IPL 2024 Dhoni Kohli : విశాఖ వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ధోనీ బ్యాటింగ్ చేసిన సమయంలో స్టేడియం దద్దరిల్లిపోయింది. ఆడేది సొంత మైదానం చెపాక్ కాకపోయినా విశాఖే అయినా అభిమానులు ధోనీ, ధోనీ నినాదాలతో హోరెత్తించారు. ధోనీ సూపర్ ఇన్నింగ్స్‌ను చూసి విశాఖ అభిమానులు ఉప్పొంగిపోయారు. దీంతో స్టేడియం మొత్తం ధోనీ నామస్మరణతో మార్మోగించేశారు.
మహీ తొలి బంతికే బౌండరీ కొట్టినప్పుడు స్టేడియం ఊగిపోయింది. ఆ సమయంలో చెవులు చిల్లులు పడే స్థాయిలో 128 డెసిబుల్స్ సౌండ్ నమోదైనట్లు రికార్డులు వెల్లడించాయి. ఈ సీజన్‌లో ఇంతటి సౌండ్ నమోదు కావడం ఇది రెండోసారి మాత్రమే. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేసినప్పుడు కూడా 128 డెసిబుల్స్ శబ్దాలు నమోదయ్యాయి.
చాలా ఏళ్ల తర్వాత కదా - ఐపీఎల్ 2024 టోర్నీలో భాగంగా ఆదివారం రాత్రి విశాఖపట్నంలో చెన్నై సూపర్ కింగ్స్ , దిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రిషబ్ పంత్ సారథ్యంలోని దిల్లీ క్యాపిటల్ జట్టు విజయం సాధించింది. అయితేనేం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ మాత్రం విశాఖలో దుమ్మురేపాడు. పాత ధోనీని తలపిస్తూ స్టేడియంలోని అభిమానులను ఉర్రూతలూగించాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో పాత ధోనీని తలపిస్తూ బౌలర్లను వణికించాడు. ఆకాశమే హద్దుగా చెలరేగి 16 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 37 పరుగులతో అజేయంగా నిలిచాడు.
దిల్లీ ఫ్రాంచైజీ ఈ విశాఖ మైదానాన్ని హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకున్నా గ్రౌండ్ అంతా పసుపుమయం అయిపోయింది. మ్యాచ్ గెలుపు దిల్లీదే అయినా ధోనీ మానియాతో అభిమానులు ఊగిపోయారు. మహేంద్ర సింగ్ ధోని జోరు చూశాక ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చి ఉంటే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉండేవని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ధోనీ సతీమణి సాక్షి ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ కూడా పోస్ట్ చేశారు. ఎలక్ట్రిక్ స్ట్రైకర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్దు అందుకుంటున్న ధోనీ ఫొటోను పోస్ట్ చేసిన సాక్షి మ్యాచ్‌ను ఓడిపోయామని ధోనీకి ఇంకా తెలియదనుకుంటా అంటూ సరదా క్యాప్షన్ కూడా ఇచ్చారు.
-
Highest peak Roars for any player in this IPL 2024:
— CricketMAN2 (@ImTanujSingh) April 1, 2024
128 DB - When Virat Kohli completed fifty at chinnaswamy.
128 DB - When MS Dhoni hits First boundary.
- Two GOATs, Two Brands of World Cricket. 🐐 pic.twitter.com/GYL002yRET
ఐపీఎల్ 2024 @10 డేస్ - హిట్ ఫ్లాప్ ప్రదర్శనలు ఇవే! - IPL 2024
ధోనీ దంచుడే దంచుడు - 8వ స్ధానంలో వచ్చి సిక్సర్ల వర్షం! - IPL 2024 DC VS CSK