KKR New Mentor 2025 : ఐపీఎల్ - 2025 సీజన్‌కు ముందు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు కొత్త మెంటార్ వచ్చేశాడు. తమ జట్టు మెంటార్‌గా వెస్టిండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావోను కేకేఆర్ మేనేజ్మెంట్ నియమించింది. గత రెండు సీజన్లలో చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన బ్రావో, ఇప్పుడు కేకేఆర్‌తో జతకట్టాడు. గంభీర్ స్థానంలో బ్రావో వచ్చే ఐపీఎల్ సీజన్లో కేకేఆర్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్నాడు. అన్నిరకాల క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు డ్వేన్ బ్రావో ప్రకటించిన గంటల వ్యవధిలోనే కేకేఆర్ మెంటార్‌గా నియమతులవ్వడం గమనార్హం.
జట్టులో భాగమవ్వడం సంతోషం - "డీజే బ్రావో కేకేఆర్‌తో చేరడం ఒక శుభపరిణామం. అతడి అపారమైన అనుభవం, లోతైన జ్ఞానం, గెలవాలనే కసి కేకేఆర్ ఫ్రాంచైజీకి, ఆటగాళ్లకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది. కేకేఆర్కే కాకుండా, టీ20 లీగ్స్‌లో నైట్ రైడర్స్ లేబుల్ క్రింద ఉన్న ఇతర ఫ్రాంచైజీలకు బాధ్యత వహిస్తాడు. సీపీఎల్, ఎంఎల్సీ, ఐఎల్ టీ20తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా ఇతర ఫ్రాంచైజీలతో బ్రావో భాగమవ్వడం చాలా సంతోషంగా ఉంది" అని నైట్ రైడర్స్ గ్రూప్ సీఈఓ వెంకీ మైసూర్ శుక్రవారం మీడియా ప్రకటనలో తెలిపారు.
కేకేఆర్ అంటే చాలా గౌరవం - మరోవైపు, కేకేఆర్ మెంటార్‌గా తనను నియమించడంపై డ్వేన్ బ్రావో స్పందించారు. తాను సీపీఎల్‌లో ట్రిన్ డాడ్ నైట్ రైడర్స్ తరఫున 10 ఏళ్లు ఆడానని తెలిపారు. వివిధ లీగ్‌లలో నైట్ రైడర్స్ వ్యతిరేకంగా చాలా మ్యాచుల్లో ఆడానని చెప్పుకొచ్చారు. కేకేఆర్‌పై తనకు చాలా గౌరవం ఉందని వెల్లడించారు. ఆటపై కేకేఆర్ మేనేజ్మెంట్కు ఉన్న అభిరుచి అద్భుతమని కొనియాడారు. "కుటుంబం లాంటి వాతావరణం ఉండటం కలిసొచ్చే అంశం. క్రికెటర్ పాత్ర నుంచి మెంటార్‌గా మారేందుకు చక్కని వేదికగా కేకేఆర్‌ను అనుకుంటున్నా. ఫ్రాంఛైజీతో కలిసి పనిచేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అని బ్రావో వ్యాఖ్యానించాడు.
గంటల వ్యవధిలో మెంటార్‌గా! - కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ఆడుతూ గాయపడిన విండీస్ దిగ్గజం డ్వేన్ బ్రావో, అన్ని రకాల క్రికెట్‌కు గుడ్ బై చెప్పుతున్నట్లు ఇన్ స్ట్రాగ్రామ్ వేదికగా శుక్రవారం తెలియజేశాడు. ఆ తర్వాత గంటల వ్యవధిలోనే కేకేఆర్ యాజమాన్యం తమ జట్టు మెంటార్‌గా నియమించింది. గత సీజన్లో గౌతమ్ గంభీర్ మెంటార్‌గా బాధ్యతలు నిర్వర్తించి కేకేఆర్‌ను ఛాంపియన్‌గా నిలిపాడు. అయితే అతడు భారత జట్టు ప్రధాన కోచ్‌గా రావడంతో ఖాళీ ఏర్పడింది. దీంతో డ్వేన్ బ్రావోకు మెంటార్‌గా అవకాశం దక్కింది.
"నా మనస్సు ముందుకు సాగాలని కోరుకుంటుంది. కానీ నా శరీరం ఇక నుంచి నొప్పి, ఒత్తడిని భరించదు. నా సహచరులను, అభిమానులను, నేను ప్రాతినిధ్యం వహించే జట్లను నేను నిరాశపరచలేను. కాబట్టి బరువెక్కిన హృదయంతో క్రికెట్ నుంచి తప్పుకుంటున్నా. నాకు అండగా నిలిచిన అభిమానులకు కృతజ్ఞతలు." అని ఇన్ స్టాలో పోస్టు చేశారు. కాగా, బ్రావో తన కెరీర్లో 582 టీ20లు ఆడాడు. 7వేల పరుగులు, 631 వికెట్లు పడగొట్టాడు.
కాన్పూర్ టెస్టులో టాస్ గెలిచిన భారత్ - ఆ ఛాలెంజ్‌ను స్వీకరించిన రోహిత్ సేన - IND VS BAN Kanpur Second Test