Mohammed Shami ruled out of IPL : ఈ ఐపీఎల్ సీజన్ ప్రారంభానికి ముందే ఓ స్యాడ్ న్యూస్. గుజరాత్ టైటాన్స్‌కు ఎదురుదెబ్బ. ఆ జట్టు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ ఈ సీజన్ మెగా లీగ్‌కు అందుబాటులో ఉండట్లేదు. మడిమ నొప్పి తీవ్రతరం అయిన నేపథ్యంలో యూకేలో అతడు సర్జరీ చేయించుకోబోతున్నాడని ఓ బీసీసీఐ అధికారి చెప్పినట్లు ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కాగా వన్డే వరల్డ్ కప్ - 2023 తర్వాత రైటార్మ్ పేసర్ మహ్మద్ షమీ ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. సొంతగడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో ఆకాశమే హద్దుగా చెలరేగిన అతడు ఏకంగా మూడుసార్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. మొత్తంగా 24 వికెట్లు పడగొట్టాడు. తద్వారా ప్రపంచ కప్ -2023లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. అయితే ఈ టోర్నీలో అతడు ఎడమకాలి మడిమ నొప్పితో ఇబ్బంది పడ్డాడు. నొప్పి వేధిస్తున్నా బాధను దిగమింగుకుని ఆడాడు.
కానీ అనంతరం నొప్పి ఎక్కువ అవ్వడం వల్ల సౌతాఫ్రికా పర్యటనకు దూరమయ్యాడు. ఇప్పుడు స్వదేశంలో ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌కూ అందుబాటులో లేకుండా ఉండిపోయాడు. అయితే, మార్చిలో ప్రారంభంకానున్న ఐపీఎల్ 17వ సీజన్‌కు అయినా వస్తాడని అంతా ఆశించారు. కానీ ఇప్పుడది అసాధ్యమేనని తెలిసింది. ఈ మడిమ నొప్పి చికిత్స కోసం అతడు యూకేకు వెళ్లి సర్జరీ చేయించుకోనున్నట్లు ఓ బీసీసీఐ సీనియర్ అధికారి చెప్పినట్లు బయట కథనాలు వస్తున్నాయి.
ఇకపోతే ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ గత సీజన్లో తమ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. 17 మ్యాచుల్లో 28 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ అందుకున్నాడు. ఇకపోతే గత సీజన్లో ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్దిక్ పాండ్యా ఈ సారి ముంబయి ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దీంతో యువ క్రికెటర్ శుభమన్ గిల్ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. అయితే మరి ఇప్పుడు షమీ రూపంలో ప్రధాన బౌలర్ జట్టుకు దూరం అయిన నేపథ్యంలో ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది.
గాయమని రంజీ మ్యాచ్‌కు దూరం - శ్రేయస్ ఫిట్‌గా ఉన్నాడంటున్న ఎన్‌సీఏ