Longest Test Match: ప్రస్తుతం ధనాధన్ టీ20 ఫార్మాట్ ట్రెండ్ నడుస్తోంది. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌లకు ఆదరణ తగ్గిపోయింది. వన్డేలకు స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఎక్కువ మంది ప్రేక్షకులు తక్కువ సమయంలోనే అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకుంటున్నారు. కానీ ఒకప్పుడు 'టైమ్‌లెస్ టెస్ట్' మ్యాచ్‌లు జరిగాయని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉందా? 1939లో క్రికెట్ చరిత్రలోనే 'లాంగెస్ట్ టెస్ట్' మ్యాచ్ జరిగింది. దాదాపు 9రోజులపాటు సాగిన ఆ ఆటలో ఫలితం కూడా తేలలేదు. మరి ఆ మ్యాచ్ విశేషాలు మీకోసం.
లాంగెస్ట్ టెస్ట్ మ్యాచ్
డర్బన్‌లో ఇంగ్లాండ్- సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్ క్రికెట్‌లో అత్యంత సుదీర్ఘమైన ఆటగా రికార్డులకెక్కింది. గిన్నిస్ ప్రపంచ రికార్డును కూడా సొంతం చేసుకుంది. ఇదే చివరి 'టైమ్‌లెస్ టెస్ట్' మ్యాచ్. అంటే సమయానికి ఎటువంటి పరిమితి లేదు. ఫలితం వచ్చే వరకు మ్యాచ్ ఆడాల్సిందే. అయితే ఇంగ్లాండ్ వర్సెస్ సౌతాఫ్రికా టైమ్‌లెస్ టెస్ట్‌ని తొమ్మిది రోజుల తర్వాత రద్దు చేశారు. వర్షం అంతరాయం కలిగించడం, ఇంగ్లాండ్ జట్టు ప్రయాణించాల్సిన ఓడ సౌతాఫ్రికా నుంచి బయలుదేరాల్సిన సమయం రావడం వల్ల మ్యాచ్ రద్దైంది.
ఈ మ్యాచ్ 1939 మార్చి 3 నుంచి 14 వరకు 12 రోజుల పాటు జరిగింది. ఇందులో రెండు విశ్రాంతి రోజులు (మార్చి 5, 12) ఉన్నాయి. ఒక రోజు (మార్చి 11) మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేశారు. 43 గంటల 16 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో 1,981 పరుగులు నమోదయ్యాయి. బౌలర్లు 5,447 బంతులు సంధించారు.
మ్యాచ్ వివరాలు
ముందుగా సౌతాఫ్రికా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. పీటర్ వాన్ డెర్ బిజ్ల్ (125), డడ్లీ నర్స్ (103) రాణించడం వల్ల ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 530 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ఆటగాడు రెగ్ పెర్క్స్ 5 వికెట్లు తీశాడు. అనంతరం ఇంగ్లండ్ 316 పరుగులకే ఆలౌటైంది. లెస్ అమెస్ (84) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సౌతాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఎరిక్ డాల్టన్ 4 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా 214 పరుగుల ఫస్ట్ ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది. ఇక రెండో ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 481 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ అలాన్ మెల్‌విల్లే (103) సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ కెన్ ఫార్నెస్ 4 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఇంగ్లాండ్‌కి సౌతాఫ్రికా 696 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
అనంతరం ఇంగ్లాండ్ ఆరు రోజుల పాటు బ్యాటింగ్ చేసింది. ఇందులో రెండు రోజులు ఆట కొనసాగలేదు. మార్చి 14న 5 వికెట్ల నష్టానికి 654 పరుగులు వద్ద నిలిచింది. లక్ష్యానికి కేవలం 42 పరుగులు అవసరం. టీ తర్వాత వర్షం ఆటకు అంతరాయం కలిగించింది. ఆ తర్వాత ఇరు జట్లు గేమ్‌ను డ్రాగా ముగించేందుకు అంగీకరించాయి. ఇంగ్లాండ్ బ్యాటర్ బిల్ ఎడ్రిచ్ డబుల్ సెంచరీ సాధించగా, పాల్ గిబ్, వాలీ హమ్మండ్ సెంచరీలు బాదారు.
'టెస్టుల్లో 400 బాదే సత్తా వారికే ఉంది'- రోహిత్ విరాట్ కాదట! - Brian Lara Test Records
5 టెస్టుల సిరీస్ - రికార్డు స్థాయిలో అందుబాటులోకి టికెట్స్ - IND VS Aus Border Gavaskar Trophy