KKR vs SRH IPL 2024 : ఐపీఎల్ 2024 కీలక దశకు చేరుకుంది. దీంతో తుది పోరుకు ఆయా టీమ్స్ సంసిద్ధమవుతున్నాయి. లీగ్ దశను దాటుకుని వచ్చిన కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫైయర్ మ్యాచ్‌లలో తలపడనున్నాయి.
ఇక క్వాలిఫైయర్ 1లో భాగంగా అహ్మదబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మే 21న కోల్‌కతా నైట్‌రైడర్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. అయితే 20 పాయింట్లతో టాప్ పొజిషన్లో ఉన్న కోల్‌కతా, 17 పాయింట్లతో ఉన్న టాప్ 2లో ఉన్న హైదరాబాద్ తలపడనున్న ఈ పోరులో అత్యధిక స్కోరు చేయగల నలుగురు హీరోస్ ఎవరంటే?
సునీల్ నరైన్ : ఈ వెస్టిండీస్ మాజీ ఆల్-రౌండర్ మంచి ఫామ్ కనబరుస్తూ కోల్‌కతా నైట్ రైడర్స్‌కు పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఈ సీజన్‌లో 12గేమ్‌లు ఆడి 461 పరుగులు చేశాడు. మరోసారి అదే స్థాయిలో చెలరేగితే కోల్‌కతా భారీ స్కోరుకు చేరుకోవడం ఖాయమని విశ్లేషకుల మాట.
ఆండ్రూ రస్సెల్ : ఎటువంటి బంతులు దూసుకొస్తున్నా ధాటిగా సమాధానమిస్తూ కౌంటర్ విసురుతున్నాడు కరేబియన్ స్టార్ క్రికెటర్ ఆండ్రూ రస్సెల్. ప్రత్యేకించి సన్ రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 25 బంతుల్లో (3ఫోర్లు, 7సిక్సులు)తో 64 పరుగులు చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ అందించాడు. ఇతడు కూడా ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ మంచి స్కోర్ చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
అభిషేక్ శర్మ : సన్‌రైజర్స్ హైదరాబాద్ యువ కెరటం అభిషేక్ శర్మ, ఆడిన ప్రతి మ్యాచ్‌లోనూ తన సత్తా చాటుతూ దూసుకెళ్తున్నాడు. ఇప్పుటి వరకు చక్కనైన ఫామ్‌తో ఆకట్టుకున్న ఈ స్టార్, ఆడిన 13 గేమ్‌లలో 467 పరుగులు స్కోర్ చేశాడు. రానున్న మ్యాచ్‌లోనూ పరుగుల వర్షాన్ని కురిపించేందుకు తీవ్ర కసరత్తులు చేస్తున్నాడు.
హెన్రిచ్ క్లాసెన్ : ఈ సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఐపీఎల్ ఆరంభం నుంచే మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఒకానొక మ్యాచ్‌లో 29 బంతుల్లో 63 పరుగులు చేసిన క్లాసెన్, రానున్న మ్యాచ్‌లోనూ అద్భుతమైన ఫామ్ కనబరిచి సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మంచి స్కోరు తెచ్చిపెడతాడని ఆశిస్తోంది ఆరెంజ్ ఆర్మీ.
ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో గెలిచినవారు నేరుగా ఫైనల్‌కు చేరుకుంటే, ఓడిన వారు క్వాలిఫైయర్ 2 మ్యాచ్‌లో ఆడి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ఇదే సీజన్‌లో ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కేకేఆర్, ఎస్ఆర్‌హెచ్ మ్యాచ్‌లో కోల్‌కతా జట్టు 4 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇదిలా ఉంటే, క్వాలిఫైయర్ 1 ఓడిన వారు క్వాలిఫైయర్ 2లో తలపడతారు. అందులోనూ ఓడిపోతే ఇంటికి వెళ్లిపోవడమే. గెలిచిన వారు మాత్రం ఫైనల్లో తలపడే అవకాశం ఉంటుంది.
వర్షం కారణంగా క్వాలిఫయర్ 1 రద్దైతే - విజేత ఎవరు? - IPL 2024 Qualifier 1
5ఏళ్ల తర్వాత సన్‌రైజర్స్ అలా- అంతా కమిన్స్ వల్లే! - IPL 2024