IPL 2024 Final Venue : ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 17 జోరుగా సాగుతోంది. ఈ ఉత్కంఠభరిత పోరులు, క్రికెట్ అభిమానులను అలరిస్తున్నాయి. ధోనీ-కోహ్లీ మధ్య జరిగిన తొలి పోరుతో దేశంలో ప్రారంభమైన ఐపీఎల్ ఫీవర్ పతాక స్థాయికి చేరుతోంది. సార్వత్రిక ఎన్నికల వేళ కేవలం తొలి దశ ఐపీఎల్ షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించిన బీసీసీఐ ఇప్పుడు తదుపరి షెడ్యూల్‌ను కూడా ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్-17 ఫైనల్ వేదిక ఖరారైనట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్‌కు చెన్నై ఆతిథ్యం ఇవ్వడం దాదాపుగా ఖాయమైందని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. మే 26న ఫైనల్ జరగనుందని వివరించాడు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఓ క్వాలిఫయర్, ఎలిమినేటర్‌ను నిర్వహించే అవకాశం ఉంది.
అయితే ఈ షెడ్యూల్‌పై వస్తున్న ఊహాగానాలు సరికొత్త ప్రశ్నలను లేపనెత్తుతున్నాయి. చెన్నై సూపర్ కింగ్స్‌లో కీలక ఆటగాడిగా ఉన్న మిస్టర్ కూల్, దిగ్గజ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనికి ఘనమైన వీడ్కోలు పలికేందుకు బీసీసీఐ, ఫైనల్‌ను చెన్నైకి కేటాయించిందన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
గత సంవత్సరం డిఫెండింగ్ ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సొంత మైదానంలోనే ఫైనల్ మ్యాచ్ నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయించిందని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. చెన్నై ఇప్పటివరకు 2011, 2012 ఏడాదుల్లో రెండు ఐపీఎల్ ఫైనల్స్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఈ రెండు ఫైనల్స్‌లో ఒకసారి చెన్నై టైటిల్ గెలవగా మరోసారి కోల్‌కత్తా గెలిచింది.
దిగ్గజ ఆటగాడు ఎం.ఎస్. ధోనీకి ఘన వీడ్కోలు పలికేందుకే 2024 ఐపీఎల్ ఫైనల్‌ను చెన్నైలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిందని అభిమానులు అంటున్నారు. ధోనీ ఇప్పటికే కెప్టెన్సీకి వీడ్కోలు చెప్పేశాడని మహీ వయస్సు కూడా 42 ఏళ్లని కొందరు గుర్తు చేస్తున్నారు. ఆ ప్రకారం ధోనీకి ఇదే చివరి ఐపీఎల్ అని అతనికి ఘన వీడ్కోలు పలికేందుకే ఐపీఎల్ మ్యాచ్‌లను ఫిక్స్ చేసి చెన్నై జట్టు ఫైనల్ సొంత మైదానంలో ఆడేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోందని కామెంట్లు పెడుతున్నారు.
అదే జరిగితే చెపాక్ మైదానంలో ధోనీకి ఘన వీడ్కోలు పలకవచ్చు అన్నది బీసీసీఐ ప్రణాళికని కూడా కామెంట్లు చేస్తున్నారు. భారత క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడికి ఘన వీడ్కోలు పలికేందుకే చెన్నైలో ఫైనల్ నిర్వహించాలన్న నిర్ణయాన్ని బీసీసీఐ ఉద్దేశపూర్వకంగా తీసుకుందని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.