్ సీఎల్)పై ఐసీసీ తాజాగా నిషేధం విధించింది. ప్లేయింగ్ ఎలెవెన్ నిబంధనలను పాటించకపోవడం అలాగే మ్యాచ్‌లో ఒకే జట్టు తరఫున 6-7 మంది విదేశీ ఆటగాళ్లు ఆడటం వంటివాటి వల్ల నేషనల్ క్రికెట్ లీగ్‌పై బ్యాన్ విధించామని ఐసీసీ ఓ లేఖలో పేర్కొంది.
నిబంధనలు ఉల్లంఘన- లీగ్ పై వేటు
కాగా, ఐసీసీ నిబంధనల ప్రకారం ఏ లీగ్ లోనైనా జట్టులో స్వదేశానికి చెందిన ప్లేయర్లు ఏడుగురు ఉండాలి. విదేశీయులు నలుగురు మాత్రమే జట్టులో ఉండాలి. కానీ యూఎస్ నేషనల్ క్రికెట్ లీగ్ లో అలా జరగలేదు. నిబంధనలు ఉల్లంఘించడం వల్ల యూఎస్ నేషనల్ క్రికెట్ లీగ్ పై ఐసీసీ నిషేధం విధించింది. ఐసీసీ ఛైర్మన్ గా భారత్ కు చెందిన జైషా ఇటీవల బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ చర్య చేపట్టడం గమనార్హం.
పిచ్‌లో కూడా క్వాలిటీ లేదు!
యూఎస్ నేషనల్ క్రికెట్ లీగ్ లో ప్లేయింగ్ ఎలెవన్ నిబంధనలు ఉల్లంఘనే కాకుండా, చెత్త పిచ్ ల్లో మ్యాచ్ లు నిర్వహిస్తున్నారని ఐసీసీ లేఖలో ప్రస్తావించింది. ఈ లీగ్ లో చాలా తక్కువ నాణ్యత కలిగిన డ్రాప్ ఇన్ పిచ్ లను ఉపయోగించారని తెలిపింది. అందుకే పాకిస్థాన్ వహాబ్ రియాజ్, టైమల్ మిల్స్ వంటి పేసర్లు బ్యాటర్లకు గాయాలు కాకుండా ఉండేందుకు స్పిన్ వేయాల్సి వచ్చిందని పేర్కొంది.
ఏడాది క్రితమే కఠిన నిబంధనలు
అయితే ఏడాది క్రితం ప్రపంచవ్యాప్తంగా టీ20, టీ10 లీగ్‌లను నిర్వహించడానికి ఐసీసీ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే వేటు తప్పదని హెచ్చరించింది. అయినప్పటికీ యూఎస్ నేషనల్ క్రికెట్ లీగ్‌లో ఐసీసీ నిబంధనల ఉల్లంఘన జరగడం వల్ల వేటు పడినట్లు తెలుస్తోంది.
బ్రాండ్ అంబాసిడర్లుగా స్టార్లు
కాగా నేషనల్ క్రికెట్ లీగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా దిగ్గజ క్రికెటర్లు వసీం అక్రమ్, వివియన్ రిచర్డ్స్, సచిన్ తెందూల్కర్, సునీల్ గావస్కర్ ఉన్నారు. నేషనల్ క్రికెట్ లీగ్‌కు మరింత ఆదరణ తీసుకొచ్చేందుకు వీరిని బ్రాండ్ అంబాసిడర్లగా నియమించారు.
ఆ నగరంలో క్రికెట్ బ్యాన్- ఒకవేళ ఆడితే రూ.10 వేలు ఫైన్! - Cricket Banned Country