Manu Bhaker Olympics 2024: పారిస్ ఒలింపిక్స్‌లో భారత యువ షూటర్ మను బాకర్ 10మీ ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించడంతో అరుదైన రికార్డును ఆమె తన ఖాతాలో వేసుకుంది. ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా షూటర్‌గా రికార్డు సృష్టించింది. ఫైనల్‌లో మను బాకర్ 221.7 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని ముద్దాడింది. అలాగే ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్లో భారత్ 12 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ మను బాకర్ పతకం సాధించడం వల్ల ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. భారత రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ మను బాకర్‌ను అభినందించారు. అలాగే మను బాకర్ సాధించిన విజయం పట్ల ఆమె తండ్రి, కుటుంబ సభ్యులు సైతం హర్షం వ్యక్తం చేశారు.
నిన్ను చూసి దేశం గర్విస్తోంది- ద్రౌపదీ ముర్ము
'పారిస్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ షూటింగ్ ఈవెంట్ లో కాంస్య పతకంతో దేశానికి పతకాన్ని అందించినందుకు మను బాకర్ కు హృదయపూర్వక అభినందనలు. ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్ లో పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా మను బాకర్ నిలిచారు. ఆమెను చూసి దేశం గర్విస్తోంది. మను బాకర్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలి' అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఎక్స్ లో పోస్ట్ చేశారు.
'ఈ విజయం మరింత ప్రత్యేకమైనది'
మను బాకర్ కాంస్య పతకం సాధించడంపై ప్రధాని మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు. 'ఇదొక చారిత్రక పతకం. వెల్ డన్ మను బాకర్. పారిస్ ఒలింపిక్స్ లో దేశానికి మొదటి పతకాన్ని అందించావు. నీకు అభినందనలు. ఒలింపిక్స్ షూటింగ్ ఈవెంట్ లో భారత్ తరఫున పతకం సాధించిన మొదటి మహిళ మీరే. ఈ విజయం మరింత ప్రత్యేకమైనది' అని ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ మను బాకర్ ను అభినందించారు.
'దేశ ప్రజల ఆశీర్వాదం వల్లే'
దేశం మొత్తం మను బాకర్ ను చూసి గర్విస్తోందని ఆమె తండ్రి రామ్ కిషన్ బాకర్ తెలిపారు. మరో రెండు ఈవెంట్లలో మను పాల్గొంటుందని, వాటిలోనూ మెరుగైన ప్రదర్శన చేస్తుందని తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు. మనుకు ప్రభుత్వం, సమాఖ్య నుంచి చాలా మద్దతు లభించిందని వెల్లడించారు. దేశ ప్రజల ఆశీర్వాదం వల్లనే మనుకు ఇంత పెద్ద విజయం లభించిందని అన్నారు. మరోవైపు, మను బాకర్ కోసం స్పెషల్ ఫుడ్ సిద్ధం చేస్తానని ఆమె బామ్మ తెలిపారు. దేశం కోసం మను బాకర్ గొప్ప పని చేసిందని అభిప్రాయపడ్డారు. 'ఒలింపిక్స్ లో మను బాకర్ కు బంగారు పతకం వస్తుందనుకున్నాం. కాంస్యం సాధించింది. అయినా సంతోషంగా ఉన్నాం. మను ఒలింపిక్స్ లో కాంస్య సాధించడం దేశం గర్వించదగ్గ విషయం' అని మను బాకర్ బంధువు ఒకరు తెలిపారు.
కాగా, 2012లో లండన్ వేదికగా ఒలింపిక్స్‌లో భారత్ చివరిసారిగా షూటింగ్ ఈవెంట్లో పతకం గెలుచుకుంది. ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ షూటర్ విజయ్ కుమార్, మార్క్స్ మెన్ గగన్ నారంగ్ కాంస్య పతకాన్ని సాధించారు. గత రెండు ఒలింపిక్ సీజన్లలో షూటింగ్ ఈవెంట్లో భారత్‌కు పతకం రాలేదు.
MANU GETS THE BRONZE! 🥉
— SAI Media (@Media_SAI) July 28, 2024
She becomes the first woman shooter from India to win a medal at the Olympics!
She opens Team India's account at the #Paris2024Olympics with this!
A historic day at the Olympics for team Bharat!
A 221.7 on the day for the lady with the golden arm. 🎆 pic.twitter.com/OgwQfuEKFb
భారత్ ఖాతాలో తొలి పతకం- చరిత్ర సృష్టించిన మనూ బాకర్ - Paris Olympics 2024
సత్తాచాటిన తెలుగమ్మాయి శ్రీజ- షూటింగ్‌లో ఫైనల్‌కు రమితా జిందాల్ - Paris Olympics 2024