IPL 2024 Sunrisers Hyderabad VS Mumbai Indians : ఐపీఎల్ 2024లో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ - ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ పోరులో హైదరాబాద్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. సునామీ ఇన్నింగ్స్‌తో చెలరేగారు. ఫలితంగా ఆరెంజ్ ఆర్మీ చేతిలో ముంబయి ఓటమి పాలైంది. అయితే మ్యాచ్ తర్వాత ఈ ఓటమిపై హార్దిక్ స్పందించాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ 277 పరుగుల రికార్డు స్కోర్ చేస్తుందని టాస్ సమయంలో తాను అస్సలు ఊహించలేదని అన్నాడు. బౌలింగ్‌లో కాస్త భిన్నమైన ప్రణాళికలు అనుసరించాల్సి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. తమ కన్నా సన్‌రైజర్స్ అద్భుతంగా బ్యాటింగ్, బౌలింగ్ చేసిందని ప్రశంసించాడు. ఈ పరాజయం తమకు ఓ గుణపాఠం అని పేర్కొన్నాడు.
"సన్ రైజర్స్ అంత భారీ స్కోర్ చేస్తుందని ఊహించలేదు. మేమే కాదు ఎవరూ అనుకోలేరు కూడా. గ్రౌండ్ బాగా అనుకూలంగా ఉంది. బౌలింగ్ ఎలా వేసినా పరుగులు బాదేయడానికి కలిసొస్తుంది. ప్రత్యర్థులు అలా పరుగులు చేయగలిగారంటే, వాళ్లు బ్యాటింగ్ బాగా చేశారని అర్థం అవుతుంది. బౌలర్లు కూడా మంచి ప్రదర్శన చేశారు. ఇరు జట్లు కలిసి 500కు మించి పరుగులు చేశారు. ముందే మేం కొన్ని మార్పులు చేసి ఉండాల్సింది. అయినప్పటికీ మా బౌలర్లదంతా యంగ్ బౌలింగ్ అటాక్. ఇంకా మెరుగవుతారని ఆశిస్తున్నా. బంతి ప్రతీసారి క్రౌడ్ లోకి వెళ్లి వస్తుంటే, ఓవర్లు పూర్తి చేయడానికి చాలా టైం పట్టింది. బ్యాటర్స్ బాగా రాణించారు. మెఫాక ఆటతీరు బాగుంది. తొలి గేమ్‌లోనే దూకుడు కనిపించింది. ఇంకాస్త టైం దొరికితే చెలరేగిపోతాడు" అంటూ మ్యాచ్ గురించి మాట్లాడాడు పాండ్యా.
పాండ్యా రికార్డు - మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉన్నా, ఐపీఎల్ హిస్టరీలో సన్‌రైజర్స్ అత్యధిక స్కోరు నమోదు చేసినా, పాండ్యా వ్యక్తిగత స్కోరులో కూడా రికార్డు నమోదైంది. ఈ మ్యాచులో 20 బంతుల్లో 24 పరుగులు చేసి ముంబయి ఇండియన్స్ తరఫున 1500 పరుగులు పూర్తి చేశాడు. ముంబయి జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలి బాల్కే సిక్స్ బాది 100 సిక్సుల రికార్డు నమోదు చేశాడు. హార్దిక్ కన్నా ముందు కీరన్ పొలార్డ్ (223), రోహిత్ శర్మ (210)లు మాత్రమే ఈ ఫీట్ సాధించగలిగారు. మొత్తం ఈ టోర్నమెంట్‌లో ముంబయి ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జట్టులకు ప్రాతినిధ్యం వహించిన పాండ్యా 127 సిక్సులు నమోదు చేశాడు.
పాట్ కమిన్స్ - "ఇది చాలా అరుదైన విషయం. బంతి గ్రౌండ్ మొత్తం తిరుగుతూనే ఉంది. బౌలింగ్ వేసేటప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఆ తర్వాత పరుగులు పెడుతూనే ఉంది. ఐపీఎల్ లాంటి లీగ్‌లో మేమంతా ఒత్తిడి తీసుకుని ఆడుతుంటే, అభిషేక్ శర్మ మాత్రం పూర్తి స్వేచ్ఛతో చెలరేగిపోయాడు. మేం 270 స్కోరు చేయాలని అనుకోలేదు. కానీ, అధి సాధ్యపడింది. బౌండరీలతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. స్టేడియంలో కూడా అభిమానుల నుంచి మంచి ప్రోత్సాహం లభించింది. ఇక్కడ ఆడటం చాలా బాగుంది." అని వెల్లడించాడు కమిన్స్.
ఉప్పల్ ఊగిపోయింది - ముంబయిపై సన్‌రైజర్స్ అద్భుత విజయం - MI VS SRH IPL 2024